నేటి పునీతుడు: పునీత పోలికార్ప్

ఫాదర్ ఆకుల ప్రసాద్
22 Feb 2026
సుగుణం: "అపోస్తలిక పితరుడు"
అపోస్తలిక పితరుడైన పోలికార్పుగారు పునీత యోహాను గారి బోధనలచే క్రీస్తును స్వీకరించారు. ఆదిమ క్రైస్తవ రోజుల్లో యూదాప్రజలు క్రీస్తును అనుసరించే వారిని మతద్రోహులుగా ముద్రవేసి నానా హింసలకు గురిచేసేవారు. అట్టి గడ్డురోజుల్లో అపోస్తులుడైన యోహానుగారు, భక్తుడైన పోలికార్పును పిలిచి ప్రత్యేక ఉపదేశం చేసి వారిని క్రైస్తవ మందకాపరిగా నియమించి స్మిర్నా అనే పట్టణానికి పీఠాధిపతిగా అభిషేకించారు. స్మిర్నా నందు యూదుల వేదింపులు, హింసలు ఎక్కువకాగా భక్తుల ఒత్తిడిమేరకు వయోవృద్దుడైన పోలికార్ప్ గారు పట్టణ పొలిమేరల్లో తలదాచుకుని క్రైస్తవుల క్షేమంకై మరియు యూదుల మారుమనస్సుకై ప్రార్థనలు చేశాడు. వీరి ఆచూకిని పసిగట్టిన యూదులు ఆయనను బంధించి న్యాయాధికారికి అప్పగించారు. క్రీస్తును విడనాడమని అతడు పోలికార్పును ఆజ్ఞాపించాడు. అందుకు ఆయన; "ఆ ప్రభువును తొంభైయారేళ్లు భక్తితో సేవించిన నేను ఏనాడు అపజయం పొందలేదు. అట్టి నారక్షకుడైన క్రీస్తును నేనెలా విడనాడగలను" అని బిగ్గరగా పలికారు. ఆ సమాధానానికి కోపోధ్రీక్తుడైన న్యాయాధికారి పోలికార్పు గారిని మండుచున్న అగ్నిగుండంలో వేసి కాల్చమని ఆదేశించాడు. ప్రార్థిస్తున్న పోలికార్పును భటులు అగ్నిగుండలోకి నెట్టివేశారు. కానీ అద్భుతరీతిలో గుండంలోని మంటలు పోలికార్పుగారిని ఏమిచేయకపోవుటను చూచిన క్రూరభటులు ఆశ్చర్యపడ్డారు. వెంటనే తేరుకొని పోలికార్పుగారిని బలమైన కత్తివేటుతో తలనరికి చంపారు. క్రీస్తుకొరకు క్రీ.శ.155లో పోలికార్పుగారు వేదసాక్షిగా మరణించారు. వీరి బలమైన వేదసాక్షిమరణం తొలినాటి క్రైస్తవుల్లో గొప్ప విశ్వాస కదలికను తెచ్చింది.
పునీత పోలికార్పు గారా మాకొరకు ప్రార్ధించండి!
