నేటి సువిశేష సందేశం

Father gopu praveen
23 Jan 2026
2వ సామాన్య శనివారం
2 సమూ 1:1-4,11-12,19,23-27
కీర్తన 80:2-3,5-7
మార్కు 3:20-21
ధ్యానం:
"ఆయనకు మతి చలించిందని ప్రజలు పలుకుచుండుటచే, ఆయనను అచ్చటి నుండి తీసుకొని వెళ్ళుటకు ఆయన బంధువులు వచ్చిరి”.
ఒక పల్లెటూరు వ్యక్తి బస్సు ఎక్కాడు. నిలబడేందుకు కూడా వీలుగాని రద్దీ ఉండటంతో వెళ్ళి డ్రైవర్ పక్కన నిలుచున్నాడు. అయితే డ్రైవర్ మాటిమాటికి గేర్ రాడ్ను ముందుకు, వెనుకకు ఊపుతూ లాగుతూ బస్సును నడుపటం గమనించి, అది డ్రైవర్కు ఇబ్బంది కల్గిస్తోందని, అందుకే దానిని తొలగించేందుకు డ్రైవర్ ప్రయత్నిస్తున్నాడి అనుకున్నాడు. బస్సు ఒక చోట ఆగగానే ఆ పల్లెటూరి వ్యక్తి గభాలున ఆ రాడ్ను పెరికేసి, "ఇంతసేపు మీరు దీన్ని పెరికి వేయాలనే కదా ప్రయాసపడ్డారు" అని డ్రైవర్తో అన్నాడు. డ్రైవర్ గేర్ మార్చుతూ వేగాన్ని పెంచటం లేదా తగ్గించటం చేస్తాడని అతనికి అర్థం కాలేదు. అలాగే యేసు ప్రభువు చేస్తున్న పనులు ఆయన కుటుంబసభ్యులకే అర్థంగాక, ఇతరుల మాటలు విని ఆయనను తీసుకొని వెళ్ళాలని వచ్చారు.
చాలామంది ఇహలోక జీవితానికి, పరలోక జీవితానికి మధ్యగల సంబంధాన్ని కనుగొన లేక పోతున్నారు. చాలా మందికి ఈ లోక సంబంధాలు మాత్రమే చాలా ముఖ్యమైనవి. పరలోక జీవితం కోసం జీవించటం, శాశ్వత జీవితాన్ని ఆశించటం అనేది తమకు సంబంధించని పరాయి విషయంగా భావిస్తుంటారు. ప్రభువైన యేసు ఒక కారణంతో, ఒక లక్ష్యంతో ఉన్నారని, అది కొన్ని ప్రేషిత కార్యాలతో కూడుకున్నదని, దానికొక ప్రత్యేక ప్రణాళిక ఉందని, ఆ కార్యాలే తమను శాశ్వత జీవితానికి సిద్ధం చేస్తాయని కనుగొనలేక పోతున్నారు.
యేసుకు తన జన్మకారణం, లక్ష్యం బాగా తెలుసు. అందుకే సువార్త ప్రకటన కోసం తన కుటుంబ సభ్యులను కూడా ప్రక్కన పెట్టేందుకు వెనుకాడు లేదు. దైవరాజ్య ఆశ్రిత ప్రజలనే తనవారిగా వ్యక్తీకరించాడు.
