లూర్దుమాత పండుగ సందర్భంగా

జోసెఫ్ అవినాష్
10 Feb 2026
మరియమాత ఇచ్చిన దర్శనాలుగా శ్రీసభ ఆమోదం పొందిన 12 ప్రాముఖ్యమైన దర్శనాలలో ప్రతిష్టాత్మకమైన దర్శనం లూర్దుమాత దర్శనం.లూర్దుమాత ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 11న జరుపుకుంటాము. ఫ్రాన్స్ దేశంలోని లూర్ధు నగరంలో ఒక గుహ వద్ద 1856వ సంవత్సరంలో మరియమాత పునీత బెర్నదత్ అను ముద్దులొలికే 14 ఏళ్ల బాలికకు ఆరు నెలల కాలంలో 18 సార్లు దర్శనమై తాను "అమలోద్భవిమాతను" అని లోకానికి ప్రకటించుకొని ఆ ప్రదేశంలో ఆ బాలిక ద్వారా ఎన్నో సందేశాలను అందించి, ఎందరుకో ఎన్నో గొప్ప అద్భుతాలు, స్వస్థతలను చేకూర్చారు మరియమాత.
*లూర్ధుమాత దర్శనం-:*
ఫ్రాన్సు దేశపు దక్షణ భాగంలో చక్కటి ప్రకృతి నడుమ ప్రశాంత వాతావరణం కలిగిన ఒక చిన్న గ్రామం ఉంది ఆ గ్రామం పేరు "లూర్ధుస్" 1844 వ సంవత్సరంలో ఆ గ్రామంలో బెర్నదత్ సౌబీరస్" అనే బాలిక జన్మించింది. ఈమె కుటుంబ స్థితి గతులను మనం గమనిస్తే చాలా పేద కుటుంబం. అధిక సంతానం కలిగిన కుటుంబం.
బెర్నదత్ గారికి చిన్నతనం నుండి ఆస్తమా వ్యాధి తీవ్రంగా బాధించటం వలన పాఠశాలకు వెళ్లలేదు. కానీ ఆమె కతోలిక సత్యాలను మాత్రం క్షుణ్ణంగా నేర్చుకున్న బాలిక.బెర్నదత్ గారు ఒకవైపు ఇంటి పని చేసుకుంటూనే, మరోవైపు కుటుంబ పోషణకై ఇతరుల ఇళ్లల్లో సైతం కష్టపడి పనిచేసేవారు. ఫిబ్రవరి మాసం అంటే మనందరికీ తెలుసు చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది, తెల్లటి మంచు కురుస్తూ ఉంటుంది.
ఫిబ్రవరి 11 1858వ సంవత్సరంలో బెర్నదత్ గారు తన చెల్లితో, తోటి స్నేహితులతో కలిసి వంట చేసుకోవడానికి పుల్లలు ఎరుకోవటానికి వాళ్ల గ్రామానికి సమీపంలో ఉన్న ఒక అడవికి వెళ్ళింది. తనతో వచ్చిన స్నేహితులు వాళ్ల పనులలో నిమగ్నమై ఉండగా.బెర్నదత్ గారు ఉన్న చోట దాపులో ఒక గృహ లోపల అకస్మాత్తుగా మిరుమిట్లు గొలిపే కాంతిని వెదజల్లుతూ. బంగారపు పూత పూసినట్లుగా తెల్లని వస్త్రధారణతో నడుముకు నీలి వర్ణపు దట్టీని, చేతిలో జపమాలను కలిగి, కాళ్ళ దగ్గర పసుపు రంగు గులాబీలతో కాంతివంతమైన రూపముతో ఒక స్త్రీ ఆ బాలికకు దర్శనమిచ్చింది. ఎంతకు ఆ స్త్రీ ఎవరు అంటే లూర్ధుమాతగా వచ్చిన మరియతల్లి. అది మొదలుకొని, అదే సంవత్సరం జూలై 16 వరకు ఆ తల్లి 18 సార్లు ఆ బాలికకు దర్శనమిచ్చింది. కానీ చివరి దర్శనంలో మాత్రం నేను ఎవరిని అనే విషయాన్ని మరియతల్లి ఆ బాలికకు చెప్పి ఉన్నారు.
"నేను క్రీస్తు తల్లి మరియమాతను,ఎటువంటి జన్మపాపము సోకకుండా జన్మించిన స్త్రీ మూర్తినని, ప్రతి ఒక్కరు కూడా క్రీస్తుని తెలుసుకుని, అనుదినం జపమాల ధ్యానం చేస్తూ, క్రీస్తు బాటలో అడుగులు వేయాలని అదేవిధంగా ఇక్కడ ఒక పుణ్యక్షేత్రం నిర్మించాలని ఆ బాలికకు మరియతల్లి సందేశాన్ని అందించారు".
బెర్నదత్ గారు ఈ విషయాలన్నీ గురువులకు, మానసిక వైద్యులకు, తన చుట్టుపక్కల కతోలిక విశ్వాసులతో పంచుకున్నారు. ఆ గ్రామానికి చెందిన కతోలిక విశ్వాసులు బెర్నదత్ గారితో ఆ గృహ చెంతకు వెళ్లి జపమాల ప్రార్థనను భక్తి ,విశ్వాసాలతో చేసేవారు. ఒకనాడు ఒక గొప్ప సంఘటన చోటుచేసుకుంది అది ఏమనగా బెర్నదత్ గారు నేలనుండి మట్టిని తీస్తున్నప్పుడు ఆ గుంట నుండి నీరు బయటికి వచ్చింది. ఆ నీటిని తాకిన ప్రతి ఒక్కరూ ఇప్పటికీ ఎన్నో స్వస్థతలు పొందుతున్నట్లు శ్రీసభ చరిత్ర తెలియజేస్తున్నది.
*మరియతల్లి ప్రతి దర్శనం మనల్ని ప్రభువు వైపు నడిపించుట కొరకే’’.-:*
శ్రీసభ చరిత్రలో మరియతల్లి దర్శనాలు ఎన్నో నమోదయ్యాయి. ఈ దర్శనాలన్నింటిలో కూడా మరియ తల్లి యావత్ ప్రపంచాన్ని పశ్చాత్తాపం పొంది క్రీస్తు బాటలో నడవమని అజ్ఞాపించడం ప్రథమంగా నిలిచింది. ఆమె దర్శనమిచ్చిన ప్రతిచోట జపమాల యొక్క ప్రాముఖ్యతను గురించి తెలియజేసి, అందరూ తమ యొక్క పాపములకు ప్రాయశ్చిత్తం చేసుకొని క్రీస్తు బాటలో నడవాలని ఆమె ఆజ్ఞాపించారు.జపమాల అనే భక్తి సాధనం ద్వారా ప్రతి ఒక్కరు ప్రభువును చేరుకోవాలని ఆమె తన యొక్క దర్శనాలలో కోరారు. ఎవ్వరు నశించి పోకూడదు. ప్రతి ఒక్కరు క్రీస్తును చేరుకోవాలి. హృదయ శుద్ధి కలిగి జీవించాలి అనేది ఆమె దర్శనాల యొక్క పరమార్థం.
