నేటి పునీతుడు: పునీత కాన్రాడ్ ఆఫ్ పైసెంజా

ఫాదర్ ఆకుల ప్రసాద్
18 Feb 2026
సుగుణం: "క్రీస్తు కొరకు సర్వసంఘపరిత్యాగం"
పునీత కాన్రాడ్ గారు ఉత్తర ఇటలీలోని పైసెంజాలో నివసించిన తొలిక్రైస్తవ కుటుంబాలకు చెందిన వారు. క్రీ.శ. 1290లో పుట్టిన వీరు సైన్యంలో చేరి మంచి ఖ్యాతిని పొందారు.ఒకసారి వీరు ఎంతో కష్టపడి వేటాడిన జంతువు ఓ చిట్టడవిలో తప్పించుకోనిపోగా అసహనంతో ఆ అడవికి నిప్పంటించమని భటులకు ఆజ్ఞాపించాడు.నిప్పుకు వాయువు జతై అడవితో పాటు చుట్టుప్రక్కలవున్న పంటపొలాలన్నీ అగ్నికి ఆహుతై జరగకూడని నష్టం జరిగింది. ఊహించని ఈ విపత్కర పరిణామానికి కాన్రాడ్ ఎంతో విచారించాడు.పంటనష్టపోయిన వారు ఈ ఘటనకు బాధ్యులెవరని ఆరాతీసి చివరకు ఒక పేద బోయవాన్ని బాధ్యునిచేసి అతనిని అవమానించి శిక్షకు గురిచేసి చంపాలని నిర్ణయించారు.ఈ విషయం తెలిసిన కాన్రాడ్ గారు ఎంతో కలతచెంది తన బదులు ఒక నిర్భాగ్య పేదవాడు బలికావడం ఇష్టంలేక వెంటనే వెళ్ళి నష్టపోయిన రైతులకు జరిగినదంతా చెప్పి తనతప్పును క్షమించమని వేడుకొని నష్టపోయిన వారికి తన ఆస్తినంతా అమ్మి పరిహారం చెల్లించి తన నిజమైన క్రైస్తవత్వాన్ని,సోదరప్రేమను చాటుకున్నారు. అందుకు తన భార్యకూడా సహకరించినది.భార్యాభర్తలిద్దరూ స్వచ్ఛందంగా దేవునికి తమను అర్పించుకొని పవిత్రజీవితం గడపాలనుకున్నారు.కాన్రాడ్ భార్య పేద క్లేరిస్టు కన్యాస్త్రీ మఠంలో ప్రవేశించారు.కాన్రాడ్ గారు పునీత ఫ్రాన్సీసు గారి మూడవ సభలో చేరి సన్యాసి జీవితానికి అంకితమయ్యారు. సర్వసంఘపరిత్యాగియై సిసిలీద్వీపంలో నోటో కొండగుహలో 30 సం! గడిపిన పిమ్మట క్రీ.శ. 1351 ఫిబ్రవరి 19న మోకరించి ఏసు శిలువ శ్రమలను ధ్యానిస్తూ అలాగే పరలోకప్రాప్తినొందారు.
పునీత కాన్రాడ్ ఆఫ్ ప్రైసెంజా గారా మాకొరకు ప్రార్థించండి!
బంగారు మాట:
మన తప్పుకు మరొకరు బలికావడాన్ని
దేవుడు ఎన్నటికీ సహించడు,
మనలను క్షమించడు”
పునీత కాన్రాడ్ ఆఫ్ పైసెంజా
