చీకటి నుండి వెలుగును

Rev. Fr. Sesetti Mariadas M.S.F.S.

14 Mar 2026

తపోకాల నాల్గవ ఆదివారం
1 సమూ. 16:19, 6-7, 10-13ఎ,
ఎఫేసీ 5:8-14,
యోహాను 9-1-41
ఒక 5వ తరగతి చదువుచున్న బాలునికి ఒక తల్లి ఉండేది. ఆమెకు ఒక కన్ను లేదు. అందువలన ఆమె అందవికారంగా ఉంది. దాని కారణంగా ఆ బాలుడు తన తలిని ఎప్పుడూ ప్రేమించలేదు. ఆమెను చూస్తేనే ఎప్పుడూ ద్వేషం, భయం. ఆమె ఉపాధ్యాయులకు పిల్లలకు వంట వండుతూ తన కుటుంబాన్ని సాకేది. ఒక రోజు ఈ బాలుని తల్లి తన కుమారుని చూడటానికి బడికి వెళ్ళింది. అది తెలిసిన ఆ బాలుడు కోపంతో అసలు నీవు ఎందుకు బడికి వచ్చావు అని కోపంతో కసురుకొని, ఆమె ఎవరో తెలియనట్లు ప్రవర్తించి, ఆ తల్లి దగ్గర నుండి పారిపోయాడు. ఆ తరువాత రోజు ఈ బాలుని స్నేహితుడు ఒకడు గేళీ చేస్తూ మీ అమ్మకు ఒక్క కన్ను మాత్రమే ఉ ంది అని ఏడిపించాడు. ఈ సమయంలో ఆ బాలునికి చనిపోవాలనిపిం చింది. అంతేకాకుండా మా అమ్మ కనిపించకుండాపోతే బాగుంటుంది అని అనుకొన్నాడు. ఆ తరువాత నీ వలన నన్ను అందరూ ఎగతాళి చేస్తూ ఉన్నారు. అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. నీవలన నాకు ఏమీ లాభం లేదు. నీవు చస్తేనే మంచిది అని తన తల్లిని కోపంతో తిట్టాడు. ఆ మాటలు విన్న ఆ తల్లి పల్లెత్తి మాట కూడా అనలేదు. ఆ ఇంట్లో నుండి బయటకి వెళ్ళిపోయి కష్టపడి చదవటం మొదలు పెట్టాడు. ఆ తరువాత సింగపూర్ వెళ్ళటానికి అవకాశం రావటంతో అక్కడకు వెళ్ళి చదువుకున్నాడు. ఆ తరువాత పెళ్ళిచేసుకొన్నాడు. ఒక సొంత ఇల్లు కొనుక్కొన్నాడు. పిల్లలకు తండ్రి కూడా అయ్యాడు. ఎంతో ఆనందంతో జీవిస్తున్నాడు. అకస్మాత్తుగా ఒక రోజు తన తల్లి తనకు చూడటానికి వచ్చింది. చాలా సంవత్సరాలు ఆమె తన కుమారునిగాని, తన కుమారుని పిల్లలను గాని చూడలేదు. ఆమెను చూసి, తన కుమారుని పిల్లలు ఆహ్వానం లేకుండా తన ఇంటికి వచ్చినందుకు నవ్వి, కించపరిచారు. ఇదే అదునుగా ఆ కుమారుడు మరలా కోపంతో నా ఇంటికి రావటానికి నీకు ఎంత ధైర్యం? నా పిల్లలు నిన్ను చూసి భయపడుతున్నారు. నీవు ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపో అని తరిమేసాడు. దీనికి తన తల్లి ఎంతో సావధానంగా నన్ను క్షమించండి. నేను పొర పాటున మీ ఇంటికి వచ్చాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయింది.

ఒక రోజు తను చదువుకున్న బడి నుండి పాత విద్యార్థులందరికీ ఆహ్వానాన్ని పంపుతూ ఒక గేదరింగ్ ఏర్పాటు చేసారు. ఇది చూసిన ఆ కొడుకు తన భార్యతో నేను పనిమీద ఊరికి వెళ్తున్నాను అని అబద్ధం చెప్పి తను చదువుకొన్న బడికి వెళ్ళాడు. అది పూర్తి అయిన తరువాత తన పాత పూరిల్లుని చూడటానికి వెళ్ళాడు. అక్కడ ఉన్న ఇరుగుపోరుగువారు మీ అమ్మ చనిపోయింది అని చెప్పారు. కాని కొడుకు ఒక కన్నీరు బొట్టు కూడా రాల్చలేదు. ఆ తరువాత వాళ్ళు తన తల్లి ఒక ఉత్తరం వ్రాసి ఇచ్చిందని అతనికి అందచేసారు. ఆ తల్లి తన ఉత్తరంలో ఈ విధంగా వ్రాసింది. నా ప్రియాతి ప్రియమైన కుమారుడా నేను నీగురించి ఆలోచించని క్షణం లేదు. నేను నిన్ను చూడటానికి సింగపూర్ వచ్చి, నిన్ను నీ పిల్లలను బాధపెట్టినందుకు నన్ను క్షమించు, నీవు నీ బడిలో జరిగే గేదరింగ్ కి వస్తున్నావని విని ఎంతో ఆనందం చెందాను. కాని నేను మంచం మీద నుండి లేచే ఓపిక, శక్తి నాకులేవు. నీవు పెరుగుతూ ఉన్నప్పుడు నా ఒంటి కన్ను ద్వారా నిన్ను బాధించినందుకు నన్ను క్షమించు. కాని ఒక్క విషయం నీవు తెలుసుకోవాలి. నీవు చాలా చిన్నవాడిగా ఉన్నప్పుడు నీకు ఒక ఏక్సిడెంట్ అయ్యింది. ఆ ఏక్సిడెంట్ లో నీ కన్ను పోయింది. నీకు తల్లిగా నీవు ఒంటి కన్ను పిల్లవాడిగా ఎదగటానికి నా మాతృహృదయం తట్టుకోలేక తల్లడిల్లిపోయింది. అందుకే నా కన్ను తీసి నీకు పెట్టాను. నీవు రెండు కళ్ళతో ఆనందంగా ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉంటే నేను పొంగిపోయాను. నాకు బదులుగా నీకు రెండు కళ్ళు ఉండటం నేను ఆనందించాను. ఇట్లు ప్రేమతో నీ తల్లి.

ఈనాటి మొదటి పఠనములో యావే ప్రభువు సమూవేలు ద్వారా ఇజ్రాయేలుల రాజును ఎన్నుకొనుట మనము చూస్తూ ఉన్నాము. ఈ ఎన్నికలో ఒక ప్రత్యేకత ఉంది. యావే ఎవరిని పడితే వారినిగాని, కుటుంబంలో ఉన్న పెద్దలనుగాని రాజుగా అభిషేకించటం లేదు. యావే దేవుడు మనిషి ఆకారమును, బాహ్యా అందమును చూసి దావీదును ఎన్నుకొనలేదు. యావే దేవుడు దూరదృష్టి గలవాడు. యావే దావీదు అంతరంగమును చూసి దావీదును రాజుగా అభిషేకించెను. ఇజ్రాయేలుల రాజు యావే దేవుని పోలి జీవించవలెను. యావే అభిషేకించిన రాజు సద్గుణములు కలిగి, ఆధ్యాత్మిక ఎదుగుదలకు తోడ్పడవలెను. దావీదు కన్నా పెద్దవారు యీషాకి పుట్టెను. వారిలో అందరినీ సమూవేలు చూసెను కాని యావే దేవుడు వారిని అభిషేకించ ఇష్టపడలేదు. సమూవేలు ప్రవక్త అయినప్పటికీ అంతరంగమున ఏముంది అని గ్రహించలేని గుడ్డివాడిగా ఉన్నాడు. యావే దేవుని సహాయమువలన, దేవునికి ఇష్టమైన దావీదును కనువిప్పుతో ఎన్నుకొని ఇజ్రాయేలుల రాజుగా అభిషేకించెను.

రెండవ పఠనము ద్వారా పునీత పౌలు ఎఫెసీయులను వెలుగు పుత్రులుగా జీవించాలని బోధిస్తూ ఉన్నాడు. పునీత పౌలు ఈ ప్రదేశంలో దారిదాపుగా రెండు మూడు సంవత్సరాలు జీవించెను. పునీత పౌలు ఆయన సువార్తసేవలో 16 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నాడు. ఈ ప్రక్రియలో అందరూ మారు మనస్సు కలిగి దేవుని వెలుగులో జీవించాలని ఆకాంక్షిస్తున్నాడు. జ్ఞానస్నానము పొందకమునుపు మనము అందరమూ పాపములో పడి ఉన్నాము. అంధకారములో జీవిస్తూ ఉన్నాము. పాపపు క్రియలతో, పాపపు ఆలోచనలతో కాలాన్ని గడుపుతూ ఉన్నాము. కాని జ్ఞాన స్నానములో అంధకారాన్ని పోగొట్టే నిజమైన వెలుగు అయిన క్రీస్తు ప్రభుని స్వీకరించి పాపపుటంచుల్లో నుండి బయటకు రాగలుగుతున్నాము. మార్పు కలిగి జీవించటానికి ప్రయత్నిస్తున్నాము. ఏ విధంగా అయితేనే క్రీస్తు ప్రభుని పవిత్రతను పొందగలం. మన క్రీస్తు ప్రభువు మరణమును జయించి పునర్జీవితమును ప్రసాదించినది, మనలను ఈ పాపాలనుండి వ్యసనాలనుండి కాపాడి మన అంధకారాన్ని తొలగించి మనకు ప్రకాశవంతమైన వెలుగును ఇవ్వటానికి, అందుకే క్రైస్తవులమైన మనమంతా పాపమనే అంధకారాన్ని విడిచి క్రీస్తు అనే వెలుగును ధరించాలి అని ఈ రెండవ పఠనము మనలను సవాలు చేస్తూ ఉంది.

సువిశేష పఠనములో పుట్టు గ్రుడ్డివానికి దృష్టిని దానము చేయుట మనము వినియున్నాము. ఆనాటి ప్రజలు ఆ గ్రుడ్డివాని అంధత్వానికి కారణం తను చేసిన పాపములు అని లేదా తన తల్లిదండ్రుల పాపములు అని భావిస్తూ ఉండగా క్రీస్తు ప్రభువు వారి తలంపులు నిజంకాదని, దేవుని మహిమను ఈ లోకానికి తెలియపర్చటానికి ఇది దేవుని ప్రణాళిక అని తెలియజేస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభువులో, పాపమును, అస్వస్థతను తీసివేసే శక్తి ఉందని మనము గ్రహించాలి. ఇక్కడ ఫారసీయుల క్రీసు ప్రభువు చేసిన అద్భుత క్రియను విని, అక్కడ ఉన్న ప్రజలను, గ్రుడ్డివాని తల్లిదండ్రులను పుట్టి గ్రుడ్డివానిని ప్రశ్నించి, పరీక్షించి క్రీస్తును ఒక పాపాత్మునిగా చిత్రీకరించటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రక్రియలో ఆయనలో ఒక నూతనమైన శక్తి ఉందని, ఆయన ఒక ప్రవక్త అని అందరికి కనువిప్పు కలిగింది. ఈ అద్భుతము ద్వారా క్రీస్తు ప్రభువు ప్రజలందరికి దేవునియందు విశ్వాసం ఉంచాలని ఆహ్వానిస్తూ ఉన్నారు. తను సాక్షాత్తు దేవుని కుమారుడని, పాపులను రక్షింపవచ్చిన మెస్సయా అని ఈ అద్భుతము ద్రువీకరిస్తూ ఉంది. ఈ తపస్సుకాలంలో కళ్ళుండి, కళ్ళులేని కబోధులుగా జీవించే అనేక మందికి కనువిప్పు కలగాలి. ఈ సువిశేష పఠనము నిజంగా క్రీస్తు ప్రభువును తెలుసుకోవటానికి ఆయనను విశ్వసించటానికి, మన జీవితాలు మార్చు కోవటానికి ఒక చక్కని అవకాశం కల్పిస్తూ ఉంది.

కుష్ఠురోగం సోకిన వ్యక్తి శరీరం స్పర్శను, చలనాన్ని కోల్పోయి మొద్దుబారి నట్టుగా ఉంటుంది. ఇది కుష్ఠురోగం యొక్క ప్రతిఫలం. అదే విధంగా పాపంలో పడి, ప్రపంచ వ్యసనాలలో కొట్టుమిట్టాడుతూ, శారీరక వ్యసనాలలో కూరుకుపోయిన వారికి ఆధ్యాత్మిక జీవితం అంధకారంగా మారిపోయింది. పుట్టు గ్రుడ్డివాడు "పుట్టు గ్రుడ్డివాడు” అనే పదానికి ఒక లోతైన అర్థం ఉంది. ఈ పుట్టు గ్రుడ్డితనం సర్వమానవ లోకాన్ని సూచిస్తూ ఉంది. ఈ లోకంలో కళ్ళుండి ఎవరైతే నిజాలను చూడలేకుండా ఉన్నారో, సత్యాలను తెలుసుకోలేకుండా ఉన్నారో వారికి నిదర్శనంగా ఉంది. అంతే కాకుండా అంధులను, అనారోగ్యముతో ఉన్నవారిని ఆనాటి సమాజం అంటరాని వారిగా పరిగణించేది. వారు చేసిన పాపం వలననే ఈ కష్టం, లేదా ఈ రోగం వచ్చిందని వారు అభిప్రాయపడేవారు. ముఖ్యంగా ఈ పుట్టు గ్రుడ్డివాడు తన తల్లి గర్భంలోనే పాపం చేసి ఉంటాడని లేదా తన తల్లిదండ్రుల పాపంవలన ఈ అంధత్వం వచ్చింది అని చెప్పే అంధకారంలో ఆనాటి సమాజం ఉంది. అందుకే క్రీస్తు ప్రభువు దీనిని వ్యతిరేకిస్తూ ఉన్నారు.

పక్షవాతరోగిని కొందరు యేసు పాదాల చెంతకు చేర్చినప్పుడు వారి విశ్వాసమును చూసి, ఓయీ! నీ పాపములు క్షమించబడినవి. (లూకా 5:17-26) వ్యభిచారమున పట్టుబడిన స్త్రీకి “నేనును నీకు శిక్ష విధింపను, వెళ్ళుము, ఇక పాపము చేయుకుము” అని చెప్పెను. (యోహాను 8:11) ఈ విధంగా యేసు పలికిన పలుకుల ద్వారా పాపాలకు, దీర్ఘకాల వ్యాధులకు, శారీరక లోపాలకు దగ్గర సంబంధం ఉందని ఆనాటి ప్రజల మనస్సుల్లో బలంగా నాటుకుపోయింది. అందుకే క్రీస్తు దీనిని సవరిస్తూ ఇది దేవుని మహిమను బయలుపరచడానికని ఒక్కానించుచున్నారు. ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే పుట్టి గ్రుడ్డివానికి స్వస్థత దయచేయటం అంటే మనందరికీ నూతన బ్రతుకును ప్రసాదించటమే. క్రీస్తునితో సహవాసం చేస్తే మనము వెలుగులో ప్రయాణిస్తాం. అదే వెలుగును అందరికీ పంచుతాం. ఒకరికి వెలుగును ప్రసాదించటం అంటే వారికి జీవమును ఒసగటం. అక్కడ ఉన్న ప్రధాన అర్చకులు, ఫరిసయ్యులు వెలుగును వ్యతిరేకిస్తూ, ఇంకా చీకటినే ఆస్వాదిస్తూ, ప్రజలను మోసం చేస్తూ, దోచుకొంటూ జీవించటానికే సిద్ధంగా ఉన్నారు కాని, యేసుని వెలుగును పొందటానికి సిద్ధంగా లేరు. వారు ఆ పుట్టు గ్రుడ్డివానికి చూపు వచ్చిందని ఆనందిం చటం మానివేసి, దేవుని స్తుతించటం మరచిపోయి, కళ్ళుండి చూడలేని కబోధులుగా ఉన్నారు.

క్రీస్తు ప్రభువే నిజంగా ఈలోకానికి వెలుగు అని మనం గ్రహించాలి, విశ్వసించాలి. పగటివేళనే నన్ను పంపినవాని పనులు మనము చేయుచుండ వలెను. రాత్రి దగ్గర పడుచున్నది. అప్పుడు ఎవడునూ పని చేయలేడు” ఇక్కడ పగటివేళ అనగా మన జీవితకాలము అని 'రాత్రి' అనగా 'మరణము' 'చీకటి' 'పాపము' అని నిగూఢమైన అర్థాలు ఉన్నాయి. మనం జీవించి ఉన్నప్పుడే దేవుని క్రియలు, సత్కియలు, మంచి పనులు చెయ్యాలి, చెయ్యగలం. మరణించిన తరువాత మనము ఏమీ చెయ్యలేమని దీనర్థం. ఈ లోకమున నేను ఉన్నంతకాలము నేను లోకమునకు వెలుగును” నేను ఈ లోకంలో మానవునిగా ఉన్నప్పుడే వెలుగును పొందండి. నాకు రాత్రి రాబోతూ, ఉంది. అంటే మరణము రాబోతూ ఉంది. అప్పుడు నేను ఈ దేవుని పనులు కొనసాగించలేను అని అర్థం. అందుకే అతని పనులను కొనసాగించటానికి తన శిష్యులను మరే ఈ లోకానికి ఉప్పుగా, వెలుగుగా ఉన్నారు అని సంబోధించారు. (మత్త. 5:14).

క్రీస్తు ప్రభువు “నేల మీద ఉమ్మివేసి, ఆ ఉమ్మితో మట్టిని కలిపి, గ్రుడ్డివాని కనులమీద వ్రాసారు”. ఆదికాండములో దేవుడు మనిషిని మట్టినుండి చేసారు. ఇప్పుడు క్రీస్తు ప్రభువు తన ఉమ్ముతో మట్టిని కలపటం ద్వారా ఈ పాపపు మానవ జాతిని, కనులుండి చూడలేని మనలను పవిత్ర పరుస్తూ ఉన్నారు. మరల నూతన సృష్టిని చేస్తూ ఉన్నారు. ఆదిలో దేవుడు మన ముక్కు రంద్రాలలో జీవమును ఇచ్చినటు. అంధకారంలో జీవిస్తూ ఉన్న మనకు వెలుగును ప్రసాదిస్తూ ఉన్నారు.

పుట్టు గ్రుడ్డివాని విశ్వాస ప్రయాణం :

ఎవరు నీకు చూపు నిచ్చారు : యేసు అను మనుష్యుడు అతని మీద నీ అభిప్రాయం ఏమిటి ? ఆయన ఒక ప్రవక్త నీవు మనుష్య కుమారుని విశ్వసించుచున్నావా? ప్రభూ నేను విశ్వసించుచున్నాను. ఈ పుట్టు గ్రుడ్డివాని తల్లిదండ్రులు వీరు ప్రార్థనా మందిరము నుండి బహిష్కరింప బడుదరేమోనని భయంతో ఇంకా అంధకారంలోనే ఉన్నారు. కాని ఈ పుట్టు గ్రుడ్డి వాడు దేనికి భయం లేకుండా, విశ్వాసాన్నిమాటతో సమాధానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఎవరు శిక్షించినా, ఎవరు వెలివేసినా భయంలేకుండా ప్రవేశించాడు.

మనము అందరమూ దేవుని యొక్క మహిమను ఈ ప్రపంచంలో చాటి చెప్పటానికి పుట్టి గ్రుడ్డివానిగా జన్మించాము. ఎప్పుడైతే మనము క్రీస్తుని విశ్వసించి, మన విశ్వాసాన్ని ప్రకటించి, మంచి క్రియలు చేస్తూ క్రీస్తును అనుసరిస్తామో అప్పుడు క్రీస్తు వెలుగును మనము గ్రహించడమే కాకుండా, క్రీస్తుని వెలుగును ఇతరులకు పంచగలము.

చాలాసార్లు అర్థం పర్థంలేని నియమనిబంధనలకు పోయి మనము అంధులుగా జీవిస్తూ ఉంటాం. యేసుతో ఈ పాపాత్ముడు మాకు తెలియును అని పలుకుటలో వారిలో మూర్ఖత్వం బయలు పడుచూ ఉన్నది. అందుకే మన హృదయాలలో ఈ సమయాన కొన్ని ప్రశ్నలు మెదలాలి. నేను దేవుని వెలుగును పొందటానికి పూర్ణ హృదయముతో ప్రయత్నిస్తున్నానా? నేను ఆధ్యాత్మికంగా అంధకారంలో జీవిస్తున్నానా? నేను పవిత్ర గ్రంథంలో ఉన్న విషయాలను పెడచెవిని బెడుతూ చీకటిలో ఉన్నానా? నేను సామాన్య ప్రజలను గౌరవిస్తూ ఉన్నానా ?

పాపాలు చేసేవాళ్ళు బోధన తిరస్కరించేవాళ్ళు, గర్విస్తులు నిజమైన అంధులు. యేసుని అంగీకరించిన పుట్టు గ్రుడ్డివాడు, నిజమైన దృష్టిని పొందాడు.

అభ్యాస క్రియలు :
1. బాహ్య అంధానికి విలువన్వికుండా అంతరంగిక అందానికి విలువ నివ్వటానికి ప్రయత్నించటం.
2. యేసుని విశ్వసించి, ఆయన వెలుగును ఈ లోకానికి పంచటం కోసం ఏదైనా ఒక మంచి ప్రతీ రోజు చెయ్యటానికి ప్రయత్నించటం.
3. అర్థం, పర్థం లేని నమ్మకాలను, సిద్ధాంతాలను, ఆచారాలను గ్రుడ్డిగా ఆచరించకుండా దానిలోని విలువను గ్రహించి జీవించటానికి ప్రయత్నించటం.
4. నాలో ఉన్న అంధకారం తెలుసుకొని వెలుగు నింపుకోవటానికి ప్రయత్నించటం.

కంఠత వాక్యము :
లోకమును వెలుగును నేనే. నన్ను అనుసరించువాడు అంధకారమున నడువక జీవపు వెలుగును పొందును. (యోహాను 8:12)

సుకృత ప్రార్థన :
ఓ నా యేసువా నీవే ఈ జగతికి జ్యోతివి. నాలో ఉన్న గర్వమనే అంధకారమును, కోపమనే అంధకారమును, ద్వేషమనే అంధకారమును, పాపపు ఆలోచనల ద్వారా వచ్చే అంధకారమును, స్వార్థమనే అంధకారమును, శారీరక వ్యసనాల ద్వారా ఉన్న అంధకారమును, తీసివేసి మీ వెలుగు నా జీవితంలో పొంది, మిమ్ములను విశ్వసించి, జీవించటానికి నాకు సహాయము చేయండి. ఆమెన్.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN