తపస్సుకాల 24వ రోజు

Father kasper chatla
15 Mar 2026
ధ్యానాంశము :
కృతజ్ఞతలు - స్తుతులు - ఆరాధన
-ధ్యానవచనములు:-
"మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు అనెడు బలిని అలంపుడు.అటు పిమ్మట మీ ఆపదలలో మీరు నాకు మొరపెట్టుడు, నేను మీ ఇక్కటులను తొలగింతును. మీరు నన్ను కీర్తింపవచ్చును." (కీర్తన 50:15)
"కృతజ్ఞతాస్తుతులతో అతని మందిర ద్వారమున ప్రవేశింపుడు.గురిగీతములతో దేవాలయ ఆవరణమున అడుగిడుడు.అతనికి వందనములు అర్పింపుడు. అతని నామమును కీర్తింపుడు." (కీర్తన 100:4)
"నీవు పరమ పవిత్తుడవు. యిస్రాయేలీయుల స్తుతులనెడు సింహాసనము మీద ఆసీనుడవై ఉండువాడవు." (కీర్తన 21:3)
-ధ్యానము :-
మనము దేవుని సన్నిధిలో ప్రార్ధించుటకు చేరినపుడు మనకు దేవునికి మంచి సంబంధము ఏర్పరచేది కృతజ్ఞతాస్తుతులే. ఇశ్రాయేలీయులు చేసిన స్తుతుల సింహాసనంపై ఆసీనుడై, వారి మొరలను వినెడివారని కీర్తనాకారుడు పలుకుచున్నాడు.మన ఇంటికి ఎవరైనా ముఖ్యమైన వ్యక్తి వస్తే వారిని సాదరంగా ఆహ్వానించి, మంచి ఆసనం చూపించి కూర్చోమని చెప్పి,తరువాత వారితో మాట్లాడుతాము కదా, సృష్టికర్త అయిన దేవునికి మనం మొదట కృతజ్ఞతాస్తుతులనెడి బలిని సమర్పించి,ఆ తర్వాత మనము ప్రార్ధనచేయాలి. అప్పుడు తప్పక మన మొరను ఆలకించి ఆపదలనుండి తొలగిస్తానని పలుకుచున్నారు. కృతజ్ఞతాస్తుతి అను బలిని అర్పించువాడు నన్ను గౌరవించును (కీర్తన 50:23). మన ప్రార్థనలో ముందు దేవునికి బలిని అర్పించి గౌరవించాలి.దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆత్మయందు,సత్యమందు నిజముగా ఆరాధించువారి కోసం దేవుడు ఎదురుచూస్తున్నారు.
- ఆత్మపరిశీలన :-
నా ప్రార్ధనలో దేవుని నేను స్తుతించుచున్నానా? కృతజ్ఞతాస్తుతులు సమర్పించే అలవాటు ఉన్నదా? నిజమైన ఆరాధన, ఆత్మతోను, సత్యముతోను చేయుచున్నానా? నా ఆరాధన ఎలా ఉంది?
- ప్రార్ధన:-
స్తుతుల సింహాసనాసీనుడవైన దేవా! మీరు చేసిన మేలులకు వందనాలు,స్తోత్రాలు తండ్రీ! ఆత్మతోను,సత్యముతోను ఆరాధించుటలో చూపించిన నిర్లక్ష్యం బట్టి క్షమించండి ప్రభూ! మీనుండి ఎన్నో ఆశీర్వాదాలు పొంది,తిరిగి కృతజ్ఞతలు చెల్లించు మంచి హృదయము నాకు ప్రసాదించుమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాను ఆమెన్...
