లోతైన జ్ఞానస్నాన ప్రయాణములను నిండుగా జీవించుచున్నామా?

జోసెఫ్ అవినాష్
12 Feb 2026
సామాన్య 5వ శుక్రవారం
1 రాజులు 11:29-32; 12:19
కీర్తన 81:10-11,12-13,14-15
మార్కు 7:31-37
సాతాను మాయకు మోసపోయిన ఆది తల్లిదండ్రులకు అంటుకొన్న పాపముకు కారణము అవిధేయత.దేవుని ఆజ్ఞను ధిక్కరించి తద్వారా ఏదేను వనము నుండి పంపివేయబడుట ద్వారా సకల మానవాళికి పాపమును సంక్రమింపచేసిరి. దేవుని మాటను పెడచెవిన పెట్టి, సాతాను జిత్తుల మాయకు బలైపోయిరి.వారితో మొదలైన పాపకళంకము చివరకు క్రీస్తు అత్యున్నత విధేయత ద్వారా మరల దేవునితో సఖ్యత పొందు భాగ్యమును పొందగలిగాము.ప్రజలను పట్టి పీడించిన పాపము యొక్క అంధకారము నుండి యేసు విడుదలగావిస్తూ,సమగ్ర స్వస్థతను తన సిలువ మరణము ద్వారా ప్రసాదించారు.
నేటి సువిశేషమునందు యేసు చెవిటి వానిని స్వస్థపరుస్తూ, మూసివేయబడిన చెవి రంధ్రములను కట్టివేయబడిన నాలుకను తిరిగి పూర్తి విధమున పనిచేయుటకు కావలసిన ఆమోద యోగ్యతను దయచేసారు.దేవుని స్వరమును ఆలకించలేక మూసుకుపోయిన చెవులను, తన వాక్కు ద్వారా తెరచి,దేవుని నామమును ప్రస్తుతించుటకు ఆ చెవిటి వాని నాలుకను సైతం స్వస్థపరచారు. తద్వారా,ఆ వ్యక్తి హృదయములోనికి దేవుని వాక్కు పయనించుటకు కావలసిన ప్రక్రియను పూర్తి చేసారు.ఇటువంటి అద్భుతమైన కార్యమును సల్పిన యేసు మనకు దేవుని వాక్కు యొక్క బలమును ఆ వాక్కును ఆలకించి స్వీకరించుటకు మనము చూపు సిద్ధపాటును తెలియచేసారు. జ్ఞానస్నానమును స్వీకరించిన సమయములలో గురువు మన చెవులను,పెదవులను తాకి, వాటిపై సిలువ గురుతు వేసి, తద్వారా మనము కూడా అనుదినము దైవవాక్కును ఆలకించి,ప్రకటించి,జీవించాలని ఆహ్వానించును.మరి అటువంటి లోతైన జ్ఞానస్నాన ప్రయాణములను నిండుగా జీవించుచున్నామా?
