నేటి పునీతులు: పునీత నికోలస్ ఆఫ్ ఫ్లు

ఫాదర్ ఆకుల ప్రసాద్
21 Mar 2026
సుగుణం: "సత్ప్రసాద ముని”
పునీత నికోలస్ గారు స్విట్జర్లాండ్ లోని ఫ్లూయెలి నందు క్రీ.శ.1417లో గొప్ప కతోలిక కుటుంబంలో జన్మించారు.క్యాంటన్ రాజ్య మిలటరీ సైన్యంలో కెప్టెన్ పనిచేసిన నికోలస్ గారు యుక్తవయసులోనే వివాహం చేసుకున్నారు.వీరికి పదిమంది సంతానం.క్యాంటన్ రాజైన 'ఒబ్ వాల్డెను' నికోలస్ గారిని సలహాదారుగా,రాజ్య న్యాయాధిపతిగా నియమించారు.క్రీ.శ.1467లో తన 50వ ఏట నికోలస్ గారు త్రియేకదేవుని దివ్యదర్శనాన్ని పొంది పరవశంతో ఆ పరమదేవుని సేవించ నిశ్చయించుకున్నారు. తన కోరికను తన భార్యతో చెప్పి ఆమె అనుమతి తీసుకొని, కుటుంబానికి భవిష్యత్తులో ఏలోటు రాకుండా వారికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసి కొండగూహల్లో ఏకాంతవాసానికి వెళ్లి,రాన్ ఫట్ అనేచోట సర్వసంఘ పరిత్యాగిగా దైవస్తుతిలో నిమగ్నమైయ్యారు.వీరి ఎడల ప్రజలు పూజ్యభావాన్ని పెంచుకుని నికోలస్ గారికి ఆ గుహనందు ఒక దేవాలయాన్ని నిర్మించారు.ఆ గుహలో నికోలస్ గారు ఎలాంటి ఆహారపానియాలు లేకుండా కేవలం దివ్యసత్ప్రసాదంతోనే 20 సం!రాలు తపస్సు ఆచరించి "సత్ప్రసాద ముని” గా కీర్తికెక్కారు.స్విస్ దేశంలోనూ మరియు చుట్టుప్రక్కల ప్రాంతాలలోనూ వీరి పుణ్యజీవితం ప్రాచుర్యంపొంది "బ్రదర్ క్లాజ్' గా పేరొందారు.ఆయన పుణ్యజీవితానికి ఆకర్శింపబడి ప్రజలు తండోపతండాలుగా వారిని దర్శించి దీవెనలను సూచనలను ఆయననుండి పొందేవారు.క్రీ.శ.1481లో స్విట్జర్లాండ్ దేశ వివిధ సామంతరాజ్యాల పాలకులు,రాజప్రతినిధులు దేశరాజకీయ సమస్య నిమిత్తం ఒకచోట సమావేశమై నికోలస్ గారిని ఆహ్వానించగా ఆయన దూరదృష్టితో,తన తపోబలంతో, దివ్యసందేశంతో ఆధునిక సమైక్య స్విట్జర్లాండు దేశానికి అంకురార్పణ చేశాడు.నికోలస్ గారి శాంతి నిర్ణయానికి ప్రజలంతా ఆయనకు జేజేలు పలికారు.నికోలస్ గారు క్రీ.శ.1487లో పరలోకప్రాప్తినొందారు.1947లో 12వ పయస్ పోపుగారు నికోలస్ గారిని పునీతులుగా ప్రకటించారు. నికోలస్ అనగా ప్రజా విజయం అని అర్ధం.
పునీత నికోలస్ గారా మాకొరకు ప్రార్దించండి!
బంగారు మాట:
ఓ ప్రభువా! నన్ను నీకు
దూరం చేయు వాటిని
తొలగించి,నన్ను నీతో
నిరంతరం జీవింపజేసేవాటిని
అనుగ్రహించు.
-పునీత నికోలస్ ఆఫ్ ఫ్లు
