తపస్సుకాల 21వ రోజు

Father kasper chatla

12 Mar 2026

ధ్యానాంశము-:
శ్రమలు - పరీక్షలు

-ధ్యానవచనములు:-
"సోదరులారా! మీరు పలువిధములైన పరీక్షలు ఎదుర్కొమనపుడు అదృష్టవంతులుగా ఎంచుకొనుడు.ఎట్లన మీ విశ్వాసము అట్టి పరీక్షలను ఎదుర్కొనుట వలన మీకు సహనము చేకూరును."(యాకోబు 1:2,3)

"శారీరకముగా క్రీస్తు శ్రమలపాలయ్యెను. శారీరకముగా కష్టపడువారు పాపజీవితం విడనాడినవారగుదురు.క్రీస్తు బాధలలో పాలుపంచుకొనుచుంటిమి అని ఆనందింపుడు. ఆయన మహిమ ప్రదర్శింపబడినప్పుడు మీరు మహా ఆనందంను అనుభవింపగలరు." (1 పేతురు 4:1, 13)

"అతడు శ్రమల ద్వారా నరులకు పాఠములు నేర్పును. బాధల ద్వారా వీరి కనులు తెరిపించును."(యోబు 36:15)

-ధ్యానము:-
ఈ లోకంలో జీవించు ప్రతి మనిషికి ఏదో ఒక శ్రమ,పరీక్ష కలుగుతుంది.సముద్రమునకు అలలు ఎంత సహజమో, మనిషి జీవితానికి శ్రమలు, బాధలు, పరీక్షలు అంతే సహజం. బంగారం అగ్నిలో కాల్చి పరీక్షించినపుడే,మంచి బంగారం బయటకు వస్తుంది. విద్యార్థులు కష్టపడి పరీక్షలు వ్రాసి పాసైతేనే పై తరగతికి వెళ్తారు.అదే విధంగా విశ్వాసులకు విధేయత, క్రమశిక్షణ నేర్పటానికి దేవుడు పరీక్షిస్తుంటాడు.నిజమైన విశ్వాసులు శ్రమలలో, పరీక్షలలో ఇంకా ఎక్కువగా దేవుని స్తుతిస్తూ ఆనందిస్తారు. ఎందుకంటే మన విశ్వాస జీవిత పరుగుపందెంనకు తగిన బహుమానం పొందుతాము అనే నిరీక్షణ మనకు కలదని పౌలుగారు బోధిస్తున్నారు. మనకు కలిగే ప్రతిపరీక్ష ఓర్పును,నేర్పును, విధేయతను,నిరీక్షణను కలిగించుటకే అని భావించి, విశ్వాసంతో ప్రార్థించి,దేవునిలో ఆనందించుట నేర్చుకుందాం.

ఆత్మపరిశీలన :-
దేవుడు శ్రమలు,పరీక్షలు పంపినపుడు నా ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది?దేవుని చిత్తం కాని పనులు చేసినందువలన వచ్చిన శ్రమలు నా జీవితంలో ఏమి ఉన్నాయి?

-ప్రార్ధన:-
నా కొరకై శ్రమలు పొందిన ప్రభువా!నాకు వచ్చిన సకల శ్రమలు,పరీక్షలను బట్టి వందనాలు,స్తోత్రాలు.మీ చిత్తం కాని క్రియలు చేసి శ్రమలు తెచ్చుకున్నందుకు దయచేసి క్షమించి,విడిపించండి.ప్రతి విషయంలో మీ చిత్తం తెలుసుకొని మీ మీద ఆధారపడి,జీవిస్తూ విశ్వాసము విడిచి పెట్టక, అంతం వరకు మీ బిడ్డగా జీవించు కృపను దయచేయుమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాను. ఆమెన్.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN