నిజబలి అర్పణం-విరిగినలిగిన హృదయం

Father gopu praveen
13 Mar 2026
తప:కాల 3వ శనివారం
హోషయా 6:1-6
కీర్తన 51:3-4,18-21
లూకా 18:9-14
నేటి సువిశేషంలోని ఉపమానము మన అందరి జీవితాలను పారదర్శకంగా చూపించే ఉపమానము.ఈ ఉపమానము నందు పరిసయ్యుని ప్రార్ధనను, సుంకరి ప్రార్ధన యేసుప్రభు చూపిస్తూ ఉన్నారు.మన ప్రార్ధన ఎవరిని పోలివున్నాయి? పైకి మాత్రము సుంకరిని పోలి ఉంటాయి. కానీ,నిజానికి మన ప్రార్థనలన్నీ పరిసయ్యుని ప్రార్ధనలే.మన భ్రష్ట స్వభావాన్ని కేవలం మనము నోటితో మాత్రమే ఒప్పుకుంటూ ఉంటాం. హృదయము మాత్రం ఎంతో మంది కన్నా నేను పరవాలేదు. నాకన్నా పాపాత్ములు పెక్కుమంది ఉన్నారు అని సమర్థించుకుంటూ ఉంటామే తప్ప,తగ్గింపు,దీనత లేని జీవితము జీవిస్తుంటాం.ఒక ప్రసంగం ఆలకిస్తున్నప్పుడు అందు హెచ్చరికలు మనకు కాదు ప్రక్కవారికి అని తలంచే బుద్ధి మనది.అష్ట భాగ్యములలో మొట్టమొదటిగా (మత్తయి:3) "దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది" అని దీనత కలిగి ఉండమని బోధించారు యేసుప్రభు. దేవుని హృదయానుసారుడు అని పిలవబడిన దావీదు మహారాజు సహితము బెతేబాతో చేసిన పాపానికి ఎంతగా పశ్చాత్తాపపడి, విరిగి నలిగిన హృదయంతో తనని శుద్ధి చేయమని,క్షమించమని దేవుని చెంత అంగలార్చాడో నేటి కీర్తన 51లో మనము చూడగలము.పౌలు అంతటివారే నేను పాపాత్ముల్లో ప్రథముడను అని దేవుని ముందు దీనతను కలిగి జీవించారు.కావున ఒక విశ్వాసి దావీదు వలె పౌలు గారి వలె విరిగినలిగిన హృదయాన్ని దేవునికి బలిగా సమర్పించాలని అన్నారంటే అది సామాన్య విషయం కాదు. అందుకు దేవుడు అంటే ఎవరు? ఆయన మన నుండి కోరునది. ఏమిటి? అనే లోతైన జ్ఞానం కలిగి ఉండాలి.నేటి మొదటి పఠనము హోషేయా 66లో "నేను మీ నుండి కోరునది కారుణ్యమును గాని, బలులను కాదు.. దైవజ్ఞానమును గాని, దహనబలులను కాదు." అని చెబుతున్నారు.దేవుడు మన నుండి ప్రేమను,దైవ జ్ఞానాన్ని కోరుతున్నారు.దైవజ్ఞానం మనకు,నిజమైన మనలను పరిచయం చేస్తుంది.అదే వాక్యంలో చెప్పబడినట్లు "ఎవ్వడైన క్రీస్తు నందున్న యెడల అతడు నూతన సృష్టి! ప్రాత జీవితము గతించినది. క్రొత్త జీవితము. ప్రారంభమైనది” (2కొరింతు 5:27) అనగా మనము ఎంత పాపాత్ములమో మనకు ఆత్మ ద్వారా తెలియచేయబడి పాపాన్ని ప్రభువు ముందు ఒప్పుకునేలా చేస్తుంది.దీనత అలవడుతుంది.అప్పుడు మనం కూడా సుంకరి వలె రొమ్ము బాదుకొనుచు " ఓ దేవా! ఈ పాపాత్ముని కనికరింపుము" అని ప్రార్థన చేయగలుగుతాం.తద్వారా సుంకరివలె మనము కూడా దేవుని చెంత నీతిమంతులముగా పరిగణింపబడతాం.
