దేవుని వాక్కు మన జీవితానికి బలం - పోప్
జోసెఫ్ అవినాష్
05 Feb 2026
బుధవారం,జనరల్ ఆడియన్స్ సందర్భంగా పోప్ లియో XIV, రెండో వాటికన్ మహాసభ బోధన గ్రంథమైన డెయ్ వెర్బమ్ పై తన బోధనను కొనసాగించారు.దేవుని వాక్యం పరలోక భాషలో కాకుండా,మనుష్యుల మాటల ద్వారానే మనకు అందిందని ఆయన స్పష్టం చేశారు.బైబిల్ గ్రంథం దేవుని ప్రేరణతో రచించబడినప్పటికీ,అవి అప్పటి కాలం,సంస్కృతి,పరిస్థితులకు అనుగుణంగా మానవ రచయితల చేత వ్రాయబడ్డదని పోప్ తెలిపారు.అందువల్ల పవిత్ర గ్రంథాన్ని అర్థం చేసుకోవాలంటే దాని చారిత్రక నేపథ్యం,రచనా శైలిని గౌరవించాల్సిన అవసరం ఉందని అన్నారు.ఈ అంశాలను విస్మరిస్తే బైబిల్‌ను తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు.దేవుని వాక్యం విశ్వాసుల జీవితానికి బలం, ప్రేమకు ప్రేరణ అని,అది కేవలం సామాజిక సందేశం మాత్రమే కాదని పోప్ పేర్కొన్నారు.నేటి మనిషి జీవన పరిస్థితులకు అర్థమయ్యే భాషలో దేవుని వాక్యాన్ని ప్రకటించాల్సిన బాధ్యత కతోలిక శ్రీసభకు ఉందని ఆయన పిలుపునిచ్చారు.
