అనారోగ్యం శాపం కాదు- పోప్
జోసెఫ్ అవినాష్
12 Feb 2026
ఫిబ్రవరి 11న ప్రపంచ వ్యాధిగ్రస్తుల దినోత్సవం సందర్భంగా పోప్ లియో XIV గారు వాటికన్ ఉద్యానవనాలలోని లూర్దు గుహ వద్ద ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం లూర్దుమాత పండుగ దినాన శ్రీసభ వ్యాధిగ్రస్తుల దినోత్సవాన్ని జరుపుకుంటూ, అనారోగ్యంతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేక విధంగా ప్రార్థిస్తుంది.అనారోగ్యంతో బాధపడుతున్న భక్తులతో కలిసి ప్రార్థించిన పోప్,బాధ అనేది శాపం కాదని,అది దేవుని ప్రేమను లోతుగా అనుభవించే మార్గమని చెప్పారు. “మరియమాత తన జీవితంతోనే బాధను ఎలా స్వీకరించాలో,దాన్ని దేవునికి ఎలా అప్పగించాలో మనకు నేర్పుతుంది” అని ఆయన అన్నారు.
మన జీవితంలో ఎదురయ్యే కష్టాలు మనలను దేవునికి మరింత చేరువ చేస్తాయని, ఆ బాధలోనే ఆశ కూడా దాగి ఉంటుందని ఆయన వివరించారు.బాధపడుతున్నవారిని చూసుకోవడం ఒక సేవ మాత్రమే కాదు,అది నిజమైన క్రైస్తవ సాక్ష్యమని గుర్తుచేశారు.ఈ సందర్భంగా వైద్యులు,నర్సులు, సేవకులు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అనారోగ్యంతో ఉన్నవారందరికీ అపొస్తలిక ఆశీర్వాదం అందించారు.
