నేటి పునీతురాలు : పునీత అగతమ్మ

ఫాదర్ ఆకుల ప్రసాద్
04 Feb 2026
సుగుణం: "పరిశుద్ధ అంకితత్వం”
సిసిలీ దేశంలోని కతానియా నందు క్రీ.శ.231లో ఓ సంపన్న కుటుంబంలో అగతమ్మగారు జన్మించారు. చిన్ననాటినుండే దేవునిపై దృఢ విశ్వాసం, ప్రేమకలిగిన వీరు తనను తాను దేవునికి సమర్పించుకొన్నారు. క్రైస్తవ విద్వేషియైన 'డేషియస్" చక్రవర్తి సలహాదారుల్లో 'క్వింటేయిసు' ఒకడు. ఇతడు అసమాన తెలివితేటలు కలిగి చక్రవర్తి మన్ననలు పొందాడు. సౌందర్యవతియైన అగతమ్మను ఎలాగైనా వివాహమాడాలనుకొని, తనమనసులోని మాటను ఆమెకు చెప్పాడు. కానీ అగతమ్మ గారు తాను కన్యమరియతల్లిని ఆదర్శంగా తీసుకొని పవిత్రకన్యకగా క్రీస్తుకు తనను తాను సమర్పించుకొన్నానని చెప్పింది. ఆమె సమాధానాన్ని అవమానంగా భావించి ఆమెను అనేకవిధాలుగా ప్రలోభపెట్టాడు. కానీ ఆగతమ్మగారు వాటినన్నిటిని తిరస్కరించుటచే, ఆమెపై చక్రవర్తికి పిర్యాదుచేసి, ఆగతమ్మగారిని అనేక హింసలకు గురిచేశాడు. ఆమెను ఇనుపగోళ్ళతో రక్కించి, ఆమె రొమ్ముభాగాలను అతిహీనంగా గాయపరచాడు. మనసు మార్చుకొనుటకు ఆమెకు చివరి అవకాశంగా ఒక మురికి కూపంలాంటి గదిలో ఆమెను ఉంచి అన్నపానీయాలు అందివ్వకుండా చేశాడు. ఆ సమయంలో పునీత పేతురుగారు ఆమెకు దర్శనమై ఆమెను ఓదార్చి, స్వస్థతను అనుగ్రహించారు. ఆరోగ్యంగా వున్న అగతమ్మను చూసిన 'క్వింటేయిసు' మరింత అక్కసుతో ఆమెను వివస్త్రను చేసి కాలుతున్ననిప్పుల్లో వేశాడు. దేవుణ్ణి స్తుతిస్తూ అగతమ్మగారు క్రీ.శ.251 ఫిబ్రవరి 5న మరణించారు. క్రైస్తవులంతా ఆమె భౌతికదేహాన్ని స్వాధీనంచేసుకొని భూస్థాపితం చేశారు. సిసిలీలోని ఎత్నా అగ్నిపర్వతం బ్రద్దలైనప్పుడల్లా ప్రజలు అగతమ్మగారిని ప్రార్థించుటచే అది శాంతించేది. శ్రీసభ, అగతమ్మగారి పేరును పూజాదికాల్లో ఉచ్చరిస్తూ ఆమె పవిత్రతను కొనియాడుచున్నది.
పునీత అగతమ్మ గారా మాకొరకు ప్రార్ధించండి!
బంగారు మాట:
ఓ యేసుక్రీస్తు ప్రభువా!
నన్ను సంపూర్ణంగా మీకు
వశముచేయుచున్నాను.నేను
మీ యొక్క గొర్రెపిల్లను,
సైతానును జయించు
శక్తిని నాకు అనుగ్రహించండి.
(పునీత అగతమ్మ)
