మారుమనసు మనిషికి మార్గం

జోసెఫ్ అవినాష్
16 Feb 2026
6వ సామాన్య మంగళవారం
యాకోబు 1:2-18
కీర్తన 94:12-15,17-19
మార్కు 8:14-21
ధ్యానం:
కొన్ని విషయములను, వాటి తీరు తెన్నులను తెలుసుకొనుటలో, పాటించుటలో మనకు ఎటువంటి ప్రత్యేకమైన శిక్షణ, తర్ఫీదు అవసరం లేదు. కానీ మరికొన్ని ప్రాముఖ్యమైన విషయములను ఎంత బోధించిననూ వాటిని సమగ్ర రూపములో అర్ధం చేసుకొనుటలో, పాటించుటలో వెనుకబడుతుంటాము, నోవా కావలములో అమాంతం పెరిగిపోయిన మానవ చెడు ప్రవర్తనను చూచి దేవుడు వారికి ఒక పదమును నేర్పదలిచెను. అదే ధోరణి యేసు నెరవేర్చిన పరిచర్య కాలములో సైతము పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకుల రూపములో మరో విధముగా తలెత్తినది. అటువంటి హృదయ కాఠిన్యతను తన శిష్యులు సైతను ప్రదర్శించెదరేమోనని గ్రహించి, యేసు వారిని గద్దించుట నేటి సువిశేషమునందు మనకు తెలియచేయ బడినది.
నేటి రోజులలో మారు మనస్సును పొందుటకు మనము విముఖత చూపుచూ హృదయ కాఠిన్యతను దరిచేరనిచ్చిన యెడల మన శిష్యరికపు ప్రమాణములు సందిగ్ధతను ఎదుర్కొనును. మారు మనస్సు పొందుటలో, అందుకు వలసిన సవాళ్ళను ఎదుర్కొనుటలో మనము వెనుకంజవేసినచో, జీవితములో వ్యతిరేఖ దృక్పథమును కలిగి ఉండినచో, మరి ముఖ్యముగా దేవుని స్వరమును ఆలకించనచో, బహుశా పరిసయ్యుల బాటలో పయనించిన వారమయ్యెదము. యేసు తన శిష్యులను అడిగిన ప్రశ్నలు మనము సైతము ఎదుర్కొను పరిస్థితులు ఎదురవుతాయి. అటువంటి సందర్భములలో మన సమాధానములు, స్పందనలు మారుమనస్సును కలిగి ఉండుటను ప్రస్ఫుటం చేయాలి. అటువంటి యేసు సుమధుర వాక్యమును ఆలకించి మన హృదయముల కాఠిన్యతను తగ్గించుకొనుటకు దినదినము ప్రయత్నము చేయుటకు మనము సంసిద్ధులుగా ఉన్నామా?
