CBCI అధ్యక్షుడిగా కార్డినల్ పూల.అంతోని గారు ఎన్నిక

జోసెఫ్ అవినాష్
07 Feb 2026
హైదరాబాద్ అగ్ర పీఠాధిపతులు కార్డినల్ మహా ఘన. శ్రీ శ్రీ శ్రీ పూల అంతోని తండ్రిగారు అఖిల భారత కతోలిక పీఠాధిపతుల సమాఖ్య (CBCI) నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.బెంగళూరులో ఇటీవల జరిగిన సమాఖ్య సర్వసభ్య సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇంతవరకు ఈ బాధ్యతలను నిర్వర్తించిన అగ్ర పీఠాధిపతి మహా ఘన శ్రీ ఆండ్రూస్ థాజత్ గారి పదవీకాలం పూర్తికావడంతో,అఖిల భారత కతోలిక పీఠాధిపతుల ఏకగ్రీవ సమ్మతితో కార్డినల్ పూల అంతోని తండ్రిగారిని కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.థాజత్ గారు తన పదవీకాలంలో శ్రీసభలో ఐక్యతను బలోపేతం చేయడం,రాజ్యాంగ విలువల పరిరక్షణ వంటి అంశాలపై విశేషంగా కృషి చేశారు.కార్డినల్ పూల అంతోని గారు పేదలు,అణగారిన వర్గాల పట్ల చూపిన సేవాభావంతో దేశవ్యాప్తంగా విశేషమైన గౌరవాన్ని సంపాదించారు.ఆయన నాయకత్వం భారత కతోలిక శ్రీసభకు కొత్త ఉత్సాహం,ధైర్యం అందిస్తుందని అఖిల భారత కతోలిక పీఠాధిపతులు ఆశాభావం వ్యక్తం చేశారు.అఖిల భారత కతోలిక పీఠాధిపతుల సమాఖ్య అధ్యక్షుడిగా కార్డినల్ పూల అంతోని గారు రాబోయే రోజుల్లో శ్రీసభ ఆధ్యాత్మిక,సామాజిక బాధ్యతలను మరింత బలంగా ముందుకు తీసుకెళ్లనున్నారు. సమాజంలో న్యాయం, శాంతి, ఐక్యత కోసం శ్రీసభ స్వరం మరింత స్పష్టంగా వినిపించాలనే లక్ష్యంతో ఆయన సేవలు కొనసాగించనున్నారు.
