విభూధి (బూడిద) (Holy Ashes)- బైబిల్ భావం

మహా ఘన. డా.సగినాల ప్రకాశ్

17 Feb 2026

పూర్వ నిబంధనలో గోనె పట్టలు ధరించి,బూడిదను చల్లుకోవడం అనేవి విలాపాన్ని,అపరాధ భావాన్ని సూచించే క్రియలు. ఒక వ్యక్తి తన హృదయ పరివర్తనను చూపించడానికి పట్టలు ధరించేవాడు,బూడిదను చల్లుకొనేవాడు.ఈ పట్టలు మేక చర్మాన్నికున్న వెంట్రుకలతో చేయబడి దృఢంగా గుచ్చుకుంటూ అసౌకర్యాన్ని కలిగించేవి.తాను చేసిన తప్పును,తానున్న పరితాపకర స్థితిని స్మరించుకుంటూ ఆ వ్యక్తి ఈ అసౌకర్యాన్ని మనస్పూర్తిగా ఎన్నుకొంటాడు.ఎవరైనా మరణించినప్పుడు వారి కోసం విలపిస్తూ కూడా ఈ పట్టలను ధరించేవారు.అబ్నేరు వధింపబడినప్పుడు యోవాబుకు అతని అనుచురులకు ఈ విధంగా చేయమని దావీదు సూచించాడు (2 సమూ 3:22-31).తన కుమారుడైన యోసేపు చనిపోయాడని తలంచి యాకోబు కూడా అదే పని చేశాడు (ఆది 37:34).వీటిని ధరించిన తరువాత,తలమీద, శరీరం మీద బూడిదను చల్లుకొంటారు.కొన్ని సార్లు బూడిదలో కూర్చొనేవారు.శిధిలావస్థను,మానవ పరిమితిని బూడిద సూచిస్తుంది.దేశ పరిస్థితులు ప్రమాదంలో పడినప్పుడు, ప్రజలు పశ్చాత్తాప పడుతూ దేవునికి మొరపెట్టుకోవడంలో ఇదొక గుర్తు (ఎస్తేరు 4:1).నినివే ప్రజలు గోనె పట్టలు ధరించి, బూడిదలో కూర్చున్నారని యోనా ప్రవక్త గ్రంధంలో వివరించబడి ఉంది. (యోనా 3:5-7).బూడిద మనిషిలోని అంతర్గత భావాలకు, పరివర్తన స్థితికి, పశ్చాత్తాపానికి బహిరంగ సాక్ష్యం.ఇది హృదయ పరివర్తనను సూచిస్తుంది. అయితే ఈ క్రియలలో సామ్యం కలిగి వుండాలి.బయట ఒకటి లోన ఇంకొకటి చేస్తే ప్రమాదమున్నది గనుక,జాగ్రత్తపడమని ప్రభువు సూచించాడు (యావేలు 2:13).క్రైస్తవ సంప్రదాయంలో బూడిదను విభూది బుధవారం నాడు శిరముల మీద ధరిస్తారు.అప్పటి నుండి నలుబది రోజులుగా తపోక్రియలతో తమ పశ్చాత్తాపాన్ని పై విధంగా తెలుపుతారు.ఈ విభూధిని అంతకు ముందు మట్టల ఆదివారంలో ఉపయోగించిన తాటిమట్టల నుండి గ్రహించడం జరుగుతుంది.క్రైస్తవ సంప్రదాయంలో విభూది బుధవారం నాడు బూడిదను శిరముల మీద ఉంచుకొని తపస్సుకాల ప్రారంభంలో,ఆ కాల విశిష్టతను చాటడం ఆనవాయితీ.ఇది మానవ శరీర పతనాన్ని (మరణం) మానవ జీవితకాల పరిమితిని గుర్తు చేస్తుంది.మట్టి నుండి పుట్టిన వారు తిరుగా మట్టిలో కలసిపోతారన్న తాత్విక భావం కూడా ఇందులో నిబిడీకృతమయి ఉంటుంది.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN