గుణదల మహోత్సవాలు సందర్భంగా

జోసెఫ్ అవినాష్

09 Feb 2026

మరియమాత ప్రత్యక్షమైన స్థలాల పేరుపై,అగుపడిన రూపంపై జరిగిన అద్భుత సంఘటనలపై ఆధారపడి ప్రపంచంలో పలుచోట్ల ఎన్నో పుణ్యక్షేత్రాలు వెలిశాయి. భారతదేశంలో వెలసిన మరియమాత పుణ్యక్షేత్రాలలో గుణదల పుణ్యక్షేత్రం ఒక ప్రత్యేక గుర్తింపును సంతరించుకుంది. దక్షిణ భారతదేశంలోని కతోలిక పుణ్యక్షేత్రాల్లో రెండవ అతిపెద్ద పుణ్యక్షేత్రంగా గుణదల పుణ్యక్షేత్రం చరిత్రలో నిలిచింది.కుల ,మతాలకు అతీతంగా ఎంతోమంది విశ్వాసులు గుణదల మాత పుణ్యక్షేత్రాన్ని సందర్శించి ఎన్నో అద్భుత మేలులు పొందుకుంటున్నారు. లూర్దు నగరంలో మరియమాత పునీత బెర్నదతమ్మ గారికి ఒక కొండ గుహలో దర్శనమివ్వగా ఆ గుహ ఒక గొప్ప ప్రార్థనా స్థలంగా , క్రీస్తుకు మార్గంగా ప్రసిద్ధి చెందింది. ఆ కోవలోనే లూర్దుమాత గృహను పోలినట్టుగా లూర్దుమాత స్వరూపంతో గుణదల లో కూడా సహజమైన గుహలో మరియమాత స్వరూపం ఉన్నందున ఈ పుణ్యక్షేత్రం ప్రసిద్ధమైంది.గుణదల మరియమాత మహోత్సవాలను ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలో ఘనముగా కొనియాడుతారు. ఈ పుణ్యక్షేత్రము గురించి తెలుసుకుందాం.

పుణ్యక్షేత్ర చరిత్ర:
గుణదల మాత చరిత్ర 1923వ సంవత్సరము నాటిది! మోన్సిగ్నోర్ H. పెజ్జోని గారు గుణదలలో 1923లో 23 ఎకరాల స్థలాన్ని పొందారు. దానిలో కొంత స్థలం కొనగా, కొంత స్థలం విరాళముగా ఇవ్వబడినది. అచ్చట మొదటిగా ఒక అనాధాశ్రమాన్ని స్థాపించారు. తరువాత ఒక స్కూలును ప్రారంభిచారు. ఇది అప్పటి బెజవాడ విచారణకు జోడించబడినది. అప్పట్లో గుణదల ప్రదేశమంత, ముళ్ళపొదలతో నిండి యుండెడిది. ఎవరూ ఆ ప్రాంతానికి వచ్చేవారు కాదు. ఎవరినీ ఆహ్వానించడానికి కూడా వీలుగా ఉండెడిది కాదు. ప్రాంతమంత పాములతో నిండి ఉండెడిది. ప్రక్కనేనున్న కొండపై చిరుత పులులు సంచరిస్తూ ఉండేవి. గుణదల సంస్థల మొట్టమొదటి మేనేజరుగా రెవ. ఫాదర్ P. అర్లాటి గారు 1924లో నియమించ బడినారు. బాధ్యతలు చేపట్టిన రోజునుండే ఎన్నో కష్టాలను, ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కొన్నారు. యాభైమంది పనివాళ్ళతో అడివినంతా శుభ్రం చేయించారు. పూర్తవడానికి కొన్ని నెలల సమయం పట్టింది. మంచి నీటి కోసం ఒక బావిని అక్కడ త్రవ్వించారు. సెయింట్ జోసఫ్ అనాధాశ్రమం 15 జూన్ 1924లో ప్రారంభించడం జరిగింది. అదే సంవత్సరములో అచ్చట పారిశ్రామిక పాఠశాలను ప్రారంభించారు. మోన్సిగ్నోర్ విస్మారా గారు కొంతమంది బాలురను అక్కడికి తీసుకొని రావడం జరిగింది.

సంస్థలకు మరియమాత యొక్క ఆశీర్వాదాలు, సంరక్షణ పొందేందుకు రెవ. ఫాదర్. P. ఆర్లాటి గారు 1924లో కొండపైన సహజ సిద్ధమైన ప్రదేశములో మరియమాత స్వరూపాన్ని నెలకొల్పారు. ఇదే గుణదల మరియమాత భక్తికి నాంది పలికింది. 1927లో రెవ. ఫాదర్ P. అర్లాటి గారు ప్రహరీ గోడను నిర్మించారు. 1928లో వారు భోజనశాలను, 1931లో దేవాలయమును నిర్మించారు. మోన్సిగ్నోర్ విస్మారా గారు వీటిని ఆశీర్వదించారు. పాఠశాలలో పిల్లల అడ్మిషన్లు పెరగడముతో, రెవ. ఫాదర్ P. అర్లాటి గారు మరో భవనానికి పునాదులు వేసారు. 1933లో గుణదల సంస్థల ప్రధమ శతాబ్ది పూర్తిచేసుకున్న సందర్భముగా, రెవ. ఫాదర్ P. అర్లాటి గారు గుణదల కొండ అంచుపై 18 అడుగుల ఎత్తైన ఇనుప సిలువను ఏర్పాటు చేసారు. సిలువ యొద్దకు మరియమాత గుహనుండి వెళ్ళాల్సి ఉంటుంది. కనుక TO JESUS THROUGH MARY (మరియమాత ద్వారా యేసు చెంతకు) అన్న సత్యాన్ని చక్కగా మనకు స్పురిస్తుంది. ఇది మన విజయవాడ కతోలిక పీఠానికి గర్వకారణమైనది.

1937 నాటికి గుణదల పండుగ మేత్రాసణ పండుగగా ప్రసిద్ధి గాంచినది. 1937లో, రెవ. ఫాదర్ P. అర్లాటి గారు, ప్రస్తుతం మనం గుణదల కొండపై చూస్తున్న, మరియమాత స్వరూపాన్ని ఇటలీ దేశమునుండి తీసుకొని వచ్చి నెలకొల్పడం జరిగింది. ఈ స్వరూపాన్ని మోన్సిగ్నోర్ అంబ్రోస్ ది బత్తిస్త గారు సమర్పించారు.స్వరూపాన్ని ఊరేగింపుగా తీసుకెళ్ళి గుహలో ప్రతిష్టించడం జరిగింది. ఆరంభములో ఈ పండుగను 8 సెప్టెంబరు మాసములో జరిపేవారు. సెప్టెంబరులో కురిసే వర్షాలు యాత్రికులకు అసౌకర్యాన్ని కలిగిస్తుండగా, ఈ పండుగను 11 ఫిభ్రవరి లూర్దుమాత పండుగగా మార్పు చేయడం జరిగింది.

1944-1946 మధ్య కాలములో, గుణదల కొండ రాయిని పేల్చి, గుహను చెక్కడం జరిగింది. అక్కడ ఒక బలి పీఠమును కూడా నిర్మించడం జరిగింది. అప్పటినుండి, ప్రతీ సంవత్సరం లూర్దుమాత పండుగను స్థానిక కతోలిక క్రైస్తవులతో కలిసి కొనియాడటం జరిగింది. కొండపైన మరియమాత గుహ వరకు ప్రదక్షిణగా వెళ్లి, అక్కడ దివ్యపూజా బలిని సమర్పిస్తారు.

గుహకు వెళ్ళు మార్గములో పదిహేను జపమాల రహస్యాలను చిత్రపటాలతో అందముగా ఏర్పాటు చేయబడ్డాయి. 1951లో యాత్రికులు మరియ మాత స్వరూపమును దగ్గరకు వెళ్ళుటకు, తాకి ముద్దిడుటకు, కానుకలు చెల్లించుటకు మెట్లమార్గమును ఏర్పాటు చేయబడినది. అలాగే, గుహపైన అందమైన తోరణం నిర్మించడ మైనది. 1971లో దేవాలయం నిర్మించడ మైనది.

విజయవాడ మేత్రాసణ మూడవ మేత్రాణుల కాలములో, గుణదల పుణ్యక్షేత్రములో అనేక వసతులు ఏర్పాటు చేయబడ్డాయి. బిషప్ గ్రాసి స్కూల్ ఆవరణలో, పూజ, సాంస్కృతిక కార్యక్రమాల కొరకు వేదిక నిర్మించడమైనది. యాత్రికుల బస కొరకై షెడ్’లు, విశ్రాంతి గదులు ఏర్పాటు చేయబడ్డాయి. కొండపైన విద్యుత్, మంచినీరు వసతులు కల్పించ బడ్డాయి. కొండపైకి సులువుగా చేరుకోవడానికి మరిన్ని మార్గాలు ఏర్పాటు చేయబడినవి. మరియమాత గుహనుండి సిలువ వరకు సిలువ మార్గము ప్రతిమలతో ఏర్పాటు చేయబడినది.

మరియమాత దర్శనం
11 ఫిబ్రవరి 1858లో మరియమాత గుణదల కొండపై దర్శన మిచ్చినట్లుగా ఒక విశ్వాసం. క్రైస్తవ చరిత్రలో, దైవకుమారుడు యేసుతల్లి అనేకచోట్ల అనేకమందికి దర్శనాలను ఇచ్చినట్లు మనకు తెలిసినదే! ఆమె దర్శనాలలో, తన దివ్యకుమారుడైన యేసుక్రీస్తును విశ్వసించమని కోరుతూ ఉన్నది. పాప జీవితానికి స్వస్థిచెప్పి, పుణ్య జీవితాన్ని జీవించమనేదే ఆమె సందేశం.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN