నేటి పునీతురాలు :పునీత కొలేట్ట్ (క్రీ.శ.1381-1447)

ఫాదర్ ఆకుల ప్రసాద్

05 Mar 2026

సుగుణం: "ఆధ్యాత్మిక మఠ సంస్కర్త"

పునీత కొలేట్ట్ గారు క్రీ.శ.1381లో ఫ్రాన్సులోని 'పికార్డి'నందు దైవభక్తిగల విశ్వాస కుటుంబంలో జన్మించారు. వీరి జ్ఞానస్నానం పేరు నికోలేట్ట్. చిన్ననాడే తల్లిదండ్రులను కోల్పోయిన వీరు పునీతుల జీవితగాధల్ని తెల్సుకొని వారి మార్గాన్ని చేపట్టారు.చిరుప్రాయంలోనే శిథిలావస్థలోనున్న ఒక బెనెడిక్టుల మఠాశ్రమానికి మరమ్మత్తులు చేయించడమే గాక వివిధ మతసంబంధ కార్యాలలో పాల్గొనేవారు.యవ్వనస్తురాలిగా 'బిగైన్' మఠకన్యల పాక్షిక సన్యాసిని జీవితాన్ని కొనసాగిస్తూ పేదక్లేరులు, బెనెడిక్టుసభలలో సేవలందించారు. 'కోర్బి' నందలి మేరీమాత దేవాలయం ప్రక్కన ఏకాంత నివాసాన్ని ఏర్పాటుచేసుకొని పునీత ఫ్రాన్సీసు అసిస్సివారి మూడవసభలో భాగమైనారు. క్రీ.శ. 1406లో తన 25వ ఏటనుండి వీరికి తరచుగా స్వప్నసంబంధమైన దర్శనాలు కలిగేవి. తాను జ్ఞానతండ్రిగా భావించే పునీత ఫ్రాన్సిస్ వారు కనబడి పునీత క్లారావారి సభను సంస్కరించవలసినదిగా కోరారు.కొలెట్ట్ గారు పునీత క్లారావారి సభలో మఠకన్యకగా చేరారు.వీరిని పూర్తిగా ఎరిగిన 13వ బెనెడిక్ట్ పోపుగారు కొలేట్ట్ గారిని పేదక్లేర్స్ మఠానికి అధిపతిగా నియమించగా,ఆమె ఆ మఠాన్ని సమూలంగా సంస్కరించి సమర్థవంతంగా పనిచేసేలా చేశారు.వీరు తమ మఠ ఆశ్రమాలను అనేక చోట్లకు విస్తరించారు.పునీత జోన్ ఆఫ్ ఆర్క్,పునీత జాన్ కాపిస్ట్రాన్, పునీత విన్సెంట్ ఫెర్రర్ గార్లతో కొలేట్ట్ గారికి ఆధ్యాత్మిక పరిచయాలుండేవి. అసిస్సీ ఫ్రాన్సిస్ వారివలె కొలేట్ట్ గారు కూడా జంతుప్రేమికురాలు, అవి ఆమెను చుట్టుముట్టి అమెచే లాలించబడేవి. అందుకే కళాకారులు ఆమె చిత్రాలయందు ఆమె జీవితానికి చిహ్నంగా గొర్రెపిల్ల మరియు పక్షుల బొమ్మల్ని చిత్రించేవారు. కొలేట్ట్ గారు క్రీ.శ.1447లో పరలోకప్రాప్తినొందారు. క్రీ.శ.1807లో 7వ భక్తినాధ పోపుగారు వీరిని పునీతులుగా ప్రకటించారు.

పునీత కొలేట్ట్ గారా మాకొరకు ప్రార్థించండి!

బంగారు మాట:
మానవ బలహీనతల వల్ల
పరిశుద్ధ జీవితంలో
ఓడిపోయినచో పవిత్ర
తపోక్రియలచే తిరిగి
దానిని పునరుద్దరించుకోవాలి.
(పునీత కొలేట్ట్)

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN