పాప సంకీర్తనానికి బైబిలులో ఆధారాలున్నాయా?

మహా ఘన. డా.సగినాల ప్రకాశ్
18 Feb 2026
అవును ఉన్నాయి.పూర్వ నిబంధనలోని లేవీయకాండం ఈ విధంగా చెబుతోంది: "పాప పరిహారబలిగా ఒక పొట్టేలిని సమావేశపు గుడార ప్రవేశద్వారము వద్దకు కొనిరావలయును.యాజకుడు ఆ పొట్టేలును బలి ఇచ్చి అతని పాపమునకు ప్రాయశ్చిత్తము చేయును.ప్రభువు అతని తప్పిదములను మన్నించును" (లేవీయ 19:21).ఇక్కడ యాజకుడు పాపి తప్పిదము తెలుసుకోకపోతే ప్రాయశ్చిత్తము చేయలేడు కదా! ఈ విధంగా పాప పరిహారంలో మానవ మధ్యవర్తిత్వము పూర్వనిబంధన నుండే ప్రారంభమయింది.నూతన నిబంధనలో అది స్పష్టతను సంతరించుకుంది.ఈ వాక్యం గమనించండి: "పై పాపములలో దేనినైనా కట్టుకొనినవాడు.తన దోషమును అంగీకరింపవలయును.. యాజకుడు అతనికి ప్రాయశ్చిత్తము జరిగింపగా అతడు పాపము నుండి విముక్తుడగును" (లేవీయ (5:5-6) భప్తిస్టు యోహాను వద్ద ప్రజలు తమ పాపములను ఒప్పుకొనుచూ,బాప్తీస్మము పొందారని మత్తయి వివరించాడు (మత్తయి 3:6). "ప్రజలు తమ పాపములు ఒప్పుకొనుచు..." అంటూ మార్కు కూడా ప్రస్తావిస్తాడు. (మార్కు 1:5). బప్తిస్మ యోహాను ప్రజల పాపాలను విన్నాడు గనుకనే "ఇదిగో! లోకపాపములు పరిహరించు దేవుని గొర్రెపిల్ల" అంటూ ప్రజలకు యేసుక్రీస్తును చూపగలిగాడు (యోహాను 1:29) పాపపరిహారానికి ఇక్కడ మానవ మధ్యవర్తిత్వం ఆమోదించినట్లయింది.ఆ తరువాత క్రీస్తుప్రభువు స్పష్టమైన అధికారాన్ని తన శిష్యులకిచ్చాడు.తమకు పాపములు క్షమించే అధికారమున్నదని తెలియజేశాడు (మత్తయి 9:6-8) ఈ శక్తిని క్రీస్తు తన శిష్యులకిచ్చినట్లు యోహాను వివరిస్తాడు. "ఎవరి పాపములనైనను మీరు క్షమించిన యెడల అవి క్షమింపబడును... వేనిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడును" అని చెప్పిన ప్రభువు పాపక్షమాపణను కూడా వారికి అధికారపూర్వకంగా ఇచ్చాడు (మత్తయి 18:18). "మీరు పరస్పరము మీ పాపములు ఒప్పుకొనుడు" అని బోధించిన యాకోబు, పాపక్షమాపణలో మానవ మధ్యవర్తిత్వాన్ని సమర్ధించి అందులో స్వస్థత దాగుందని కూడా వివరించాడు (యాకోబు 5:16).
మొదటి క్రీస్తు సంఘంలో,ప్రతి క్రీస్తు సంఘమునందును పెద్దలు నియమింపబడి, సంఘస్తుల ఆధ్యాత్మిక అవసరములు తీర్చే వారని అపోస్తులకార్యం తెలియజేస్తుంది (అ.కా. 14:23; 15:2) పౌలుని మాటలలో "ఇది అంతయు దేవుని వలన జరిగినది. ఆయన క్రీస్తు ద్వారా మనలను తనతో సఖ్యపరచుకొని, ఇతరులను కూడా ఆయనతో సఖ్యపరచు ప్రేషితకార్యమును మాపై పెట్టెను" (2 కొరింతీ 5:18). కాబట్టి బైబిలులో దేవుడు మానవుల పాపాలను క్షమించే దయామయుడని, క్రీస్తు దేవునికి మానవునికీ మధ్యవర్తిగా ఉన్నాడనీ,ఆ క్రీస్తే మానవులను నియమించి, వారి ద్వారా ప్రజలను తనతో సఖ్యపరచుకుంటాడనీ వివరించబడి ఉంది.
