నేటి పునీతుడు:పునీత మిగుయేలు ఫెబ్రెస్ కార్డేరో

ఫాదర్ ఆకుల ప్రసాద్
08 Feb 2026
సుగుణం: "అంకితత్వ క్రైస్తవ సాహిత్య సేవకుడు”
మిగుయేలు గారు ఈక్వెడారులోని క్యూయెన్సా నందు క్రీ.శ.1854 నవంబరు 7న ఓ ఉన్నత రాజకీయ కుటుంబంలో జన్మించారు. వీరి జ్ఞానస్నానం పేరు ఫ్రాన్సిస్కో. పుట్టుకతోనే కొద్దిగా పాదాల అవిటితనం ఉండుటవలన నడవడానికి ఎంతో బాధపడేవారు. అయిననూ దేవుని చిత్తంగా భావించి ఉత్సాహంతో తనపనులు చేసుకొనేవారు. ఐదేళ్ల ప్రాయంలో మిగుయేలు గారు మరియతల్లి దర్శనాన్ని పొందారు. అపార మేదావి అయిన వీరు తన 17వ ఏటనే స్పానిష్ వ్యాకరణ పుస్తకాన్ని ప్రచురించారు. క్రైస్తవ బ్రదర్ల సభలో ప్రవేశించి ఈక్వెడార్ నందు 32 సం!రాలు బోధకునిగా పనిచేశారు. వీరు అనేక నూతనమైన సులభతరమైన పద్దతులలో పిల్లలకు బోధించేవారు. బ్రదర్ మిగుయేల్ గారి సాహిత్యరచనలు పాఠ్యపుస్తకాల రూపంలో దక్షిణ అమెరికా, యూరప్ అంతటా విద్యాశాలల్లో ఉపయోగించబడ్డాయి. వీరు సత్యోపదేశ రూపంలో చక్కటి క్రైస్తవజ్ఞానాన్ని, దైవభక్తిని పిల్లలకు నేర్పేవారు. 1907లో మిగుయేల్ గారు కొన్ని పుస్తకాలు తర్జుమా చేయునిమిత్తం తమ సభవారిచే బెల్జియంకు పిలువబడ్డారు. ఆక్కడినుండి క్రైస్తవ బ్రదర్లకు శిక్షణనిచ్చునిమిత్తం స్పెయిన్ కు వెళ్లారు. 1909లో స్పానిష్ విప్లవం సమయంలో తను ఉండే నోవిషేట్ దాడికి గురవ్వగా, మిగుయేల్ గారు దివ్యసత్ప్రసాదానికి అవమానం జరగకుండా దానిని కాపాడు నిమిత్తం చేతులలో దాచుకొని నోవిసులను వెంటతీసుకొని 8 మైళ్ళు తన కాళ్ళు సహకరించకపోయిననూ అతి అతికష్టంతో కాలినడకన బర్సెలోనాకు వెళ్లారు. క్రీ.శ.1910లో ఫిబ్రవరి 9న న్యుమోనియా వ్యాధిచే మరణించారు. 1984 అక్టోబర్
21న 2వ జాన్ పాల్ పోపుగారు వీరిని పునీతులుగా ప్రకటించారు.
పునీత మిగుయేలు ఫెబ్రెస్ కార్డేరో గారా మాకొరకు ప్రార్థించండి!
బంగారు మాట:
నేను వ్రాసే ప్రతి పదం,
చదివే ప్రతి వాక్యం,
నా బల్లవద్ద, పాఠశాలలో
నేను చేసే ప్రతి పనీ
దేవుని మహిమ
కోసమే చేస్తున్నాను.
పునీత మిగుయేలు ఫెబ్రెస్ కార్డేరో
