తపస్సుకాల- దీక్ష మనకు రక్ష

బొట్టి మనోహర్
17 Feb 2026
శ్రమలకాలంలో మనం ప్రార్ధన,ఉపవాసం, దానధర్మము అనే మూడు ఆధ్యాత్మిక మార్గాలను స్వీకరిస్తాము.దీక్ష అనగా ఈ మూడింటి ఆధ్యాత్మిక మార్గాల సమ్మేళనమే.దీక్ష పూనుకొని చాలా మంది విశ్వాసులు నలువది రోజులపాటు ఉనవాసం,ప్రార్ధన, దానధర్మాలను కఠోర దీక్షతో పాటిస్తారు.ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలకు,దేవాలయాలకు వెళ్లి ప్రార్ధనలు చేయడం.ఉపవాసం, దానధర్మాలు, అన్నదానాలు చేసి దేవుని అనుగ్రహాలను పొందుటకు నిష్ఠగా శ్రమిస్తారు.దీక్షని పూనుకోవలసిన విశ్వాసులు (పరిమిత వయస్సుగలవారు) విచారణ గురువును సంప్రదించి గురువు ఇచ్చే సందేశాన్ని, సూచనలను విని స్వీయనిర్ణయంతో దీక్షను స్వీకరిస్తారు.దీక్షావస్త్రాలను,జపమాలను ధరించి నిత్యం దైవనామ స్మరణచేస్తూ,ప్రతిరోజూ దివ్యబలిపూజ, సిలువమార్గం,జపమాల,ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.మెడలోని జపమాల దీక్షలో ఉన్నట్లు గుర్తుచేసి పాపపు పనులు చేయకుండా హెచ్చరిస్తుంది.దీక్ష స్వీకరించినవారు వ్యర్థప్రసంగాలకు,అసత్యాలకు, దొంగతనాలకు,దేవునికి అయిష్టమైన పసులను చేయకూడదు. (నిర్గమ 20:1-17).ఇలా నలభై రోజులు ఏకాగ్రతతో ప్రభువును మనస్సులో నిలుపుకొని దీక్ష పవిత్రంగా చేసి, దేవుని మన్ననను పొందాలి..దీక్ష అనంతరం కూడా ఉత్తమ మానవుడిగా,జీవిస్తేనే దీక్షా లక్ష్యం నెరవేరుతుందని, మన కతోలిక విశ్వాసంలో పునీతులందరు వారి జీవితకాలమంతా కఠోరదీక్షను పూనుకున్నవారే.
పునీత ఫ్రాన్సిస్ అస్సీసిగారు సకల ఐశ్వర్యాలు ఉన్ననూ అన్నిటిని త్యజించి ఆయన జీవితాన్ని పునీతం చేసుకున్నారు.పునీత ఫ్రాన్సిసుగారు రుచికరమైన భోజనం తినుటకు అర్హుడనుకానని ఒక్కోసారి భోజనంలో బూడిద కలుపుకొని భుజించేవారు.చలికాలంలో కూడా చన్నీటి స్నానం చేసేవాడు. కొన్నిసార్లు రాత్రిళ్లు ముళ్లపొదల్లో పడుకునేవారు. ఇలాంటి దీక్షాయుతమైన జీవితాన్ని చూసిన చాలా మంది అన్యులు సైతం దేవుని వైపు మరలారు.దీక్షను స్వీకరించే మనము కూడా ఈ లోక వ్యామోహాలను త్యజించి యేసు ప్రేమకై అనుక్షణం తపించాలి.శారీరక కోరికలను తృప్తిపరచుటకు యత్నించక ఆత్మయందు జీవించుటకు యత్నించు (గలతీ 5:16) మర్గమే దీక్షా మార్గం.
దీక్ష అనగా మరోమాటలో చెప్పాలంటే త్యజించడం అని చెప్పవచ్చు.వ్యక్తిగత ఆశలను, కోరికలను త్యజించటం,అదే విధంగా ఒకరినొకరు క్షమించుకొనుటకు దీక్ష ఒక సోపానం. క్షమించమనే మాట చెప్పడానికి చాలా ధైర్యము కావాలి.హృదయం చాలా విశాలంగా ఉండాలి. ఇతరులను నొప్పించకుండా ఉండడం మర్యాదస్తుల లక్షణం.స్నేహితులకు, బంధువులకు,ఇరుగుపొరుగు వారికి,తోటి ప్రయాణికులకు ఎవరికైనా సరే మన వలన జరిగిన తప్పులు,పొరపాట్ల వలన కష్టం, నష్టం, బాధ, అసౌకర్యం,ఇబ్బంది కలిగినప్పుడు,ధైర్యంగా చొరవ తీసుకొని మంచి మనస్సుతో క్షమించమని అడగాలి.క్షమించమని,అడగదమంటే మన్నింపు కోరినట్లే, మనస్సు తేలిక పడుతుంది. స్నేహాలు బంధాలు తెగిపోకుండా కలిసిమెలసి ఉండడానికి దీక్షా జీవితం ఒక సోపానం. ఇలా మంచిని పెంచుకుంటూ, బాధలను పంచుకుంటూ జీవిస్తే
మనస్సు నిర్మలంగా ఉంటుంది. అసూయ పూర్తిగా తొలగిపోతుంది.మనసంతా ప్రేమతోనూ, స్నేహభావంతోను నిండిపోయి జీవితం ఆనందమయమైపోయే కాలమే ఈ దీక్షాకాలం.
కావున ప్రియ స్నేహితులారా!
మనోనిగ్రహం కలిగి జీవిస్తూ, ఈ తవస్కాలం ఒక శ్రమల కాలంగా కాక మన క్రైస్తవ జీవితాల్లో ఒక వసంతకాలంగా మారాలని ప్రార్థించుదాం.
