నేటి పునీతుడు: పునీత హిలరీ

ఫాదర్ ఆకుల ప్రసాద్
27 Feb 2026
సుగుణం: "శ్రీసభ సంస్కర్త”
లియో ది గ్రేట్ పోపుగారి తర్వాత పునీత హిలరీ గారు క్రీ.శ.46 నవంబరు 19న 46వ పోపుగా శ్రీసభ బాధ్యతల్ని స్వీకరించారు.వీరు ఇటలీలోని సార్డీనియాలో జన్మించారు. ఎఫేసులో జరిగిన క్రైస్తవ మహాసభకు 1వ లియో పోపుగారి ప్రతినిధిగా వెళ్ళిన వీరు ఆ సమావేశంలో అలెగ్జాండ్రియా పేట్రియార్కు అనే ప్రధానాధికారి అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా వ్యతిరేఖించారు. దానిమూలాన హిలరీ గారిని చంపుటకు కుట్ర జరిగింది.కానీ ఆ కుట్ర నుండి తనను సువార్తీకుడైన పునీత యోహాను గారు తన దివ్య సహాయంతో రక్షించారని హిలరీగారి నమ్మకం. హిలరీ గారి పరిపాలన చాలావరకు ప్రశాంతంగానే జరిగింది. ఫ్రాన్సు, స్పెయిన్ కతోలిక సంఘాల్లో క్రమశిక్షణ తెచ్చుటకు వీరు కఠినచర్యలు తీసుకున్నారు. క్రీ.శ.465 నవంబరు 19న రోములోని పునీత మేరి మేజర్ దేవాలయంలో జరిగిన మహాసభలో కతోలిక క్రైస్తవ శ్రీసభకు సంబంధించి వీరు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.అపోస్తలుడైన యోహాను, బప్తిస్మ యోహాను మరియు హోలీక్రాస్ జ్ఞాపకార్థంగా హిలరీగారు మూడు దేవాలయాల్ని నిర్మించారు. వీరు క్రీ.శ.468 ఫిబ్రవరి 28న పరలోకప్రాప్తినొందారు.
పునీత హిలరీ గారా మాకొరకు ప్రార్ధించండి!
బంగారు మాట:
కల్లాకపటం లేని చిన్నపిల్లల
మనస్తత్వం పరలోక దారిని
తెరుస్తుంది. కావున క్రీస్తు
దీనత్వం కలిగి, దేవుని బిడ్డలంగా
మనం రూపొందాలి.
(పునీత హిలరీ)
