పౌలు పరివర్తనం (25 జనవరి)

Father gopu praveen

24 Jan 2026

పరివర్తన - మలుపు త్రిప్పే సంఘటన.ఆదిమ క్రైస్తవ సంఘ చరిత్రలో పౌలుని మనోపరివర్తన ఒక గొప్ప సంఘటన. ఈ సంఘటన ఫలితంగా, యూద మత శాఖగా మాత్రమే గుర్తింపు నొందిన ఆదిమ క్రైస్తవ్యం, పౌలుద్వారా ఒక ప్రపంచ ఆధ్యాత్మిక ఉద్యమంగా, గొప్ప ప్రప్రంచ మతంగా పరిగణించబడినది.

పౌలు, జాతిపరంగా యూదుడు, సువార్తపరంగా అందరివాడు. పౌలుగారు సిలిసియాలోని తార్సుసు పట్టణంలో జన్మించినవాడు. యూదా మత సాంప్రదాయ పండితుడైన గమాలియేలు వద్ద యెరూషలేములో అభ్యాసం చేసాడు. యూద ధర్మశాస్త్రమును నిష్టగా ఆచరించిన పరిసయ్యుడు (ఫిలిప్పీ.3:4-5, గలతీ.1:13-14). ఒక పరిసయ్యుడిగా యూద ధర్మశాస్త్రం పట్ల ఎనలేని అభిమానం కలవాడు. కనుక ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా సాగుతున్న యేసు మార్గ ఉద్యమాన్ని సహించలేక పోయాడు.

ధర్మశాస్త్రము ప్రకారము సిలువ వేయబడినవాడు శాపగ్రస్తుడు (ద్వితీయ. 21:22-23). శాపగ్రస్తుడు మెస్సయా కాలేడని పౌలుని అభిమతము. క్రైస్తవులు శాపగ్రస్తుడైన యేసుని మెస్సయాగా పరిగణించడాన్ని పౌలు సహించలేక పోయాడు. స్తెఫాను మరణాన్ని ఆమోదించిన యువ యూదా అధికారిగా అపోస్తులుల చర్యలలో పరిచయ మయ్యాడు.

యెరూషలేములో ప్రభుమార్గాన్ని అవలంభిస్తున్న విస్వాసులను బంధించి, శిక్షించి, హింసించిన తరువాత దమాస్కసు పట్టణంలోనున్న క్రీస్తు మార్గావలంబికులను పట్టుకొని యెరూషలేమునకు బందీలనుగా తెచ్చి శిక్షించడానికి ప్రత్యేక అధికారంతో పోవుచున్నపుడు, దమాస్కసు నగరమును సమీపించినపుడు ఉహించని విధంగా పునీత పౌలుని మనోపరివర్తన జరిగింది. పర్యావసానంగా ఈ సంఘటన పౌలు జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని, విలువల్ని, దృక్పధాన్ని పూర్తిగా మార్చేసింది. మరియొక మాటలో వివరించాంటే....

హింసాకారున్ని, హింసితున్ని చేసింది, క్రీస్తు విరోధిని క్రీస్తు ఖైదీగా చేసింది. క్రీస్తు శిష్య సంఘ వ్యతిరేకిని క్రీస్తు సంఘ నిర్మాతగా మార్చింది, చివరికి యేసుని దర్శనం పౌలుని పరివర్తనం అయింది.

ఇటువంటి తరుణంలో,పునీత పౌలు తన ప్రేషిత కార్యసిద్దతలో ఎన్నో క్రైస్తవ సంఘాలను దర్శించారు. మరికొన్నిటిని స్థాపించారు.ఒక సంఘ పెద్దగా, క్రీస్తు శిష్యుడుగా ఆయా సంఘాలతో ఎన్నో క్రైస్తవ మత, ఆధ్యాత్మిక, వేదాంత,యధార్ద నీతి నియమాలు,విశ్వాస జీవితాంశాలను వివరించాడు, పరిష్కరించాడు.వాటిద్వారా క్రైస్తవ సంఘాలకు హేతుబద్దమైన సార్ధకతను చేకూర్చాడు.

పౌలు బోధను చేయటమేగాదు, ఆ బోధకనుగునముగా స్వయంగా జీవించాడు. నాడు పౌలు ఆదరించిన పారదర్శక, అధికార పూర్వకమైన క్రైస్తవ సిద్దాంతాలు నేటికి ప్రాతిపదికలుగా ఉన్నాయి. పునీత పౌలు సంబోధించిన ప్రతి అంశం నాటి సమస్యను వివరించటమేగాక, ఆయా సంఘాల ఆర్ధిక, మత పరిస్థితులను సరియైన పద్దతిలో ప్రవేశపెట్టి, సంఘ ఔన్నత్వానికి సోపానాలు వేసింది. పునీత పౌలునిలో ఇంత పరివర్తనకు మూలం,పునరుత్థాన యేసుని దర్శనానుభవం.పెద్ద వరద వచ్చి మొత్తం దోచేసుకొని పోయినట్లు, యేసుని దర్శనానుభవ వెల్లువలో పౌలునిలో మరణం, జీవం రెండు ఏక కాలంలో జరిగిపోయాయి. ఈ అనుభవ వెలుగులో ధర్మశాస్త్ర నీతికి మరణించి క్రీస్తుని విశ్వాసానికి, క్రీస్తునిద్వారా, క్రీస్తుని యందలి జీవానికి జన్మించి, పరివర్తనం చెందాడు. కనుకనే, పునరుత్థాన యేసుని దర్శనానుభవం బలమైనది. ఆయన దర్శనాన్ని పొందిన వారందరూ క్రొత్త వ్యక్తులై పోయారు, బలవంతులైయ్యారు, దైర్యవంతులైయ్యారు మరియు ప్రేషిత కార్యసాధనలో సాక్షులుగా నిలిచారు. అటువంటి గొప్ప వ్యక్తులలో, అపోస్తలులలో ఒకరే పునీత పౌలుగారు. మనం కూడ క్రీస్తుని దర్శనానుభవ ప్రేరణలో గొప్ప విశ్వాసులుగా, సాక్షులుగా నిలుస్తూ నూతన పరివర్తనకు, నూతన మనస్సుకు సోపానాలు వేద్దాం.మన జీవితాన్ని పునీతం గావించుదాం.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN