సెబాస్టే నగర నలభైమంది వేదసాక్షులు (క్రీ.శ.320)

ఫాదర్ ఆకుల ప్రసాద్
09 Mar 2026
సుగుణం: “వేదహింసలోను క్రీస్తును వీడని విశ్వాసం”
అర్మేనియా దేశంలోని సెబాస్టేనగరంలో క్రీ.శ. 320లో వివిధ వర్ణాలకు చెందిన 40మంది క్రీస్తు భక్తులైన సైనికులను కపదోసియా గవర్నరైన అగ్రికోలసు క్రీస్తును విడనాడి దబ్బరదైవములను మ్రోక్కమని ఆజ్ఞ జారీచేశాడు.అందుకు ఆ సైనికులు గవర్నరుకన్నా రారాజైన క్రీస్తు ప్రబోధమే తమకు శిరోధార్యమన్నారు. సృష్టివస్తువులను,బొమ్మలను పూజించడం పనికిమాలిన చర్య అని,అందుకు బదులుగా నిత్యసత్యజ్యోతియైన క్రీస్తును ఆరాధిస్తేనే ఆనందమని నిర్భయంగా పలికారు.వారి విశ్వాసంతో అవమానింపబడిన గవర్నరు కోపోద్రిక్తుడై ఆ 40 మందిని బంధించి,వివస్త్రులనుచేసి మంచుగడ్డలపై వారి శరీరాలను గడ్డకట్టేవరకు దొర్లించాడు.అయిననూ వారి విశ్వాసం సన్నగిళ్ళలేదు.కానీ ఒక్కడు మాత్రం ఆ బాధను తాళలేక గవర్నరుమాటను పాటిస్తానన్నాడు కానీ అప్పటికే అతని ప్రాణం అనంతవాయువుల్లో కలిసిపోయింది.మంచుగడ్డలపై బిగుసుకుపోయిన మిగిలిన 39 మందిని కణకణలాడే నిప్పుల కొలిమిలో ఒక్కొక్కరిని విసిరివేయించాడు.మంటల్లో వారి శరీరాలు మాడిమసైపోతున్ననూ వారి హృదయాలు మాత్రం విశ్వాస కవాచాలు ధరించి క్రీస్తును ప్రార్థిస్తూనే ఉన్నాయి.తమ సంఖ్యను 40గానే ఉంచమని వారు క్రీస్తు వేడుచూ ఆయన శ్రమలను ధ్యానించారు.క్రీస్తుయెడల వారి నమ్మకానికి, విశ్వాసానికి చలించిన ఓ ఆన్యుడైన సైనికయోధుడు వారికి సంఘీభావం తెల్పుచూ తాను కూడా క్రీస్తుకొరకు వారితో పాటు మంటల్లో దూకి ప్రాణత్యాగం చేశాడు. అలా క్రీస్తు విశ్వాసాగ్నిలో ఒకసమిధగా వేదసాక్షిగా 40వ వ్యక్తిగా చేరిపోయాడు. వారందరు తమ వేదసాక్షిమరణం ద్వారా నిత్యజీవరాజ్య కిరీటాన్ని అలంకరింపజేసుకున్నారు. కానీ తన ప్రాణాన్ని కాపాడుకునేందుకు ఆఖరిక్షణంలో విశ్వాస పట్టుసడలిన దురదృష్ట పిరికి సైనికుడు తనప్రాణాన్ని మరియు స్వర్గ సౌఖ్యాల్ని రెండింటిని పోగొట్టుకున్నాడు.
సెబాస్టే నగర నలభైమంది వేదసాక్షులారా మాకొరకు ప్రార్థించండి..
