తపస్సుకాల 22వ రోజు

Father kasper chatla
13 Mar 2026
ధ్యానాంశము:
హృదయ పరివర్తనము - నూతన హృదయము
-ధ్యానవచనములు:-
"మీరు చేయు పాపకార్యముల నుండి వైదొలగి నూత్న హృదయమును,నూత్న మనస్సును పొందుడు.మీరు చావనేల?" (యెహెజ్కేలు 18:31)
“నరుడు వెలుపలి రూపును చూచును. కాని దేవుడు
హృదయమును అవలోకించును." (1 సమూయేలు 16:7)
"అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును పదిలము చేసికొనుము.నీ జీవనగతికి ఆధారమదియే."(సామెతలు 4:23)
"దేవా! నాలో నిర్మల వృదయమును సృజింపుము. నూతనమును, స్థిరమునైన మనస్సును నాలో నెలకొల్పుము" (కీర్తనలు 51:10)
"హృదయ పరివర్తనము పొందు ఒక పాపాత్ముని విషయమై పరలోకములో ఎక్కువ ఆనందము ఉండునని మీతో చెప్పుచున్నాను (లూకా 15:7)
-ధ్యానము:-
మనం దేవున్ని దర్శించాలి అంటే మన హృదయాలు నిర్మలముగను, నూతనముగను ఉండాలి. హృదయశుద్ధిగలవారు ధన్యులు వారు దేవుని దర్శించెదరు అని మన ప్రభువు బోధిస్తున్నారు.కాని మనయొక్క హృదయములనుండి అనేకవిధములైన చెడు వెలువడి మనలను మలినపరచుచున్నట్లుగా ప్రభువు మార్కు సువార్త 7వ అధ్యాయము 21, 22 వచనములలో హెచ్చరిస్తున్నారు. "ఏలయన హృదయము నుండి దురాలోచనలు, వేశ్యాసంగమము, దొంగతనము,నరహత్య,వ్యభిచారము,దురాశ, దౌష్ట్యము,మోసము,కామము, మాత్సర్యము,దూషణము, అహంభావము,అవివేకము వెలువడును.ఇట్టి చెడుగుణాలు అన్నియు మానవుని అంతరంగము నుండియే వెలువడి అతనిని మలినపరచును" అందుకే యిర్మియా ప్రవక్త "హృదయమునకు ఉన్నంత కపటము దేనికి లేదు" అని అంటున్నారు. ఎప్పుడైతే మన పాపముల కొరకు పశ్చాత్తాపపడతామో అప్పుడే దేవుడు మనకు హృదయపరివర్తనను దయచేస్తారు అంటున్నారు. ఇటువంటి మలినాలను తుడిచివేసి నిర్మల మనస్సుతో దేవుని ముందుకు తీసుకొనివచ్చేదే పశ్చాత్తాపము. ఎప్పుడైతే మన పాపముల కొరకు పశ్చాత్తాప పడతామో అప్పుడే దేవుడు మనకు హృదయ పరివర్తనను దయచేస్తారు
అందుకే "దేవా! నీ ఎదుట పాపము కట్టుకొనకుండునట్లు,నీ వాక్యములను నా వృదయమునందు ముద్రించుకొనుచున్నాను" అని కీర్తనాకారుడు పలుకుచున్నాడు.కనుక ప్రతి ఒక్కరు పశ్చాత్తాపముతో మరియమగ్దలేన వలె దేవుని పాదములు పట్టుకొనినప్పుడు ఆయన మనలను శుద్ధి చేస్తారు,మన మాలిన్యాన్ని కడుగుతారు.నిజముగా పశ్చాత్తాపపడినప్పుడు కన్నీరు వస్తుంది.అటువంటి కన్నీటితో కూడిన పశ్చాత్తాపము దేవునికి ఆనందాన్ని కలిగిస్తుంది.పాపికి హృదయ శుద్ధిని ప్రసాదిస్తుంది. కనుక మనందరము పాపములను ఒప్పుకొనుచు, కన్నీటితో కూడిన పశ్చాత్తాపముతో దేవుణ్ణి సమీపిద్దాం.
- ఆత్మపరిశీలన :-
ఏఏ పాపాలతో నా హృదయం నింపబడింది? దేవునికి నివాసస్థలముగా నా హృదయము ఉన్నదా? పదేపదే చేయు తప్పిదములు ఏవి?
- ప్రార్ధన:-
తండ్రీ! నీవు కరుణామయుడవు కనుక నన్ను అనుగ్రహింపుము.మిక్కిలి నెనరు కలవాడవు కనుక నా పాపములను తుడిచివేయుము. నా పాపమును శుద్ధిచేసి నన్ను నూతన పరచండి. హృదయపరివర్తన కలుగచేసి, నాకు నూతన హృదయమును దయచేయండి. నా హృదయమును నిర్మలత్వముతో నింపండి. మీ దర్శన భాగ్యం ప్రసాదించుమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాను ఆమెన్....
