వ్యాకులమాత స్వరూపం విశేషాలు

మహా ఘన. డా.సగినాల ప్రకాశ్
24 Feb 2026
మరియమాత మహోన్నత వ్యక్తిత్వాన్ని ప్రతిబింభించే మూడు కళాకృతులను గురించి తప్పక తెలుసుకోవాలి.అవి:
1) కరుణామయి శిల్పం (Pieta)
(2) నిశ్చలమాత చిత్రం (Stabat Mater)
3) వాక్యులమాత చిత్రం (Mater Dolorosa).
ఇందులో మరియమాతను వ్యాకులమాతగా చూపిస్తూ రూపుదిద్దుకున్న అపురూప చిత్రం గురించి తెలుసుకుందాం. ఈ చిత్రంలో ఈమె హృదయాన్ని గుచ్చుకున్న యేడు బాకులకు అర్ధం బైబిలులోనే దొరుకుతుంది.క్రీస్తు శకం 1608 సం॥లో సెర్సైట్ ఆర్డర్లోని మఠవాసులు ఈ పండుగను జరుపుకొని ఈ భక్తికి పునాది వేశారు.ఆ తరువాత 1815వ సం॥లో ఏడవ భక్తినాధ పాపుగారు దీనిని అధికారపూర్వకంగా ధృవీకరించారు.
వ్యాకులమాత చిత్రంలో ఆమె హృదయాన్ని గాయపరిచే యేడు ఖడ్గములు ఆమె జీవితములో ఏడు దుఃఖ సంఘటనలను గుర్తుకు తెస్తాయి.ఇవన్నీ ఆమెకూ,యేసుక్రీస్తుకూ సంభవించినవే ఆయన రక్షణ కార్యములో ఆమె నిర్వహించిన పాత్రను కూడా ఈ చిత్రం ప్రతిబింభిస్తుంది. పాపం చేసే దుష్పరిణామాన్ని,పశ్చాత్తావ ప్రాముఖ్యతను తెలియజేసిన ఈ ఏడు సంఘటనలు,
1) సిమియోను ప్రవచనం- లూకా 2: 25-35
2)ఈజిప్టుకు పారిపోవడం - మత్తయి 2:13-15
3) బాలయేసు దేవాలయంలో తప్పిపోవడం లూకా 2:41-50. 4) కలువరి ప్రయాణంలో తల్లి, తనయుని కలుసుకోవటం - లూకా 23:27-31).
5) యేసుక్రీస్తు సిలువ వేదన, మరణం- యోహాను 19:25-30
6) యేసుక్రీస్తు శరీరాన్ని తల్లి ఒడిలో ఉంచడం - లూకా 23:50-59
7) యేసుక్రీస్తును సమాధి చేయడం - యోహాను 15:38-42
ఒక ఖడ్గం నీ హృదయాన్ని దూసుకుపోతుందన్న ప్రవచనం విన్న తరుణం నుండి ఆవేదన ఆమెను నీడలా వెంటాడింది (లూకా 2:35) ఆ చిన్న ప్రాయంలో ఆమెకు అది అర్ధం కాకపోయినా క్రమక్రమంగా తన కుమారుని చుట్టూ అల్లుకుంటున్నా అన్యాయపు నీలి నీడలు, హింసలు ఆమెను దహించి వేశాయి. మారు మనస్సు పొందని మనుషులు పదేపదే ప్రభువును సిలువ వేస్తారన్న సున్నిత సూచన ఈ చిత్రంలో కనిపిస్తుంది. ఆమె ఎక్కడ ఉన్నా తన బిడ్డల మంచిని కోరే మాతృమూర్తి అని కూడా ఈ చిత్రం తెలియజేస్తుంది. తల్లి హృదయం బిడ్డల చెడు ప్రవర్తనకు ఎలా బాధపడుతుందో ఈ చిత్రం కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది..
