సహృదయముతో మన పొరుగువారిని ఆదుకోవాలి

జోసెఫ్ అవినాష్
04 Mar 2026
తప:కాల 2వ గురువారం
యిర్మీయా 17:5-10
కీర్తన 1:1-2, 3, 4 , 6
లూకా 16:19-31
ధ్యానం:
మన కోరికలు మితిమీరినచో నాలుగు ప్రధాన విషయములందు మనము చేయు ప్రయత్నములు, ప్రాకులాడు విధములు దేవుని నుండి మనలను క్రమేణా దూరం చేయును.అవి: ధనము,అధికారము,సుఖభోగము,ప్రతిష్ట అనెడి నాలుగు అంశములందు జాగరూకత పాటించనిచో, గొంతెమ్మ కోరికలకు,విలాస సుఖభోగములకు బానిసలుగా మారే ప్రమాదము కలదు.పునీత ఇరినేయసు గారు పలికినట్లు “మానవుడు నిండుగా జీవిచినచో దేవునికి మహిమ చేకూరును," అనెడి మాటలు మన జీవితములలో పరిపక్వతను పొందుటకు,సమతుల్యతను పాటించుటకు దోహదం చేయును.
నేటి సువిశేషమునందు యేసు పరిసయ్యులను ఉద్దేశిస్తూ చెప్పిన వృత్తాంతము ఓ ధనికడు అనుభవించిన సుఖభోగములను - విందులు, వినోదములు, దుస్తులు,ఆభరణములు కొరకు వెచ్చించిన సమయమును మనకు బహిర్గతము చేస్తుంది.ధనముగ పొందుట లాభములను గడించుట యందు సమస్య లేకున్ననూ,ఆ ధనికుడు తన గృహద్వారము వద్ద నిస్సహాయ స్థితిలో పడి ఉన్న పేద లాజరు యొక్క ధీనస్థితిని చూసి ఏ మాత్రము చలించక,కరుణ చూపుటలో ప్రదర్శించిన ఏమరుపాటును తెలియచేస్తుంది. మన తపస్సుకాల పయనములో పలు నిర్ణయములు,నియమములను పాటించుటకు కంకణము కట్టుకొని ఉన్ననూ, మన చుట్టు ప్రక్కల దీనస్థితిలో ఉన్న అభాగ్యులకు సహాయం చేయనిచో మన భక్తి భావములకు అర్థం చేకూరదు. దేవుడు మనకు ఒసగిన సకల వరములకు కృతజ్ఞత హృదయమును కలిగి ఉంటూ, మన సహోదరి సహోదరులకు అండగా ఉండేందుకు వచ్చిన ప్రతి అవకాశమును సద్వినియోగం చేసుకోవాలి. మరోవైపు సాతాను శోధనను జయించుటకు సర్వదా ప్రార్ధన చేస్తూ ధనదాహము అధికార ప్రాకులాట, సుఖభోగముల కోరికలు ప్రతిష్ట ప్రయత్నములకు స్వస్థి పలుకుతూ, సమతుల్యతను పాటిస్తూ, సహృదయముతో మన పొరుగువారిని ఆదుకోవాలి, తద్వారా దేవుని నిండుగా ఆరాధించాలి.
