క్రీస్తు సిలువపైనున్న ఫలకంలోని INRI అక్షరాలేంటి?
.jpg)
మహా ఘన. డా.సగినాల ప్రకాశ్
25 Feb 2026
INRI ఈ నాలుగు అక్షరాలు ప్రపంచ ప్రసిద్ధి గాంచినవి.ఎక్కడ సిలువ మీద క్రీస్తు ఆకాశానికి,భూమికి మధ్య వేలాడుతూ ఉంటాడో,అక్కడ ఆయన తల పైభాగాన ఈ అక్షరాలు మనకు దర్శనమిస్తాయి.ఈ నాలుగు అక్షరాలు,లతీను భాషలో సిలువ మీద వ్రాయబడిన పదాలకు మొదటి అక్షరాలు.వీటినీ సంక్షిప్త పదాలు అంటాం.నిజానికి సిలువ పైభాగంలోని ఫలకం మీది అక్షరాలు మూడు భాషలలో వ్రాయబడ్డాయి.అవి హీబ్రూ, గ్రీకు, లతీయ భాషలు
(యోహాను 19:20).
అయితే లతీను నుండే ఈ మొదటి అక్షరాలను తీసుకోవడంలో ఒక కారణం ఉంది.హీబ్రూ భాష యూదులు స్థానిక భాష,పాలస్తీనా నుండి బయటికి వస్తే అది మాట్లాడేవారెవరూ ఉండరు.గ్రీకు భాష చదువుకున్న వారికి, విద్యావంతులకే పరిమితం.కానీ లతీసు భాష సామాన్య ప్రజల భాష అంతేకాక,అనాటి రోమను సామ్రాజ్య అధికార భాష కూడా.ఈ కారణాల వల్ల లతీను భాషకే ప్రాధాన్యతనిచ్చారు.ఆ తరువాత లతీను శ్రీసభ అధికార భాష అయిన విషయం అందరికీ తెలిసిందే.కాబట్టి లతీనులో వ్రాసిన సిలువ ఫలకం మీది అక్షరాలే ప్రజలకు చేరవయ్యాయి. క్రమంగా పదాల స్థానంలో మొదటి అక్షరాలు మాత్రమే వ్రాయడం అలవాటయ్యింది.ఆ పదాలకు అర్థం ఇది
IESUS NAZARENUS REXIUDAEORUM(లతీను)
Jesus of Nazareth King of the Jews(ఇంగ్లీష్)
నజరేయుడగు యేసు,యూదుల రాజు (తెలుగు)
ఈ ఫలకం ద్వారా యేసును యూదులు రాజుగా యూదులే నిర్ధారించినట్లయింది. నిజానికి ఇది వారికి ఇష్టంలేని పని. మొదట దానిని వ్యంగ్యంగా, ఎగతాళిగా వ్రాస్తున్నామని ఊహించుకొన్నారు.కానీ తర్వాత వారికొక అనుమానమొచ్చింది.ఈ ఫలకం చదివినవారు.యేసు నిజంగా యూదుల రాజని భావిస్తారేమోనని ఆ తరువాత భయపడ్డారు.అందుకని పిలాతు దగ్గరకు వెళ్ళి, అతడు యూదుల రాజు కాదని,తను అలా చెప్పుకున్నట్లుగా తిరుగ వ్రాయమని అడిగారు.కానీ యూదుల ప్రవర్తనతో అప్పటికే విసిగిపోయిన పిలాతు, "నేను రాసినదేమో రాసితిని, అంతే!" అని టకీమని చెప్పేశాడు (యోహాను 19: 21-22). అలా వ్యంగ్యంగా సూచించదలచుకొన్న ఈ సంకేతాలు,చివరికి నిజమయ్యాయి.కానీ యూదయా మతాధికారులకు తాము, తమ ఎగతాళితోనే యేసుక్రీస్తుకు స్తుతి చేసినట్లు తెలియదు. నిజాన్ని వ్యంగ్య రూపంలో చెప్పించడం, రచనా నైపుణ్యంలో ఒక ప్రక్రియ. దీనినే "నిందా స్తుతి" అంటారు.
(irony) మార్కు సువిశేషంలో ఇటువంటివి పలుచోట్ల కనిపిస్తాయి.సైనికులు "యూరుల రాజు! నీకు శుభము" అంటూ ఆయనకు నమస్కరించారు (మార్కు 15:18). ఆయన యూదులకు ఒక్కరికీ కాదు అందరికీ రాజే సిలువ నుండి దిగి రమ్మని, ఇతరులను రక్షించినవాడు. తనను తాను రక్షించుకోలేక పోతున్నాడని యూదులు, పరిహసించారు (మార్కు 15:30-32). దేవాది దేవునికి సిలువ నుండి దిగిరావడం ఒక లెక్కా! ముమ్మాటికి కాదు. వాస్తవంగా ఇవన్నీ నిజాలే.కానీ అవి నిజాలని వ్యంగ్యంగా అనే వారికి తెలియదు. కానీ పాఠకునికి తెలుసు.స్తుతిని నింద ద్వారా, నిందించిన వారి నోటి నుండే వినడం పాఠ కునికి రచయిత ఇచ్చే పరోక్ష సంకేతం! ఉదాహరణకు భక్తుడు తన కష్టకాలంలో "నువ్వున్నావా!" అంటూ దేవున్ని నిందిస్తారు. దేవుడే లేడని నమ్మిన మనిషి ఆయనకు ఈ ప్రశ్నను వేయడు కదా! నిందా స్తుతికి అర్ధమిదే. ఇది రచయిత ఇచ్చే పరోక్ష సంకేతం.అది ఈ నిందాస్తుతిలోని ప్రత్యేకత అక్షరాల వెనుక దాగిన ఈ సత్యాన్ని గ్రహిస్తే, రచయితకు, మనకు సూచించే రక్షకుడు దర్శనమిస్తాడు.
