నేటి పునీతుడు: పునీత స్లీవ జాన్ జోసఫ్

ఫాదర్ ఆకుల ప్రసాద్

04 Mar 2026

సుగుణం: "అద్భుత శక్తుల మహనీయుడు"

ఇటలీలోని నేపుల్సు దగ్గరలోని ఇషియా అనే ద్వీపంలో జాన్ జోసఫ్ గారు క్రీ.శ.1654లో జన్మించారు.వీరి జ్ఞానస్నానం పేరు కార్లోగయోతానో.చిన్ననాటినుండే భక్తివిశ్వాసాలతో,పేదలపట్ల దయాకనికరాలతో పెరిగాడు. క్రీ.శ. 1524లో స్పెయిన్ దేశంలో పునీత పీటర్ గారు కటిక ఉపవాసం, భిక్షాటనతో కూడిన
మహాకఠినతరమైన కట్టుబాట్లను కలిగిన ఫ్రాన్సీస్కన్ సభ శాఖను స్థాపించారు. దీనినే అల్కంటారియన్ శాఖ అని కూడా పిలుస్తారు.ఇందులో చేరిన మొట్టమొదటి ఇటలీవాసి కార్లోగయోతానో గారు. తన 16వ ఏటనే సభలో ప్రవేశించి జాన్ జోసఫ్ గా పేరుమార్చుకున్నారు.వీరు సభనియమాల ప్రకారం కఠిన శారీరక క్రమశిక్షణను పాటిస్తూ,ఉపవాసం ఆచరిస్తూ రొట్టె, పండ్లతోనే కాలంగడుపుతూ, కేవలం రోజుకు 3గంటలు మాత్రమే నిద్రించేవారు.జాన్ జోసఫ్ గారు అతిపిన్నవయస్సులోనే నోవీసు మాస్టారుగా, మఠనిలయ సంరక్షకుడుగా నియమింపబడ్డారు. క్రీ.శ.1702లో గురువుగా అభిషక్తులై ఇటలీలోని తమ సభశాఖకు ప్రోవిన్షియల్ గా ఎన్నికైయ్యారు.మరణించుటకు కొద్దికాలం ముందే తన బాధ్యతలన్నిటికి రాజీనామా చేసి ఆత్మల రక్షణార్థం నిరంతర దైవ ప్రార్ధన చేయడం ప్రారంభించారు. జాన్ జోసఫ్ గారు స్లీవను అమితంగా ప్రేమించేవారు.యేసు పేరిట వీరు స్లీవను చేపట్టి ఎటువంటి వ్యాధినైనా నయం చేసేవారు.అంతేగాక ఇతరుల మనసులలోని ఆలోచనలను ముందేగ్రహించేవారు. ధ్యానముద్రలో ఉన్నప్పుడు వీరి శరీరం గాలిలో పైకి లేచేది. క్రీ.శ.1734 మార్చి 5న జాన్ జోసఫ్ గారు పరలోక ప్రాప్తినొందారు. క్రీ.శ.1839లో 16వ గ్రెగోరి పోపుగారు జాన్ జోసఫ్ గారిని పునీతులుగా ప్రకటించారు.

పునీత స్లీవ జాన్ జోసఫ్ గారా మాకొరకు ప్రార్ధించండి!

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN