నేటి పునీతుడు: పునీత బ్లెయిజ్

ఫాదర్ ఆకుల ప్రసాద్
02 Feb 2026
సుగుణం: "ఆత్మల వైద్యుడు"
పీఠాధిపతి,వైద్యుడు, గొంతు వ్యాధిగ్రస్తులు మరియు ఉన్నిని శుద్దిచేయువారికి పాలకపునీతులైన పునీత బ్లెయిజ్ గారు అర్మేనియా(టర్కీ)లోని సెబాస్టియా(సివాస్) నందు జన్మించారు. వీరిని బ్లేజు, బ్లాసియుసు అని కూడా పిలుస్తారు. బ్లెయిజ్ గారి చరిత్ర అయితియూస్ అమిడెనుస్ గారి వైద్య రచనల ఆధారంగా తెలియజేయబడింది. గురువుగా అభిషేకింపక మునుపే వీరు గొప్ప వైద్యులు తరువాత వారు ఆత్మల రక్షణ వైద్యులుగా కీర్తిగడించారు. 4వ శతాబ్దపు తొలినాళ్ళలో సెబాస్టియా పీఠాధిపతిగా క్రైస్తవ వ్యాప్తికి వీరు విశేష కృషిచేశారు. ఇది తెలిసిన రోమా చక్రవర్తియైన 'లిసినియూసు' కోపోద్రిక్తుడై తన రాజప్రతినిధియైన అగ్రికోలసును పిలిచి క్రైస్తవాన్ని అంతం చేయమని శాసించాడు. వెంటనే బ్లెయిజ్ గారు అడవుల్లోకి పారిపోయి కొండగుహల్లో దాక్కున్నారు. వైద్యుడైన వీరు అడవుల్లో గాయపడిన జంతువులకు వైద్యం చేసేవారు. అవి కృతజ్ఞతతో ఆయన ఎడల సాధుస్వభావాన్ని చూపేవి. అడవుల్లో వున్న వీరిని కొందరు సైనికులు గుర్తించి రాజు చెంతకు తీసుకొని రాగా తిరిగి బ్లెయిజ్ గారిని చెరసాలలో వేయించి వేదహింసలకు గురిచేసి చివరకు ఆయనను శిరశ్చేదనం చేసి చంపారు. ఆయన మరణించిన 400 సం!రాలకు ఆయనను గూర్చిన అనేక కథలు వెలుగులోనికి వచ్చి ఆయనను గొప్ప పునీతుణ్ణి చేశాయి. అందులో ఒకటి, ఆయన జైల్లో వుండగా ఒక తల్లి, గొంతులో చేపముల్లు అడ్డుపడి బాదపడ్తున్న తన కుమారున్ని బ్లెయిజ్ చెంతకు తీసుకొని రాగా ఆయన ప్రార్థన చేసిన వెంటనే ఆ బాలుడు స్వస్థతపొందాడు. అప్పటినుండి ఆమె చీకటి జైల్లో వున్న బ్లెయిజ్ గారికి క్రొవ్వొత్తులను, ఆహారాన్ని కృతజ్ఞతగా అందించేది. అందుకే బ్లెయిజ్ గారి పండుగ రోజున బలిపూజలో ఆశీర్వదించబడిన రెండు క్రొవ్వోత్తులను శిలువ ఆకారంలో ఉంచి వాటితో విశ్వాసులను గురువు ఆశీర్వదిస్తారు.
పునీత బ్లెయిజ్ గారా మాకొరకు ప్రార్థించండి!
బంగారు మాట:
క్రీస్తే పరమ వైద్యుడు,
ఆయన మన ఆత్మల
నిత్య పోషకుడు.
(పునీత బ్లెయిజ్)
