క్రీస్తుతో మమేకమవ్వాలి

జోసెఫ్ అవినాష్
24 Feb 2026
తప:కాల 1వ బుధవారం
యోనా 3:1-10
కీర్తన 51:3-4, 12-13,18-19
లూకా 11:29-32
ధ్యానం:
మన అనుదిన జీవితములో ఎన్నో చిహ్నములను,గుర్తులను, సంజ్ఞలను వాడుతూ అవి సూచించు సందేశమును క్లుప్తముగా గ్రహించగలము.ఉదహరణకు, రోడ్డుపై ప్రయాణించునపుడు “ఆగుము” అనే గుర్తును చూసినపుడు,దానిననుసరించి మన వాహనమును ఆపుట ద్వారా కేవలము బాహ్యముగా సూచించు నెరవేర్చు కార్యమునే గాక,ఆ గుర్తులో దాగి ఉన్న అంతరంగిక అర్థమును, "ఇతరుల జీవితమును నా జీవితమును కాపాడు బాధ్యతను" తెలుసుకోగలగాలి.నేటి సువిశేషమునందు యేసు పరిసయ్యులనుద్దేశించి,వారు చిహ్నము కొరకు అడుగగా,వారిని మందలిస్తూ,యోనా ప్రవక్తను మించిన మరొక చిహ్నమేమియు యివ్వబడదని తెలియచేసాడు. మరోవైపు వారి హృదయ కాఠిన్యమును తెలియచేస్తూ, స్వయానా తనయందే అత్యున్నత చిహ్నము కలదని,సలోమోను మరియు యోనాలను మించిన పరిపూర్ణత తన ఉనికినందు ఇమిడి ఉన్నదని బోధించారు.
మన ఆధ్యాత్మిక జీవితములో పలు చిహ్నములను,గుర్తులను వాడుకొంటూ,చివరికి అవన్నియూ మనలను క్రీస్తువైపు,తదుపరి తండ్రి దేవుని చెంతకు చేర్చవలయుననెడి దృక్పధమును కలిగి ఉండాలి.గర్వముతో అహంభావముతో విర్రవీగక, వినమ్ర హృదయముతో మన ఏమిలేని తనమును గ్రహిస్తూ, క్రీస్తు ఆత్మతో పరిపూర్తిగా నింపబడాలి.దేవుని తెలుసుకొని, ప్రేమించి,సేవించు ప్రక్రియను నిరంతరాయముగా కొనసాగిస్తూ, క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తుయందు మాత్రమే దేవుని నింపాదిగా పొందగలమని, దేవుని బిడ్డలుగా జీవించగలమని గ్రహించాలి. చిహ్నముల సంజ్ఞలు,గుర్తులు మెట్లుగా వాడుకొనుచూ దినదినము ఆధ్యాత్మిక పరిపక్వత పొందుచూ, క్రీస్తుతో మమేకమవ్వాలి.
