దివ్యసత్ప్రసాదానికి బైబిలులో ఆధారాలున్నాయా?

మహా ఘన. డా.సగినాల ప్రకాశ్

08 Mar 2026

దివ్యసత్ప్రసాదం,స్వయానా క్రీస్తుప్రభువు దేహం.దివ్యపూజాబలిలో అప్పద్రాక్షరసములు ఆయన శరీరరక్తాలుగా మారిపోయి మనకు దివ్యభోజ్యంగా సమకూరుతున్నాయి.యోహాను సువిశేషంలో దివ్యసత్ప్రసాదం గురించి లోతైన భావాలు కనుపిస్తాయి.“దేవుని ఆహారము పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమును ఒసగును..." అనే వాక్యంలో దివ్యసత్ప్రసాదానికి నిజమైన నిర్వచనం ఇవ్వబడింది (యోహాను 6:33) ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో ఆహారములేక యావేకు మొరపెట్టినపుడు,దేవుడు మన్నాను కురిపించాడు. 'మన్నా' ఎడారిలో దొరికిన అరుదైన ఆహారపదార్ధము.దీన్ని గురించి ఇశ్రాయేలీయులు గొప్పగా చెప్పుకునేవారు.యేసుక్రీస్తు ఆ మన్నా ప్రస్తావించిన సందర్భంలోనే తాను ఇచ్చే జీవాహారం గురించి వివరిస్తారు. మన్నా తింటే చనిపోతారుగాని,నేనిచ్చే ఆహారం భుజిస్తే నిత్యం జీవిస్తారని మన్నాతో పోల్చి మరీ చెబుతారు.ఆ సందర్భంలో "నేనే జీవాహారము" అంటూ మూడుమార్లు చెప్పడం గమనించాలి (చదవండి: యోహాను 6:35,48,51).ఇలా మూడు మార్లు చెప్పడం ద్వారా ఆ విషయానికున్న ప్రాధాన్యతను,అందులోని సత్యాన్ని నొక్కి చెప్పడమవుతుంది.తన దేహం ఆహారం అవుతుందని చెప్పిన ప్రభువును కొందరు వీడిపోయారు.అయినా ప్రభువు వారిని ఆపలేదు. కారణం,ఈ జీవాహారం తన శరీరమేనన్న పరిపూర్ణ విశ్వాసం, స్వీకరించేవారిలో కలగాలి.అలా విశ్వసించని వారికి దానిని స్వీకరించే అర్హత లేదు.ఈ జీవాహారాన్ని కడరాభోజనంలో అప్పద్రాక్షరస రూపంలో,తన జ్ఞాపకార్ధం చేయమన్నారు క్రీస్తు (లూకా 22:14-23).ఆ మాటల మీద పరిపూర్ణమైన విశ్వాసముంచిన అపోస్తులులు,శిష్యులు,అదే రీతిగా ఆయన జ్ఞాపకార్ధం చేస్తూ వచ్చారు.అపోస్తుల కార్యంలో జరిగిన ఈ సత్యాన్ని దృఢపరుస్తూ పౌలు కొరింతీయులకు వ్రాసిన మొదటి లేఖలో ప్రస్తావిస్తాడు (చూడండి: అ.కా.2:46-47 మరియు 1 కొరింతీ 11:23-26). జరిగిన విషయాలు పౌలుని మదిలో తాజాగా ఉన్నాయి కాబట్టి, వాటి గురించి విపులీకరించడం తన అదృష్టంగా భావించుకొన్నాడు.అదీగాక, పౌలు కొరింతీయులకు వ్రాసిన లేఖ మొట్టమొదటి లేఖలలో ఒకటని పండితులు భావిస్తారు.ఈ ఆధారాలన్నీ దివ్యసత్ప్రసాదాన్ని ప్రభువు రక్తమాంసాలుగా మనకు అందిస్తున్న ఆపరూప కానుకలు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN