నేటి పునీతుడు: పునీత జాన్ బోస్కో

ఫాదర్ ఆకుల ప్రసాద్
30 Jan 2026
సుగుణం: "యువజన ప్రేమికుడు, శ్రామికుడు"
సలేషియనుసభ వ్యవస్థాపకులు, పత్రికాసంపాదకుల పాలకపునీతులైన పునీత జాన్ బోస్కో గారు క్రీ.శ.1815లో ఇటలీలోని టూరిను మేత్రాసనంలో బెచ్చినందలి 'పీడ్ మోంటు' గ్రామంలో ఓ పేద ఇంటిలో జన్మించారు. చిన్ననాడే తండ్రిని కోల్పోయి తల్లియైన మార్గరేట్ పెంపకంలో పెరిగిన బోస్కోగారు వీధుల్లో తిరుగుతూ, పోట్లాడే పిల్లలను చూచి వారిని శాంతపర్చాలని, వారికి ఏదైనా చేయాలని తపనపడేవారు. గారడీ, కనికట్టు విద్యలతో పిల్లలను ఆకర్షించి వారిని గుడికి తీసుకెళ్ళేవాడు. వీరు 1841లో గురువుగా అభిషక్తులై 1944లో పునీత ఫీలోమేనా బాలికల వసతిగృహానికి చాప్లినుగా నియమితులైనారు. అయితే అది ఆయనకు ఇష్టంలేక పేదలు, ఆనాధబాలుర కొరకు ఒక వసతి గృహంను స్వంతంగా నెలకొల్పి తన తల్లిని సంరక్షకులుగా ఏర్పాటుచేశారు. టూరిన్ అంతటా పాఠశాలలు, హాస్టళ్ళు ఆరంభించారు. చదువుమాత్రమే కాక చేతివృత్తిపనులు, ముద్రణా పనులు, సాంకేతిక పనులు నేర్పించుటకు వృత్తితర్పీదు కేంద్రాలు, సాంకేతిక శిక్షణా తరగతులు ఆరంభించారు. క్రీ.శ.1859లో 12మంది అనుచరులతో 9వ పయస్ పోపుగారి అనుమతితో పునీత ఫ్రాన్సిసు సాలెసు పేరిట సలేషియను గురువుల సభను స్థాపించారు. మరియతల్లి మీద ఆపార ప్రేమకలిగిన బోస్కోగారు క్రీ.శ.1872లో నిత్యాసహాయమాత కన్యాస్త్రీల సభను కూడా స్థాపించారు. అలాగే లౌకికులతో మూడవ వర్గసభను కూడా నెలకొల్పారు. యువజనులను ప్రేమతో, స్నేహంతో గెలవాలనే బోస్కో ఆశయాలతో నేడు యావత్ ప్రపంచమంతా సలేషియాన్ సభ శాఖోపశాఖలుగా విస్తరిల్లి శ్రీసభనందు విశేషకృషిని చేస్తున్నది. క్రీ.శ. 1888 జనవరి 31న బోస్కోగారు పరలోక ప్రాప్తినొందారు. క్రీ.శ.1934లో 11వ భక్తినాధ పోపుగారు బోస్కోగారిని పునీతులుగా ప్రకటించారు.
పునీత జాన్ బోస్కో గారా మాకొరకు ప్రార్థించండి!
