కడరాత్రి భోజన చిత్రపట్టం విశేషాలు

మహా ఘన. డా.సగినాల ప్రకాశ్
12 Mar 2026
ఈ కడరాత్రి భోజన చిత్రాన్ని లియోనార్డో ద వించి అనే కళాకారుడు 1495 సం॥లో చిత్రీకరించాడు.ఈ చిత్రణ 3 సంవత్సరాలు సాగింది.ఇది ఇటలీ దేశంలోని మిలాన్ నగరంలో ఉన్న "వరములమాత మరియ" అనే ఒక మఠవాసుల భోజనశాల గోడమీద చిత్రీకరించబడింది. యేసుక్రీస్తు తన శిష్యులతో చివరిగా ఆరగించిన విందు అపురూపంగా,అద్వితీయంగా వారి మనసులలో నిండిపోయింది.ఈ విందు సమయంలో ప్రస్తావించబడిన అనేక విషయాలు క్రైస్తవ మతానికి ఊపిరి పోశాయి."ఇది నా శరీరము,ఇది నా రక్తము," అంటూ అప్ప దాక్షారసములను చూపుతూ ప్రభువు పలికిన మాటలు పవిత్రమైన దివ్య సత్ప్రసాదానికి నాంది పలికాయి (లూకా 22:19-20) ఈ విషయాన్ని పౌలు కొరింతీయులకు వ్రాసిన పత్రికలో వివరించాడు (1 కొరింతీ 11:23-25) అద్భుతమైన ఆ సందర్భాన్ని వివరించే ఈ చిత్రం,ఒక అపురూప కళాసృష్టి,దశాబ్దాల తరువాత కూడా మేధావులను, కళాకారులను అబ్బురపరచిన ఒక విశిష్ట చిత్రసంపద.తనను పట్టించబోయే వ్యక్తి గురించి యేసు చెప్పినప్పుడు,ఆయన శిష్యులలో ఆందోళనతో నిండిన స్పందన ఇందులో కనుపిస్తుంది.చిత్రంలో శిష్యులను ముగ్గురు ముగ్గురుగా చూపించడం జరిగింది.ఎడమ నుండి కుడివైపు,మొదటి ముగ్గురు బర్తలోమయి,యాకోబు,ఆండ్రెయ.రెండవదిగా యూదా ఇస్కారియోతు డబ్బు సంచితో కనుపిస్తాడు.పేతురు చిన్న కత్తి పట్టుకొని ఉంటాడు.అతి పిన్న వయస్కుడైన యోహాను మోహంలో నిర్లప్తత కనిపిస్తుంది.తరువాత ముగ్గురిలో తోమా విచారంగా కనిపిస్తాడు.యాకోబు, ఆశ్చర్యం ప్రకటిస్తాడు.ఫిలిప్పు వివరణ కోసం అన్వేషిస్తుంటాడు.చివరి ముగ్గురిలో మత్తయి,తద్దయి కుమారుడైన యూద,సీమోను వైపు చూస్తూ, "ఇదేమిటి" అన్నట్లు కనుపిస్తుంది.వీరందరి మధ్య ప్రశాంతంగా, నిర్ణయాత్మకంగా కనుపించే యేసుక్రీస్తు. "దైవ చిత్తాన్ని ఆలింగనం చేసుకోబోతున్నాను" అన్నట్లు కనుపిస్తాడు.భయము, ఆశ్చర్యము,ఆందోళన, విచారము,ప్రశ్నార్ధకము మొదలగు హావభావాలు ప్రదర్శించే ఈ చిత్రం, చిత్రకళారంగంలోనే అపూర్వ చరిత్ర కలిగినది.ఇది ఒక గోడ మీద చిత్రీకరించినా,వెనుక ఏదో ఒక గది ఉన్నట్లు భ్రమ కలిగిస్తుంది.ప్రభువు తన శిష్యులతో చేస్తున్న ఈ కడరా భోజనచిత్రం క్రైస్తవులు భోజనగదులలో తప్పక దర్శనమిస్తుంది.విశేషమైన ప్రతిభతో,కళాత్మక నైపుణ్యంతో చిత్రీకరించిన ఈ కళాఖండాన్ని ఎంతసేపు చూసినా తనివి తీరదు!
