కతోలిక సంఘంలో సిలువ భావం

మహా ఘన. డా.సగినాల ప్రకాశ్

22 Feb 2026

43. సిలువ (Cross)

సిలువ, క్రైస్తవ మతానికి చిహ్నంగా ప్రపంచ ప్రసిద్ధినొందింది.లతీను సిలువ (Latin Cross) నేటి క్రైస్తవ ప్రపంచంలో అతి సులభంగా గుర్తించబడే ఒక ప్రముఖమైన క్రైస్తవ చిహ్నం.అనేక పరిశోధనలు సూచిస్తున్నట్లుగా యేసుక్రీస్తు ఇటువంటి సిలువ మీదే అంటగొట్టబడి ఉండాలి. ఈ సిలువను రెండు కొయ్యలతో ఒకదానిమీద ఇంకొకటి అమరుస్తారు. పైవిధంగా నాలుగు పక్షాలు నాలుగు వైపులకు విస్తరించి ఉంటాయి.ఇరువైపులలోని చేతి భాగాలు సమానకొలతలతో వుంటాయి. నేరస్తుల కాళ్ళను చేతులను సిలువ మీద అంటగొట్టి శిక్షించే మరణశాసనమే సిలువ.ఇది రోమనులు శిక్షాస్మృతిలో ఒక భాగం.

రోమను కతోలికులు తమ దేవాలయాలలో క్రీస్తు ప్రతిమతో ఉండే సిలువలను అమర్చుకుంటారు.దీనినే క్రూసిఫిక్స్ (crucifix) అంటారు.యేసుక్రీస్తు ప్రతిమలేని సిలువను క్రాస్ (cross) అంటారు.తెలుగులో ఈ రెండు పదాలకు వేరు వేరు అర్ధాలు లేవు.రెండింటిని సిలువే అంటున్నాం.సిలువ యేసుక్రీస్తు చేసిన త్యాగానికి గుర్తు సిలువ మీద యేసుక్రీస్తును చూసినప్పుడు ఆయన త్యాగమయుడని, చివరి వరకూ పోరాడిన మొక్కవోని దీక్షాపరుడని, పాపులకోసం ప్రాణంపోసిన స్నేహితుడని అన్నింటిని మించి తన రక్తంతో వెల చెల్లించి రక్షణ సాధించిన రక్షకుడని భక్తులు గుర్తుంచుకుంటారు.

మానవుల పాపాలను తనమీద వేసుకుని ఒక నేరస్థునిలా శ్రమలను అనుభవించిన రక్షకుడు ఇందులో దర్శనమిస్తాడు.ఒక బలిని గుర్తు చేస్తూ ఆనాడు క్రీస్తు తెచ్చిన రక్షణకార్యాన్ని ఈ సిలువ గుర్తు చేస్తుంది. ప్రొటెస్టంట్ క్రైస్తవులు (కొన్ని సంఘాలు) ప్రభువు ప్రతిమలేని సిలువను తమ దేవాలయాలలో అమరుస్తారు. ఆయన సిలువ మీద లేడని పునరుత్థానుడయ్యాడని దీనికి అర్ధం.ఒక విధంగా ఖాళీ సమాధిలాంటిదే ఈ ఖాళీ సిలువ కూడా! ప్రతిమ వున్న సిలువ శ్రమలకూ, పునరుత్థానానికీ మధ్యనున్నకాలాన్ని సూచిస్తుందని,అలా కాకుండా ప్రభువు పునరుత్థానుడయ్యాడని ఖాళీ సిలువను చూపించడం, ఇందులోని భావం.

క్రైస్తవులకు విజయచిహ్నం సిలువ.ఆయన ఈ సిలువతోనే ఈ లోకాన్ని జయించాడని క్రైస్తవుల విశ్వాసం,పౌలుని భావనలో, "నశించుచున్నవారికి క్రీస్తు సిలువ... అర్ధరహితమైనది. కానీ,రక్షింపబడుచున్న మనకు, అది దేవుని శక్తి" (1 కొరింతీ 1:18) క్రీస్తు అనుచరులు సిలువను చూసినప్పుడల్లా ఈ మాటలను గుర్తుకు తెచ్చుకుంటారు. "నన్ను అనుసరింపకోరువాడు తనను తాను త్యజించుకొని అనుదినం తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలయును" (లూకా 9:23) సిలువను మోసుకుంటూ వెళ్ళుతున్న తమ రక్షకుని, తమ సిలువలతో అనుసరిస్తూ ఈ లోకాన్ని జయించమని ఆయన వారికి ఇచ్చే సూచనలివి.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN