దైవవాక్యాన్ని మించిన ఆయుధం క్రైస్తవులకు వేరొకటి లేదు
.jpg)
మహా ఘన. డా.సగినాల ప్రకాశ్
03 Mar 2026
ప్రశ్న:-
యేసుక్రీస్తు శోధనలను జయించడానికి ఎన్నుకొన్న మార్గమేమిటి? ఆయన వాటిని ఎలా త్రిప్పికొట్టగలిగారు (మత్తయి 4:1-11)?
సమాధానం:
సువిశేషంలో యేసుక్రీస్తుకు సంభవించిన మూడు శోధనలు కూడా ఈ లోకసంబంధమైన లౌకిక ప్రలోభాలే! ఈ శోధనలను మూడు విధాలుగా విశ్లేషించుకోవచ్చు.మొదటి శోధన శుష్టుగా భోజనంచేసి,కడుపునింపుకొనుమని (శరీరం).రెండవది, అధికారానికి దాసోహమవటం (లౌకికం).ఇక మూడవది స్వార్థచింతనతో ఐశ్వర్యాన్ని సమకూర్చుకొనడం (స్వార్థం).ఇవన్నీ మనిషిని తన జీవితంలో చింతాక్రాంతుల్ని చేస్తుంటాయి.ఏదొక విధంగా వాటికి చేరువ కావాలని కోరుకోవడం మనిషికి ఉన్న సహజ లక్షణం.కానీ వీటిని తిరస్కరించడానికి యేసుక్రీస్తు వాడిన ఒకే ఒక ఆయుధం, దేవునివాక్యం. లౌకికమైన ఆశలలో మనిషి కూరుకుపోయి, స్వార్ధచింతనతో దేవునికి దూరమవుతాడు.మనిషికీ మనిషికీ మధ్య అగాధాలు ఏర్పడతాయి. అశాంతిలో మనిషి, దేవునికి దూరమవుతాడు. కానీ దైవవాక్యం అటువంటి స్థితి మనిషికి రానీయకుండా, మనసును దైవమునందే నిగమ్నం చేస్తూ, స్థిరచిత్తంతో శాశ్వత విలువలను కోరుకొనడానికి మనసును సన్నద్ధం చేస్తుంది. పైచెప్పిన శోధనలను దేవునివాక్యంతో యేసుక్రీస్తు ఎలా త్రిప్పికొట్టగలిగారో ఈ క్రింది వాక్యాలు చదివితే అర్ధమవుతుంది:
ఆహారము గురించిన శోధన కలిగినపుడు ఆయన సమాధానం: "మానవుడు కేవలం రొట్టెవలననే జీవింపడు. కాని దేవుని నోటినుండి వచ్చు ప్రతి మాటవలన జీవించును" (ద్వితీయో 8:3).అధికారం గురించిన శోధన కలిగినపుడు క్రీస్తు సమాధానం: "ప్రభువైన నీ దేవుని నీవు శోధింపరాదు" (ద్వితీయో 6:16).సైతానుకు దాసోహమయితే సంక్రమించే సంపదల గురించి: “ప్రభువైన దేవుని ఆరాధింపుము. ఆయనను మాత్రమే నీవు సేవింపుము” (ద్వితీయో 6:13).దైవవాక్యాన్ని మించిన ఆయుధం క్రైస్తవులకు వేరొకటి లేదని పై వాక్యాలు సూచిస్తున్నాయని గ్రహించడం ముఖ్యం.
