సిలువ శ్రమలలో భాగం పంచుకుందాం

Father gopu praveen

18 Feb 2026

విభూతి బుధవారం తరువాతి గురువారం
ద్వితీయ 30:15-20;
లూకా 9:22-25

ధ్యానాంశము: క్రీస్తు పాటుల ప్రస్తావన - త్యజింపు, సిలువ, అనుసరించుట
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: "ఒకడు లోకమంతటిని సంపాదించి తనను తాను కోల్పోయిన లేక తాను నశించి పోయిన ఎడల ప్రయోజనమేమి?" (లూకా 9:25).
ధ్యానము: నేటి సువిశేషములో, మొదటిగా, తాను పొందబోవు 'పాస్కా పరమ రహస్యం' (పాటులు, మరణం, పునరుత్థానం) గురించి యేసు [మనుష్యకుమారుడు] శిష్యులకు వెల్లడి చేసారు (9:22). శిష్యులు నిత్యజీవమును పొందాలంటే, క్రీస్తు పాస్కామార్గాన్నే అనుసరించాలని ప్రభువు తెలియజేయు చున్నారు. "మనుష్యకుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే, ప్రధానార్చకులచే ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి, చంపబడి, మూడవ దినమున ఉత్థానమగుట అగత్యము" (9:22). ఈ వచన మొదటి భాగం, యేసు మానవ స్వభావాన్ని, రెండవ భాగం ఆయన దైవత్వాన్ని స్పురిస్తుంది.
మరియు శిష్యరికములో మూడు ముఖ్యమైన అంశాలు అవసరమని యేసు స్పష్టం చేయుచున్నారు: ఒకటి తననుతాను త్యజించుట (ఆత్మ / స్వీయ త్యజింపు); రెండు అనుదిన సిలువను ఎత్తుకొనుట; మూడు ఆయనను అనుసరించుట. "నన్ను అనుసరింప కోరువాడు తనను తాను త్యజించుకొని అనుదినము తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింప వలయును" (9:23).
1. ఆత్మ / స్వీయ త్యజింపు: శిష్యరికానికి లేదా యేసును అనుసరించాలంటే మొదటిగా మనం చేయవలసినది, త్యజింపు. స్వీయ / ఆత్మ త్యజింపు, నిత్యం అహంపై యుద్ధం చేయడం లాంటిది! స్వీయ త్యజింపు అనగా తండ్రి దేవుని మరియు యేసు క్రీస్తు కుమారుల అధికారమునకు లోబడటం; శారీరక సుఖాలను త్యజించడం; అహంభావమును, స్వార్ధమును త్యజించుట. హృదయశుద్ధి కలిగి యుండుట. స్వీయ / ఆత్మ త్యజింపు అనగా తననుతాను కోల్పోవడం కాదు లేదా తాను నశించి పోవడం కాదు: "ఒకడు లోకమంతటిని సంపాదించి తననుతాను కోల్పోయిన లేక తాను నశించి పోయిన ఎడల ప్రయోజనమేమి?" (లూకా 9:25). "సంపాదన", లోక సంపదలను, వ్యాపారాలను సూచిస్తుంది. "తననుతాను కోల్పోవడం" అనగా స్వీయ / ఆత్మ త్యజింపు; తననుతాను తగ్గించుకోవడం, తద్వారా ఇతరులకు సేవచేయడానికి సమయం, శక్తి, అంకితభావం కలిగి యుండటం. తననుతాను ప్రేమించునట్లు ఇతరులను ప్రేమించడం. సిలువను ఎత్తుకొని యేసును వెంబడించడం. కనుక, లోకసంపాదనలతో, బాధ్యతారహితమైన, స్వార్ధపూరితమైన బ్రతుకులతో క్రీస్తు ఒసగు నిత్యజీవమును కోల్పోకూడదు.

2. అనుదిన సిలువను ఎత్తుకొనుట: మన సిలువనుండి మనం తప్పించుకోలేము, కనుక 'అనుదినము' మోయవలసినదే!["అనుదినము", లూకా మాత్రమే ఈ పదాన్ని చేర్చాడు] సిలువ అనగానే, ముందుగా మనకు గుర్తుకు వచ్చేది మన అనుదిన కష్టాలు, బాధలు, శ్రమలు, అవమానాలు, అపార్ధాలు, ద్వేషం, తిరస్కరణలు, చీత్కారాలు, హింస..! వీటితోపాటు, ముందుగా సిలువ మన పాపాలకు, అవిశ్వాసమునకు మరియు స్వార్ధానికి మరణం అని గుర్తుంచుకోవాలి! సిలువ మరణం తిరిగుబాటుదారులకు, దేశద్రోహులకు విధించే శిక్షగా మొదట పర్షియన్లు అమలుచేసారు. ఆ వ్యక్తి చేసిన నేరాన్ని సిలువపై లిఖించేవారు. ఆ తరువాత దానిని గ్రీకులు, రోమనులు అనుసరించారు. సిలువ మరణం, అత్యంత దౌర్భాగ్యమైన శిక్షగా పరిగణించబడేది. సిలువ మరణాన్ని, యూదులు ఆటంకముగాను, అన్యులు అవివేకముగాను భావించారు (1 కొరి 1:23). అయితే యేసు పునరుత్థానము సిలువకున్న అర్ధాన్ని పూర్తిగా మార్చివేసింది. సిలువపై యేసు మరణం, లోకరక్షణార్ధముగా మారింది. ఇది ఒక ప్రాయశ్చిత్తముగా మారింది. త్యాగానికి, దైవప్రేమకు నిదర్శనముగా మారింది. కనుక సిలువ ఎత్తుకోవడం అనగా క్రైస్తవులముగా బాధ్యతాయుతముగా జీవించడం; ఇతరులను, ముఖ్యముగా అవసరములోనున్న వారిని చేరువవడము. స్వార్ధపూరితమైన ఉద్దేశ్యాలు, ప్రయోజనాలను వీడినప్పుడే, ఇతరులకు సేవచేయగలం! ఇతరులకు సేవచేసే క్రమంలో పొందే బాధలను అంగీకరించడం కూడా మన సిలువను ఎత్తుకోవడమే! కనుక, సిలువను, ప్రేమించాలి; సిలువను ధరించాలి. సిలువను మోయాలి. పవిత్రాత్మ శక్తితో మన సిలువలను రక్షణ సాధనాలుగా మార్చుకోవాలి.

3. క్రీస్తును అనుసరించుట: నిజమైన శిష్యరికం క్రీస్తును మాత్రమే అనుసరించడం! దేవుని వాక్యానికి, ఆజ్ఞలకు లోబడి జీవించడం. శ్రీసభ బోధనలకు కట్టుబడి జీవించడం. ప్రభువును అనుసరించాలంటే, తప్పక మనలను మనం త్యజించుకొని, మన సిలువను ఎత్తుకొని ఆయనను అనుసరించాలి. ఈ అనుసరణ క్రీస్తుతోపాటు మన మరణానికి నడిపిస్తుంది. క్రీస్తును అనుసరించేవారు దీనిని తప్పక గుర్తించాలి. 'మరణమొందినప్పుడే, నిత్యజీవమును పొందెదము': "తన ప్రాణమును కాపాడుకొన చూచువాడు దానిని పోగొట్టు కొనును. నా నిమిత్తమై తన ప్రాణమును ధారపోయువాడు దానిని దక్కించుకొనును" (9:24) అని ప్రభువు చెప్పారు. క్రీస్తు అనుకరణలో, మరణంనుండి తననుతాను కాపాడుకొన జూచిన, లోకముతో సర్దుబాటు కలిగి తన జీవితాన్ని కాపాడుకొన జూచిన, నిత్యజీవితాన్ని కోల్పోయేలా చేస్తుంది. కాని, దేవుని విషయాలపట్ల, తన జీవితాన్ని కోల్పోవడానికి సిద్ధపడినవారు నిత్యజీవమును పొందుదురు.ఈ తపస్కాలములో, మన సిలువలను ఎత్తుకొని, క్రీస్తును అనుసరించుదాం.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN