నేటి పునీతులు :పునీత ప్రాన్సిస్కో,పునీత జెసింత మార్టో

ఫాదర్ ఆకుల ప్రసాద్
19 Feb 2026
సుగుణం: 'మరియతల్లి దర్శనాలను పొందిన చిన్నారులు'
క్రీ.శ. 1917లో యూరప్ నందు భయానక యుద్దవాతావరణం, పోర్చుగల్ నందు రాజకీయ సంక్షోభం వున్న సమయంలో పోర్చుగల్ లోని ఫాతిమానందలి కోవాద ఇరియా వద్ద లూసియా, ఫ్రాన్సిస్కో అతని చెల్లియైన జెసింతా అనే ముగ్గురు చిన్నారులకు మరియమాత పలుమార్లు దర్శమిచ్చింది. అన్నాచెల్లెలైన ఫ్రాన్సిస్కో, జెసింతా గార్ల ఆధ్యాత్మికజీవితం ప్రపంచ దృష్టిని ఆకర్షించడమే గాక ఎంతోమంది తిరిగి కతోలికత్వాన్ని స్వీకరించేలా చేసింది. వీరిద్దరూ తమ కజిన్ అయిన లూసియాతో పాటు మరియతల్లి దర్శనాలను పొందారు. గ్రామస్తులు,మతపెద్దలు వీరికి పిచ్చిపట్టినదని భావించి వారిని జైలుపాలుచేశారు. కానీ 1917 అక్టోబర్ 13న దాదాపు 70000 వేల మంది ఈ చిన్నారులకు మరియమాత సూచించిన విధంగా ఆకాశంలో అసాధారణంగా సూర్య అద్భుతాన్ని చూశారు. జపమాలను జపిస్తూ ప్రపంచశాంతి కోసం, పాపుల రక్షణకోసం ప్రార్థన, ఉపవాసం, కఠినతపోక్రియలు, పశ్చాత్తాపం పాటించాలని మరియతల్లి పలికిన మాటలను ఈ చిన్నారులు ప్రజలకు తెలియజేయడమే గాక ఫ్రాన్సిస్కో, జెసింతలు పాటించారు కూడా. ఒకవైపు ప్రాణాంతకమైన అంటువ్యాధి ప్రపంచాన్ని వణికిస్తుండగా ఈ చిన్నారులు కఠినతపోక్రియలతో ప్రపంచపాపవిముక్తికై క్రీస్తువలే మరణించుటకు సిద్దపడ్డారు. అంటువ్యాధి బారిన పడిన వీరు తమ బాధలను పాపుల పరివర్తనకై సమర్పిస్తూ, 1919 ఏప్రిల్ 4న ఇంటి వద్ద ఫ్రాన్సిస్కో మరణించగా, 1920 ఫిబ్రవరి 10న హాస్పిటల్ నందు జెసింత మరణించినది. 2017 మే 13న ఫ్రాన్సిస్ పోపుగారు వీరిద్దరిని పునీతులుగా ప్రకటించారు.
పునీతులైన ఫ్రాన్సిస్కో, జెసింత లారా మాకొరకు ప్రార్థించండి!
