నేటి పునీతురాలు : పునీత మెక్టిల్డమ్మ

ఫాదర్ ఆకుల ప్రసాద్
25 Feb 2026
సుగుణం: "క్రీస్తు యొక్క నైటింగేల్" - 'ఆధ్యాత్మిక నిధి'
శాగ్జోని రాజ్యం (జర్మనీ)లోని తురింగియా నగరంలో క్రీ.శ.1240లో మెక్టిల్డమ్మ జన్మించారు.వీరి అక్క బెనెడిక్టియన్ సభ మఠకన్య.అదే బాటలోనే మెక్టిల్డమ్మ గారు కూడా తన 7వ ఏటనే బెనెడిక్టు కాన్వెంట్ లో ప్రవేశించారు.చిన్నవయసులోనే సభ నోవిషియేట్ కు పెద్దగా నియమింపబడి ఎందరో మఠకన్యలకు ప్రేరణయ్యారు.మెక్టిల్డమ్మ గారు సంగీతంలో ప్రావీణ్యురాలు,చక్కటి మధుర స్వరాన్ని కలిగిన వీరు 'నైటింగేల్ ఆఫ్ హెల్ ఫ్టా'గా పేరొందారు.తన ఆధ్యాత్మిక సంరక్షణలోకి అప్పగింపబడిన జెత్రుతమ్మ గారిని ఓ గొప్ప పునీతురాలుగా తీర్చిదిద్దుటలో మెక్టిల్డమ్మ గారి కృషి ఎంతో ఉంది.ఎన్నో దైవదర్శనాలు పొందడమే గాక ఆధ్యాత్మిక రహస్యాలను విపులంగా విశదపరిచే జ్ఞానాన్ని కూడా ఆమె పొందియున్నారు.అనేక మంది ప్రముఖులు దైవీక విషయాలపట్ల ఆమె నుండి సంశయనివారణను పొందేవారు. స్వయానా క్రీస్తే ఆమెకు దర్శనమై తన హృదయ భక్తిని పెంపొందించమని ఆదేశించగా మెక్టిల్డమ్మ గారు జేసు తిరుహృదయ భక్తిని ప్రారంభించి దానిని విస్తరింప ప్రయత్నించారు.ఆమె తన 50వ ఏట ఆధ్యాత్మింగా మరియు శారీరకంగా గొప్ప వేదనలు అనుభవించారు.త్రిత్వైక దేవుని శక్తికి, జ్ఞానానికి,ప్రేమకు గుర్తుగా ప్రతిరోజూ మంగళవార్త జపాలను జపించమని మరియతల్లి మెక్టిల్డమ్మ గారిని దర్శనాన ఆదేశించారు.దర్శనాల యందు తాను తెలియజేసిన ఆధ్యాత్మిక రహస్యాలన్నింటిని ఒక పుస్తకరూపంలో పొందుపర్చమని స్వయానా క్రీస్తే మెక్టిల్డమ్మ గారిని ఆదేశించారు. పునీత జెత్రుతమ్మ గారి సహకారంతో "ప్రత్యేక కృపానుగ్రహ పుస్తకాన్ని" ఆమె లోకానికి అందించారు. క్రీ.శ 1298లో ఆమె పరలోక ప్రాప్తినొందారు.
పునీత మెక్టిల్డమ్మ గారా మాకొరకు ప్రార్ధించండి!
