విశ్వం ఒకటేనా? లేక అనేక విశ్వాలున్నాయా?

శ్రీ.k.పూర్ణానందం
15 Mar 2026
ఈ మహా విశ్వం లో…..
అంతరాంతర వలయాల్లో
ఎటుచూసినా దట్టమైన చీకటి
మిరుమిట్లు గొలిపే వెల్గులు
నక్షత్రాలు పేలి పోవడం
గెలాక్సీలు కలిసి పోవడం
సూర్యుళ్ళు కుంచించి పోవడం
ఉన్నవి మాయమవడం
లేనివి ఉత్పన్నమవడం
అనునిత్యం, ఏదో ఒక చోట
ఇలా జరుగుతూ వుంటుంది
*మరి, ఇక్కడ….*
ఈ చిన్ని భూగోళం పైన, అన్నీ స్వార్థంతో కూడిన చిహ్నాలే….
దేశాన్ని మరో దేశం
రాష్ట్రాన్ని మరో రాష్ట్రం
ఊరును మరో ఊరు
ప్రాంతాన్ని మరో ప్రాంతం
కుటుంబాన్ని మరో కుటుంబం
వ్యక్తిని మరో వ్యక్తి
విద్యార్థిని మరో విద్యార్థి
ఉద్యోగిని మరో ఉద్యోగి
కులాన్ని మరో కులం
మతాన్ని మరో మతం
వేధిస్తూ, శోధిస్తూ ఉండటం
ప్రతిరోజూ చూస్తున్నాం….
ద్వేషం, ఆవేశం
దోషాలను పెంచుతాయి.
ప్రేమ, సమాధానం
ప్రశాంతతను పంచుతాయి.
అయ్యో, తెలివైన ప్రజానీకం
నిజాన్ని తెలుసుకోకుండా
నీరసించి పోతున్నారు.
ఏవో కారణాలు చెబుతూ
మారణహోమం చూస్తున్నారు అణువణువునా
అణగారిపోతున్నారు.
ప్రపంచ అణుభారాన్ని
పాలకుల అణ్వాయుధాల్ని
కూడ మోస్తున్నవారలారా….
మంచివైపు మరలండి.
జ్ఞానాన్ని ఆస్వాదించండి.
ప్రేమను పెంపొందించండి.
*అసలు సిసలైన…..*
మేధావుల ప్రశ్నలు
అలాగే వున్నాయి….
విశ్వం ఒకటేనా? లేక
అనేక విశ్వాలున్నాయా?
