నేటి పునీతుడు: పునీత కసిమీర్ (క్రీ.శ. 1458-1484)

ఫాదర్ ఆకుల ప్రసాద్
03 Mar 2026
సుగుణం: "పేదల, నిర్భాగ్యుల ఆదరణ పితామహుడు"
పోలెండు దేశ పాలక పునీతుడైన కసిమీర్ గారు పోలెండులోని క్రాకౌనందు ఒక రాజ కుటుంబంలో క్రీ.శ.1458 అక్టోబర్ 3న జన్మించారు. వీరి తండ్రి 4వ కసిమీరు గారు పోలెండు దేశానికి రాజు. వీరి తల్లి ఎలిజబెత్ గారు ఆస్ట్రియా రాకుమార్తె.కసిమీర్ గారు రాకుమారుడైననూ దేవుని ఎడల మిక్కిలి భక్తికలిగి కఠిన ఉపవాస ప్రార్థనలతో తపో క్రియలతో గడిపేవారు. దానగునాత్ముడైన వీరు 'పేదల, నిర్భాగ్యుల ఆదరణ పితామహుడు' అన్న కీర్తిని గడించారు. క్రీ.శ.1471లో హంగేరిరాజుతో యుద్ధంచేయమని తన తండ్రి ఆదేశించగా, యుద్ధరంగానికి వెళ్ళి,యుద్ధం వలన నష్టం తప్ప లాభం లేదని గ్రహించి సైన్యంతో వెనక్కివచ్చాడు.యుద్ధం చేయకపోవుటచే రాజకుమారుడని కూడా చూడకుండ రాజద్రోహం నేరంపై కసిమీర్ గారిని ఆయన తండ్రి చెరసాలలో వేయించాడు. మూడు నెలల శిక్ష తర్వాత అనేక హెచ్చరికలతో కసిమీర్ గారిని ఆయన తండ్రి పోలెండ్ దేశ వైశ్రాయిగా అనగా రాజప్రతినిధిగా నియమించాడు.1479నుండి 1483 వరకు చక్కని పరిపాలనతో పేదల అవసరాలను తీర్చుతూ,దుర్నీతిపరులనుండి ప్రజలకు అండదండలు అందించారు.బాల్యంలో దేవునికి మాట ఇచ్చినట్లు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ,స్వేచ్ఛాపూర్వక పేదరికాన్ని అనుసరించారు.వీరికి మరియమాత యెడల భక్తి మెండు. ఆ తల్లిని 'మంచి అమ్మ' అని పిలిచేవాడు. క్రీ.శ. 1484 మార్చి 4న శ్వాసకోశ వ్యాధిచే అతి చిన్న వయస్సులోనే అనగా తన 25వ ఏటనే పరలోకప్రాప్తినొందారు. వీరు మరణించిన 122 సం!రాల తర్వాత వీరి సమాధి తెరచి చూడగా వారి మృతశరీరం శిథిలం కాకుండా భద్రంగా ఉండటం విశేషం. ప్లేగు, ఆస్తమా మరియు ఇతర శ్వాసకోశ వ్యాధులవారు కసిమీర్ గారిని ప్రార్థించినచో స్వస్థత చేకూరుతుంది.
పునీత కసిమీర్ గారా మాకొరకు ప్రార్ధించండి!
