"బలవంతుడైన దేవుడు"

జోసెఫ్ అవినాష్
12 Mar 2026
తప:కాల 3వ గురువారం
యిర్మియా 7:23-28
కీర్తన 95:1-2,6-9
లూకా 11:14-23
ధ్యానం:
నేటి సువిశేషంలో "బలవంతుడు ఆయుధములను ధరించి తన ఇంటికి కావలి కాచుకొనినచో అతని సంపద సురక్షితముగ ఉండును.కాని అతనిని మించిన బలవంతుడొకడు దాడి చేసి అతనిని కొల్లగొట్టిన అతడు నమ్ముకొని యున్న ఆయుధములను స్వాధీనము చేసికొని అతడు దోచుకొనిన సంపదను పంచిపెట్టును" అను వచనములను ధ్యానిస్తే ఆయుధములు ధరించిన బలవంతుడు సైతాను.వాడి ఆయుధములు దేవుని పక్షమున నిలబడని ప్రతి ఒక్కరును వారితో సైతాను తన రాజ్య వ్యాప్తిని సురక్షితంగా విస్తరిస్తూ ఉన్న సమయంలో, అందరికన్నా బలవంతుడైన ప్రభువు వాడిని కొల్లగొట్టి ఆ ఆయుధములను స్వాధీనపరచుకొనును.అనగా యేసుప్రభువు సైతాను దోచుకుంటున్నట్లా? ఎంత మాత్రమును కాదు.ఆదిలో సైతాను దేవుని నుంచి దొంగలించిన దాన్నేతిరిగి స్వాధీన పరుచుకుంటున్నారు మన బలవంతుడైన దేవుడు. పతనమై నశించే స్థితిలో ఉన్న మనలను సైతాను రాజ్యంలో నుంచి తీసుకుపోయి తన మహిమ రాజ్యంలో ఉంచాలనుకుంటున్నారు దేవుడు.విశ్వాసులమైన మనలను ఆ విధముగా తీసుకుపోయే క్రమంలో మనము మన దేవుడైన ప్రభువును విశ్వసించాలి. యోహాను 20:29 లో "నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా! చూడకయే నన్ను విశ్వసించువారు ధన్యులు" అని యేసు పలికారు.దేవుడు చేసిన అద్భుత కార్యములను కన్నులారా చూచి కూడా ఆయనకు దయ్యాలతో సహవాసం ఉందని దేవునిపైనే నిందారోపణలను మోపి అవిధేయులై,అవిశ్వాసులై, విరోధులుగా మారిన పరిసయ్యలవలె కాక, దేవుని ప్రతి మహిమ కార్యమును విశ్వసిస్తూ బలవంతుడైన యేసుప్రభు నా రక్షకుడు అని ఆయన పక్షమున నిలబడే వారుగా మనము ఉండాలి.
