నేటి పునీతురాలు : పునీత కేథరిన్ ది రిక్కీ

ఫాదర్ ఆకుల ప్రసాద్

12 Feb 2026

సుగుణం: “పంచగాయాల వరమూర్తి”

పునీత కేథరిన్ ది రిక్కీ గారి అసలు పేరు అలెగ్జాండ్రా రొమోల. వీరు ఇటలీలోని ఫ్లోరెన్సు నందు ఒక ఉన్నత కుటుంబంలో క్రీ.శ.1522 ఏప్రిల్ 23న జన్మించారు. భక్తిభావాలు కలిగిన వీరికి ఏకాంత ప్రార్ధన అంటే మక్కువ. తన 13వ ఏటనే కఠిన కట్టుబాట్లు కలిగిన డొమినికను సభలో చేరి 'కేథరిన్' అను పేరును స్వీకరించినది.

శిక్షణానంతరం అనేక బాధలను పొందిన వీరు, ఓపికతో దైవనిరీక్షణలో నెగ్గి తన పవిత్రతను చాటి కన్యాస్త్రీల శిక్షణా కేంద్రానికి అధినాయకురాలిగా నియమించబడ్డారు. క్రీ.శ.1560లో తన 38వ ఏట మఠశ్రేష్ఠురాలుగా నియమింపబడి 3 సం!రాలు ఆ పదవిలో తన ఆమూల్యసేవలు అందించారు.'క్రీస్తు శ్రమల ధ్యానం' పేరట కేథరిన్ గారు గురువారం మధ్యాహ్నం నుండి శుక్రవారం సాయంత్రం 4గం! ల వరకు ప్రతివారం ప్రార్థనలో లీనమై పరవశమైపోయేవారు. ఇలా 12సం!రాలు ప్రతివారం నిరాఘాటంగా కొనసాగించారు. ఆ ధ్యానంలో ఏసుప్రభువు యొక్క శ్రమల సన్నివేశాలను కండ్లకు కట్టినట్లు కేథరిన్ గారు అనుభవించడమే గాక క్రీస్తు పొందిన దెబ్బలను, పంచగాయాలను తన శరీరము మీద అచ్చుగుద్దినట్లు పొందుతూ వాటిని ఆమె ఓపికతో భరించేవారు. అందుకే కాథరిన్ గారిని 'పంచగాయాల తల్లి' అని పిలిచేవారు. కేథరిన్ గారు అద్భుతాలు చేయు గొప్పవరాన్నికూడా పొందియున్నారు.

మనం ఫోన్ లో మాట్లాడినట్లు, తన సమకాలికులైన ఇటలీలోవుండే పునీత ఫిలిప్పునేరి గారితోను, ఫ్లోరెన్సులోవుండే పునీత మేరి మగ్దలేను దే పజ్జిగారితోను కేథరిన్ గారుమనస్సుతో మాట్లాడేవారంట. క్రీ.శ.1590 ఫిబ్రవరి 2న కేథరిన్ గారు పరలోకప్రాప్తినొందారు. క్రీ.శ. 1746లో 14వ బెనెడిక్ట్ పోపుగారు కేథరిన్ గారిని పునీతులుగా ప్రకటించారు. కేథరిన్ అనగా నిర్మలమైన అని అర్థం.

పునీత కేథరిన్ ది రిక్కీ గారా మాకొరకు ప్రార్థించండి!

బంగారు మాట:
మనం మన హృదయాన్ని
ఇహలోక ప్రేమనుండి
భగవంతుని వైపుకు
మళ్లించి ఆయన
మంచితనాన్ని చూరగొనాలి.
పునీత కేథరిన్ దె రిక్కీ

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN