ప్రొటెస్టాంటు బైబిలులో కొన్ని పుస్తకాలు కనుపించవు.కారణమేమిటి?
.jpg)
మహా ఘన. డా.సగినాల ప్రకాశ్
01 Mar 2026
కతోలిక బైబిలులో 73 పుస్తకాలుంటాయి (పూర్వ నిబంధన 46, నూతన నిబంధన 27). అయితే ప్రొటెస్టంటు బైబిలులో, పూర్వనిబంధనలో 39 పుస్తకాలే ఉంటాయి.నూతన నిబంధనలో (27) మార్పు ఉండదు.
పూర్వ నిబంధనలో ప్రొటెస్టంటు బైబిలులో కనుపించని 7 పుస్తకాలు ఇవి: తోబీతు, యూదితు, సొలోమోను జ్ఞానగ్రంథము, సీరాపుత్రుడైన యేసు. జ్ఞానగ్రంథము (సీరాకు), బారూకు, 1&2 మక్కబీయుల గ్రంథం.ఈ 7 పుస్తకాలను పరిశుద్ధ గ్రంథ పరిశిష్టభాగములు (Deutero Canonical books) లేదా Appocryphal books (గుప్తంగా ఉంచబడిన గ్రంథాలు) గా పేర్కొంటారు.ఈ గ్రంథాలలో ప్రాచీనత లేదని యూదుల భావం.
అందులోనూ ఇవి హీబ్రూ భాషలోకాక, గ్రీకుభాషలో వ్రాయబడినవి.హీబ్రూ భాష యూదుల అధికార భాష.ఇవి గ్రీకు భాషలో వ్రాయబడినవి గనుక,యూదులు వీటి ప్రామాణికతను గుర్తించలేదు. ప్రొటెస్టంట్లు కూడా యూదుల గ్రంథాలనే అనుసరిస్తారు. అందుకని ఈ పుస్తకాలు వారి బైబిలులో కనుపించవు. అందుకు, ఈ క్రింది కారణాలు యూదులకు, వారిని అనుసరించిన ప్రొటెస్టంటు సోదరులకు అభ్యంతరాలుగా ఉండవచ్చునని పండితులు భావన:
1.ఈ గ్రంథాలు యూదుల అధికార భాషయైన హీబ్రూ భాషలో వ్రాయబడలేదు.
గ్రీకుభాషలో వ్రాయబడినాయి.
2.దేవుని సందేశకులుగా దూతల, సైతానుల ప్రస్తావన (తోబీతు)
3.బారూకు గ్రంథంలో కనుపించే దూతలు, స్వప్నదృశ్యాలు (Visions)
4 చనిపోయిన వారి కోసం చేసే ప్రార్ధనలు (పాప ప్రాయశ్చిత్త స్థలము లేక ఉత్తరించు స్ధలము (Purgatory- 2 మక్కబీ 12:44-45).
5.మరణం తరువాత జీవనం / నిత్యజీవం
6.క్రీ.పూ 6వ శతాబ్దంలో బాబిలోనియా వలస తరువాత దేవుని ప్రేరణ మనిషికి పూర్వంవలె లేదని యూదుల అభిప్రాయం.ఈ పుస్తకాలు ఆ
తరువాతనే రచింపబడినట్లు భావిస్తారు.
7.ఇంకొక భేదం కూడా పాఠకులు గమనించాలి. కతోలిక బైబిలులో తప్పని సరిగా పాఠకుల అవగాహనకు ఉపకరించే కొన్ని సూచనలు, వివరణలు ఉంటాయి. ప్రతి పుస్తకానికి సంబంధించిన రచయిత, కాలం,చారిత్రక నేపథ్యం,అంతర్వస్తువు, భాషాశైలిలాంటి సాధారణ సూచనలు కలిగి ఉంటాయి. బైబిలులోని పుస్తకాన్ని చదివి ఆకళింపుచేసికోవడానికి ఇవి ఉపకరిస్తాయి..
