అవి విగ్రహాలు కావు స్వరూపాలు

ఫాదర్ కస్పార్
01 Mar 2026
మన దేవాలయాలలో లేక దేవాలయ ప్రాంగణంలో విగ్రహాలు/స్వరూపాలు ప్రతిష్టించే విశ్వాస సంప్రదాయాన్ని బోధకులు కొందరు అల్పజ్ఞానంతో విగ్రహారాధనగా వక్రీకరిస్తున్నారు.విశ్వాసులలో చీలికలు పుట్టించాలనే దుర్బుద్ధితో,మిడిమిడి జ్ఞానంతో చేసే ఇటువంటి వక్రీకరణలు నమ్మవద్దు.దేవుని రక్షణకార్యం నేల నాలుగు చెరగులా చేరడానికి క్రీస్తు ఆజ్ఞ మేర పవిత్రాత్మ దేవునిచే అపోస్తలుల పునాదిపై నిర్మితమైన పవిత్ర కతోలిక శ్రీసభ,విశ్వాసులు ఆధ్యాత్మిక జీవితానికి కీడు చేసే దేనిని కూడా విశ్వాస సాంప్రదాయం లేక భక్తి ఆచారాలలో ప్రవేశింపనివ్వదు. మేలుకానిది ఏది విశ్వాసుల దరి చేరనివ్వదు.దావీదు కుమారుడు సోలోమోను దేవాలయం నిర్మించాడు.ఈ ఆలయాలలో దేవుడు దూతల ప్రతిమలను, గర్భగుడిలో వివిధ ఆకారలను చెక్కించి పెట్టమన్నాడు (1 రాజులు 5,6అధ్యాయాలు, 2వ రాజుల దినచర్య).మోషే కాలంలో ఆ వస్తువులను సుందరంగా, పవిత్రంగా చెక్కటానికి దేవుడు బెసలేలు అనే వ్యక్తికి తన దైవాత్మచే తగిన జ్ఞానాన్ని, సామర్థ్యాన్ని కూడా ఇచ్చాడు (నిర్గమ 31:3), కారణం దేవుని ఆలయం అనునది సమావేశపు గది కాదు.దేవుని సన్నిధిని కలిగి ఉన్న పవిత్ర స్థలం.దేవుని సన్నిధిని స్మరించటానికి,దైవశక్తిని జ్ఞప్తికి తెచ్చుకోవటానికి,దేవునిపై దృష్టిని నిలపటానికి చెక్కబడి,ప్రతిష్టించిన దేవదూతల స్వరూపాలు,ఆయా ఆకారాలు తోడ్పడతాయి.అనునిత్యం భౌతిక ప్రపంచం పై కేంద్రీకృతమయ్యే మన పంచేంద్రియాలు దేవునిపై లగ్నం చేయబడాలి.బయట ప్రపంచం నుండి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి దృష్టి మారాలి.అందుకనే దేవుడు ప్రత్యేకంగా ఆ పనివారికి తన దైవాత్మను,జ్ఞానాన్ని ఇచ్చి దేవదూతలను చెక్కడాలలో తోడ్పడ్డారు.దైవ మందసం ఏర్పాటులో అంతరార్థం ఉంది.
అప్పుడు ఆ దేవాలయంలో, ఇప్పుడు మన దేవాలయాలలో స్వరూపాలు ప్రతిష్టించటం వెనుక ఉద్దేశ్యం ఇదే.స్వరూపాలు ప్రతిష్టించేది వాటిని ఆరాధించటానికి కాదు.అవి కేవలం దేవుని సన్నిధికి గుర్తులు, జ్ఞాపక స్ఫూర్తి చిహ్నాలు మాత్రమే. ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ ఉద్దేశ్యంతోనే స్వరూపాల ప్రతిష్ఠ సంప్రదాయం కొనసాగుతుంది. దానిని విగ్రహారాధనగా వక్రీకరించటం అల్పజ్ఞానమే కదా. మన మధ్య జీవించిన వ్యక్తుల స్వరూపాలు లేక వారు చేసిన పనులను స్వరూపాలుగా లేక చిత్రపటాలుగా ప్రతిష్టించడం అనేది ఆయా వ్యక్తులను, వారి పనులను నిత్యం స్మరించటానికి, సులభంగా గుర్తుపెట్టుకోవాటానికి తోడ్పడతాయి.మన విశ్వాస ఆచారంలో యోసేపు గారు, మరియతల్లి, క్రీస్తు శిలువ స్వరూపం,పునీతుల స్వరూపాలు మొదలైనవి దేవాలయాల్లో చూస్తాం.వీరందరూ మన మధ్య నివసించిన వ్యక్తులు,ఇవే కాకుండా పునీతులు పొందిన దర్శన దృశ్యాలను కూడా చిత్రీకరిస్తాం.మన మనస్సులను దేవునిపై లగ్నం చేయటానికి,దైవ సంఘటనలు సులభంగా గుర్తుపెట్టుకోటానికి తోడ్పడతాయి (సత్యోపదేశం 1159, 2131, 1161) ఇది విగ్రహారాధన ఎంత మాత్రం కాదు.వక్రీకరణ నమ్మవద్దు.
మనకు బాగా తెలిసిన మదర్ థెరిసాగారు, పునీత ఫ్రాన్సిస్ శౌరీవారు, కేరళ రాష్ట్రం పునీత ఆల్ఫోన్సమ్మ గారు మొదలగు నేటి తరం పునీతులందరు దేవాలయంలో ఉన్న ఈ స్వరూపాల ముందు ప్రార్ధన చేసిన వారే.మరి వారిది విగ్రహారాధనాయితే దేవునిచే పునీతులుగా పరిగణించబదరు కదా.అత్యంత సామాన్యులు సైతం, క్రీస్తుపై దృష్టి కేంద్రీకరించి, క్రీస్తు అనుబంధంలో బలపడటానికి అది నుండి శ్రీసభ అనుసరిస్తున్న ఈ సత్సంప్రదాయం ఏమాత్రం విగ్రహారాధాన కాదు. శిల్పి,లేదా కంసాలి కావొచ్చు లేక పనివారు కానొచ్చు వారు చేసిన విగ్రహాన్ని దేవుని అభిషిక్తుడు ఎప్పుడైతే ప్రార్ధన చేసి ఆశీర్వదిస్తారో ఆ సమయం నుండి ఆ స్వరూపం ఎవరినైతే సూచిస్తుందో, వారికి సాదృశ్యంగా మారుతుంది.ఆ స్వరూపం దగ్గర మనం చేసుకునే ప్రార్ధనలు,చేపట్టే భక్తికార్యాలు ఆ స్వరూపం సూచిస్తున్న వారికే చెందుతాయి (సత్యోపదేశం 2131)
ధనాపేక్ష, కామం, క్రోధం మొదలగు వానిని విగ్రహారాధన రూపాలుగా పౌలుగారు తన లేఖల్లో పేర్కొన్నారు. (గలతీ 5:20, రోమీ 1: 19-32, 1 కొరింతి 6.9) నక్షత్రాలను, ప్రకృతి అందచందాలను దేవునిగా ఆరాధించటం విగ్రహారాధన అని బైబిల్ గ్రంథం పేర్కొంటుంది (సొలోమోను 13 అధ్యాయం) మన మనస్సులను ఏదైతే దేవుని నుండి దూరం చేస్తుందో అదే విగ్రహం.అది డబ్బు కావొచ్చు, పదవీ కావొచ్చు,శారీరక వ్యామోహం కావొచ్చు. స్వరూపాలు ఏవి మన మనస్సులను క్రీస్తు నుండి త్రిప్పవు కదా! క్రీస్తు సిలువలో వేలాడుతున్న స్వరూపం ముందు నుంచున్నప్పుడు క్రీస్తు పట్ల భక్తిభావంతో నిలబడటాని ఆ సిలువ స్వరూపం తోడ్పడుతుందా? క్రీస్తు సిలువ పాటులను జ్ఞప్తికి తెచ్చుకొని, నెమరువేయటానికి ఉపకరిస్తుందా! క్రీస్తుతో ఉన్న అనుభూతి పొందటానికి మేలు చేస్తుందా? ఇక ఏ విధంగా విగ్రహారాధన అవుతుంది? అసత్య బోధకుల మాయమాటలకు ప్రభావితులు కావద్దు. అయితే మనం ప్రతిష్టించే స్వరూపాలు, చిత్రపటాలు భక్తికి, ధ్యానాన్ని ప్రేరేపించునట్లు ఉండాలని వైసియన్ మహాసభలో పెద్దలు సూచించారు. స్వరూపాల ప్రతిష్టలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.
