మనము దేవునియందు నిజమైన స్వతంత్రతను పొందగలము

జోసెఫ్ అవినాష్
09 Feb 2026
సామాన్య 5వ మంగళవారం
1రాజులు 8:22-23,27-30
కీర్తన 84:3,4,5,10,11
మార్కు 7:1-13
ధ్యానం:
పరిస్యయులు, ధర్మశాస్తబోధనలు దేవుని చిత్తమును నెరవేర్చుటకు, ఆజ్ఞలను శిరసావహించుటకు ఎంతో తాపత్రయపడిరి.మోషే చట్టాను సారము పేర్కొనబడిన 613 నియమములను పాటిస్తూ, ఆచారములను,సాంప్రదాయములను వాటితో ముడిపెట్టి జీవించి, తద్వారా ఆధ్యాత్మిక జీవితమును మెరుగుపరచుకొనలేకపోయిరి. కేవలము బాహాటముగా పేర్కొనబడిన తంతులను పూర్తిచేస్తూ,అత్యంత శ్రేష్టమైన దేవుని ఉనికిని గ్రహించలేకపోయిరి.దురదుష్టవశాత్తు, ఆచారములు,సాంప్రదాయముల ముసుగులో చిక్కుకొని మనము నిర్వర్తించవలసిన బాధ్యతలను త్రికరణశుద్ధిగా నెరవేర్చుటలో బహుశా సవాళ్ళను ఎదుర్కొనుట పరిపాటి.వివిధ సంస్కృతులలో పలు సంప్రదాయములు నెలకొన్ననూ,దేవుని చిత్తమును నెరవేర్చుటలో అవి తోడ్పడనిచో, అటువంటి పద్ధతులను బేరీజు వేసుకొని,తగిన రీతిలో పరీక్షించాలి.మన పద్ధతులు, సాంప్రదాయములు మారును, కానీ దేవుడు, మన జీవితములలో నెరవేరు దేవుని చిత్తము ఎల్లవేళలా నిలచి ఉండును. మనము వ్యక్తపరచు మత సంబంధ భక్తి భావములు,మానవ సంబంధములను మెరుగు పరుస్తూ,తద్వారా దేవునితో సఖ్యతను పొందుటకు దోహదం చేయాలి.
మనము అర్పించు వస్తూ రూప కానుకలు మన సాంప్రదాయములను సూచించిననూ, దేవునికి ప్రీతికరమైన మన హృదయ శుద్ధిని కలిగి ఉండాలి.ఇటువంటి ఆమోద యోగ్యమైన క్రియలను సల్పినచో మనము పాటించు పద్ధతులకు పవిత్రత చేకూరును. సోదర ప్రేమను, దైవ ప్రేమను మిళితం చేస్తూ, సాంప్రదాయ పద్ధతులను, ఆచార వ్యవహారములను సరైన గాడిలో పెట్టినచో, నిండైన ఆధ్యాత్మిక ఫలితములను పొందవచ్చు. దేవుని ఆజ్ఞలను సరళమైన దృష్టితో చూస్తూ, మనకు విడుదలను ప్రసాదించు రీతిలో చూచినచో, మనము దేవునియందు నిజమైన స్వతంత్రతను పొందగలము, జీవించగలము.
