క్రైస్తవ విలువలతో జీవిద్దాం

జోసెఫ్ అవినాష్
26 Feb 2026
తప:కాల 1వ శుక్రవారం
యెహెజ్కేలు 18:21-28
కీర్తన 130:1-2, 3-4, 5-7, 7-8
మత్తయి 5:20-26
ధ్యానం:
సమాజములో జీవించాలంటే చట్టాలు పాటించుట తప్పనిసరి. ప్రతి దేశము తమ పౌరులకు రక్షణ కల్పించుటకు,సమాజ శ్రేయస్సును కాపాడుటకు వివిధ నియమములు,చట్టములను పొందుపరుస్తూ,పౌరులందరూ వాటిని పాటించుటకు తగు ప్రమాణములు,జాగ్రత్తలు తీసుకొందురు కానీ,పాటించు నియమనిబంధనలు,చట్టములు విలువలతో కూడిన జీవితమును జీవించుటకు తోడ్పాడునిచ్చునా అనెడి అంశమును ఎవరూ లేవనెత్తరు.బహుశా,ఎవరూ ఆసక్తి చూపించరు.నేటి సువిశేషమునందు యేసు తన శిష్యులకు నీతివంతమైన జీవితము గురించి బోధిస్తూ,వారి ప్రమాణాలు పరిసయ్యుల, ధర్మశాస్త్ర బోధకుల నీతివంత జీవితమును మించి ఉండాలని తెలియచేస్తున్నారు.తద్వారా, నియమ నిబంధనలు,చట్టములు పాటింపును కేవలము ఇతరులు చూచుట కొరకు,వారి మెప్పును పొందుట కొరకు చేయక, విలువలతో కూడిన జీవితమును గడుపుటకు దోహదం చేయాలని హితవు పలికారు.
సంఘ జీవులుగా,వ్యక్తిగత జీవులుగా చట్టములను పాటించుట,నియమములను ఆచరించుట తప్పని సరియైననూ, నిజక్రీస్తు శిష్యులుగా ఒక అడుగు ముందుకు వేసి,అట్టి చట్టములు మనలను నీతివంతులుగా మార్చుతున్నాయా లేదా అని ప్రశ్నించుకొంటూ మన జీవన వైఖరిని మార్చుకోవాలి.తపస్సుకాల ప్రయాణమును కొనసాగిస్తూ మనకు నేటి సువిశేషము ఒక అద్దము వలె మన జీవన ప్రయాణములను ప్రతిబింభించు చుండగా,క్రీస్తు బాటలో వెలుగులో పయనించుటకు,ఇదొక సువర్ణవ కాశము.కనుక,ఏమరుపాటు ప్రదర్శింపక, మెలకువ కలిగి, సత్యాన్వేషణ చేస్తూ మన జీవితములను నీతివంతముగా జీవించుటకు,విలువలతో నింపుకొనుటకు అహర్నిశలు కృషి చేయాలి.
