సిలువ మార్గము - చరిత్ర

Editor

19 Feb 2026

తపస్సు కాలంలో (LENT SEASON) కతోలిక శ్రీసభలో ప్రతి బుధవారం, శుక్రవారం మరియు పవిత్ర శుక్రవారం నాడు జరుపబడే "సిలువ మార్గం" ఒక గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమం.తరచుగ గుడికి రాని కతోలికులు సైతం సిలువ మార్గంలో పాల్గొనడానికి చూపించే ఉత్సాహం మనకు ఆశ్చర్యం కలిగించక మానదు. ఏ చర్చిలోనైనా,చర్చి ప్రాంగణంలోనైనా స్థాపించబడిన 14 స్థలాలను అతి పవిత్రంగా భావించి,జనం బారులు తీరి వుండటం తపస్సుకాలంలో పరిపాటి.ఈ సిలువ మార్గం ఎప్పుడు ప్రారంభమైనదో, దాని చారిత్రక నేపథ్యం ఏమిటో మనం ఒకసారి పరిశీలిద్దాం.

తొలి శతాబ్దం నుండే యెరుషలేములోని పవిత్ర స్థలాలను సందర్శించే అలవాటు క్రైస్తవ భక్తులకు ఉన్నట్లుగ చారిత్రక ఆధారాలున్నాయి.దేశవిదేశాల నుండి యెరుషలేము చేరుకొనే యాత్రికులను ఎక్కువగా ఆకర్షించింది ప్రభువు సిలువ నెత్తుకొని నడచిన మార్గం. పరిశుద్ధ సిలువ మార్గం. పిలాతు మందిరంగ చెప్పబడే స్థలం నుండి ప్రభువు యొక్క పరిశుద్ధ స్థలం వరకు ఉన్న పరిశుద్ధ మార్గాన్ని క్రైస్తవ భక్తులు పరవశంతో ముద్దాడారు.ఆ పరిశుద్ధ నేలలో తన్మయత్వంతో నడయాడారు. ఆధ్యాత్మిక సంపదను మూటకట్టుకున్నారు.ఈ పవిత్ర సిలువ మార్గంలో ప్రత్యేక స్థలాలను నెలకొల్చి, వాటి వద్ద ఆగి ధ్యానించే ఆచారం మొదలయ్యింది.

యెరుషలేములోని పవిత్ర యాత్రా స్థలాల సందర్శన క్రీ.శ. 1187లో యెరుషలేము ఈజిప్టు సుల్తాను మరియు సిరియా దేశాల దళాల చేతికి చిక్కడంతో స్తంభించింది. తిరిగి యెరుషలేము సందర్శించలేని భక్తుల కొరకు యెరుషలేములోని పరిశుద్ద సిలువ మార్గం స్థలాలను పోలిన విధంగా పటాలను తయారు చేసి వాటి ముందు నిలబడి ఆ స్థలానికి సంబంధించిన ఘట్టాన్ని ధ్యానం చేసే అలవాటును ఫ్రాన్సిస్కన్ సభ గురువులు ప్రారంభించారు.సభ వ్యవస్థాపకులైన శ్రీనీత అస్సిసి పురఫ్రాన్సిస్ అద్భుతమైన సిలువ ధ్యానాలను అందించారు.మొదట 7 స్ధలాలలో ఈ సిలువ మార్గం కొనసాగింది. కొంతమంది 30 స్థలాలను ధ్యానించే స్థలాలలో అలవాటు చేసారు.16,17 శతాబ్దాలలో ఈ సిలువ మార్గం 14 స్థలాలుగ స్థిరపడింది. నేటికీ ఈ 14 స్థలాలనే మనం సిలువ మార్గం లో ధ్యానిస్తున్నాము. 40 సంవత్సరాల తర్వాత ఫ్రాన్సిస్కన్ సభ గురువులకు యెరుషలేము ప్రవేశ అనుమతి లభించింది. క్రీ.శ. 1686లో ఫ్రాన్సిస్కన్ సభ గురువుల అభ్యర్ధన మేరకు పరిశుద్ధ 11వ ఇన్నోసెంట్ పాపుగారు ఆ సభకు చెందిన దేవాలయాలలో ఈ 14 స్థలాలను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతినిచ్చారు. క్రీ.శ. 1731 లో పరిశుద్ధ 12వ క్లెమెంటు పాపు గారు ఇతర చర్చిలలో కూడ 14 స్థలాలను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించారు. క్రీ.శ. 1862లో ప్రపంచ వ్యాప్తంగా సిలువ మార్గ స్థలాలను ఏర్పాటు చేసుకొని ప్రభువు శ్రమలను, పాటులను ధ్యానించుకునే అనుమతి ఇవ్వబడింది. ఐరోపాలోని అనేక చర్చిల లోపల గోడలకు 14 స్థలాల చిత్ర పటాలు, చర్చి ప్రాంగణంలో నమూనాలు తయారు చేసుకొని ప్రభువు సిలువ మార్గంలో భక్తులు పాల్గొనేవారు.

నేడు మనం ధ్యానిస్తున్న 14 స్థలాలు 16, 17 శతాబ్దాల నుండి భక్తులు
ధ్యానిస్తున్నవే.
1. యేసుక్రీస్తు మరణశిక్ష పొందుట.
2. యేసుక్రీస్తు సిలువ నెత్తుకొనుట-
3.యేసుక్రీస్తు మొదటి సారి స్లీవక్రింద పడుట,
4. యేసుక్రీస్తు తన తల్లిని కలిసికొనుట.
5. యేసు క్రీస్తు కు సిరేనియా సీమోను సహాయపడుట.
6. యేసుక్రీస్తు రక్తసిక్త ముఖమును వెరోనిక తుడుచుట.
7. యేసుక్రీస్తు రెండవసారి స్లీవ క్రింద పడుట.
8. యేసుక్రీస్తు యెరుషలేము స్త్రీలను ఓదార్చుట.
9. యేసుక్రీస్తు మూడవసారి స్లీవ్ క్రింద పడుట.
10. యేసుక్రీస్తు వస్త్రములను ఒలుచుట.
11. యేసు క్రీస్తు సిలువకు కొట్టబడుట
12.యేసుక్రీస్తు సిలువపై మరణించుట.
13.యేసుక్రీస్తు దేహమును సిలువ పై నుండి దింపుట. 14.యేసుక్రీస్తు దేహమును సమాధిలో ఉంచుట.

ఆధునిక కాలంలో 15వ స్థలంగా యేసుక్రీస్తు ఉత్థానమును గురించి ధ్యానిస్తు సిలువ మార్గాన్ని ముగిస్తున్నారు. సంప్రదాయంగ సిలువ మార్గంలో
14 స్థలాలనే ధ్యానించడం శ్రీసభలో అనాదిగా వస్తున్న ఆచారం. 1991లో పరిశుద్ధ రెండవ జూన్ పాల్, పాపు గారు స్వయంగ సిలువ మార్గం. స్థలాలను వ్రాసి ధ్యానించారు. 2007 లో పరిశుద్ద 16 వ బెనెడిక్టు పాపుగారు
వాటిని ప్రోత్సహించారు. చాల మంది భక్తులు క్రొత్తక్రొత్త కోణాలలో 14 స్థలాల ధ్యానాలను వ్రాసి సరిక్రొత్త భాష్యాన్ని అందించి క్రైస్తవ
ప్రజలలో ఆధ్యాత్మిక ఉత్తేజాన్ని నింపారు. అవి శ్రీసభ చేత ఆమోదించబడక పోయినప్పటికీ, అవి క్రైస్తవ ప్రజలను ఎంతగానో ఆధ్యాత్మికంగ
ప్రభావితం చేస్తున్నాయి. అన్నిటిలో పునీత అల్ఫోన్స్ లిగోరి గారి సిలువ మార్గం బహుళ ప్రాచుర్యం పొందింది.

14 స్థలాల సిలువ మార్గం. ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధనంగా మనం చెప్పుకోవచ్చు.ఇది ఒక ఆధ్యాత్మిక ధ్యానం మాత్రమే కాదు. నిజంగానే ప్రభువుతో కలసి ఆయన నడచిన ఆ పరిశుద్ధ, దుఃఖకరమైన మార్గంలో నడచిన అనుభూతిని, ప్రభువు సిలువ శ్రమలలో, పాటులలో, బాధలలో భక్తులు స్వయంగా పాల్గొన్న అనుభవాన్ని కలిగిస్తుంది.ఒక వేళ ఈ స్థలాలకు సంబంధించిన ప్రార్ధనా పుస్తకం చేత లేకుంటే, ఒక్కో స్థలం గురించి మనస్సులోనే ధ్యానించి "స్థలం నుండి మరొక స్థలానికి నడుస్తు" ఈ 14 స్థలాల సిలువమార్గాన్ని మనం జరుపుకోవచ్చు. తపస్సు కాలంలో ప్రతి బుధవారం, శుక్రవారం జరుపుకొనే ఈ సిలువమార్గం ద్వారా తపస్సుకాల పవిత్రతను, పుణ్యాన్ని క్రైస్తవ ప్రజలు పొందుతున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం అక్కరలేదు. గుడ్ ఫ్రైడే నాడు 14 స్థలాలను బహిరంగంగ ధ్యానించడం,సిలువ ఊరేగింపులో 14 స్థలాలను ధ్యానించడం, పీఠాధిపతులు, గురువులు సిలువను మోస్తూ సాగించే ఈ సిలువ పథం ప్రభువు సాగించిన ఆ పరిశుద్ద సిలువ యాత్రను మనకు కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తుంది. ఈ ఆధ్యాత్మిక భక్తి కృత్యానికి మరో ప్రత్యామ్నాయమే లేదు.
నా చిన్నతనంలో అమ్మానాన్నలతో దేవాలయంలో సిలువ మార్గం లో పాల్గొన్న జ్ఞాపకాలు ఇంకా పదిలంగా ఉన్నాయి.వత్తాసు బాలురు ఇద్దరు క్రొవ్వొత్తులు పట్టుకుంటే వారి మధ్య ఒకడు సిలువను పట్టుకుని నడుస్తుంటే చిన్నప్పుడు వాటిని పట్టుకోడానికి పోటీ పడేవాళ్ళం. గ్రామాలలో ఇంకా ఇది మనకు కనబడుతుంది. చిన్ననాటి నుండి బిడ్డలు ఈ సిలువ మార్గం ద్వారా ఒక ఆధ్యాత్మిక క్రమశిక్షణను, అమూల్యమైన క్రైస్తవ జీవన మాధుర్యాన్ని పొందుతున్నారు. ఈ సిలువ యాత్ర ద్వారా మానవ జీవన గమనానికి ఒక నిత్యనూతన సూత్రాన్ని నేర్చుకునే అవకాశముంది. శ్రమలు, బాధలు మానవజీవితంలో ఒక భాగం. వాటిని తప్పించుకోవాలి అనుకుంటే జీవితంలో ఓడిపోవడమే. ప్రభువు వాటిని తప్పించుకోవాలనుకుంటే తప్పించుకొని ఉండేవాడు. "నేను నాతండ్రిని ప్రార్థింపలేననుకొంటివా? ప్రార్థించిన ఈ క్షణమే ఆయన పండ్రెండ దళముల కంటె ఎక్కువ మంది దూతలను పంపడా?" (మత్తయి 26/53) అని చెబుతూ, వాటిని ఎదుర్కోవడమే సరియైన జీవన విధానమని నిరూపించాడు. శ్రమల అనంతరం మహిమ జీవితం ఉన్నదని, సిలువ వెనుక విజయం దాగి వున్నదని ఈ సిలువ మార్గం మనకు బోధిస్తున్నది. ఈ మానవజీవితం దుఃఖభూయిష్టమైనదైతే కావచ్చు కాని దాని చివర ఊహించని విజయం పొంచివున్నదని ఎంత మందికి తెలుసు? NO CROSS, NO CROWN అంటారు. అంతే కాదు ఈ సిలువ మార్గం మరొక సత్యాన్ని మనకు తెలియచేస్తున్నది. ప్రభువు ఎరుగని బాధ లేదు, పొందని అవమానం లేదు, అనుభవించని శ్రమలేదు. మనము అనుభవించే కష్టాలు, బాధలు ఆయన ఎరగనివి కావు. "మన బలహీనతలను గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాదు మన ప్రధాన యాజకుడు. అంతేకాక మనవలెనే అన్ని విధములుగా శోధింపబడియు, పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు" అని హెబ్రీయులకు వ్రాసిన లేఖ చెబుతున్న మాట వాస్తవం (4/15). ప్రభువు మూడుసార్లు స్లీవ క్రింద పడుటను గురించి ధ్యానించినపుడు, పడిన ప్రతిసారి ప్రభువు లేచాడనే విషయం మనకెంతో ధైర్యాన్ని నేర్పిస్తుంది.సమసమాజ దైవ రాజ్యస్థాపనే యేసుక్రీస్తు లక్ష్యమైనపుడు, మరణానికి వెన్ను చూపి వెనుతిరిగి వుంటే తాను ఆశించినది నెరవేరేదా? సిలువపై ఈ లోక శక్తులపై పోరాడి విజయుడై మృత్యుంజయుడై ఆదర్శనీయమయ్యాడు.

క్రీస్తు శ్రమలు, మరణం పై ధ్యానం వాటిలో మనం ప్రత్యక్షంగా పాల్గొనేట్లు చేస్తున్నది.మన శరీరాలను, మనసును ధృడంగా చేస్తున్నది. పునీత సిలువ యోహాను చెప్పినట్లు, క్రైస్తవ జీవితం ఇరుకైన మార్గమే. ఈ ఇరుకు మార్గంలో ప్రయాణించడం తేలికైన విషయం కాదు. సిలువను సాధనంగా, మలుచుకుంటేనే ఈ ఇరుకు ప్రయాణాన్ని చేయగలం. మానవ జీవితం సులువు మార్గం కాదు. అది సిలువ మార్గం.

పునీత అల్ఫోన్స్ లిగోరి గారు వ్రాసిన సిలువ మార్గంలో మొదటి స్థలంలో వ్రాయబడిన ఒక ఆణిముత్యం లాంటి మాట, " మీకు మరణశిక్ష విధించినది పిలాతు కాదు, నా పాప దోషములే మిమ్ములను మరణశిక్షకు గురి చేసినవి" ఈ మాటలతో ప్రారంభమైన సిలువ మార్గం ప్రతివ్యక్తిలో తన పాపాలకొరకు దుఃఖాన్ని, పశ్చాత్తాపం కలిగిస్తుంది. తపస్సుకాలానికి కిరీటం పశ్చాత్తాపం.సిలువ మార్గాన్ని మించిన పశ్చాత్తాప ప్రార్థన లేదు. క్రీస్తు శ్రమల, పాటుల, మరణ ఘట్టాలలో పాలుపంచుకొనే క్రైస్తవుడు తన పాపాల కొరకు దుఃఖపడి, పశ్చాత్తాపం పొంది ప్రభువు తన పాపాల కొరకే ప్రభువు మరణించాడనే సత్యాన్ని గ్రహించి ప్రాయశ్చిత్త క్రియలను చేయడానికి ప్రయత్నించాలి. "ఇప్పుడైనను మీరు పూర్ణహృదయముతో నా చెంతకు మరలిరండు. ఉపవాసముతోను, సంతాపముతోను, ఏడ్పులతోను నా వద్దకు తిరిగిరండు" అన్న యావేలు ప్రవక్త, (2/12) మాటలను జ్ఞాపకం చేసుకుందాం. సిలువమార్గాన్ని జపిద్దాం ధ్యానిద్దాం,ఆధ్యాత్మికంగా తరిద్దాం.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN