నేటి పునీతుడు: పునీత విన్సెంట్ పల్గోటి

ఫాదర్ ఆకుల ప్రసాద్
21 Jan 2026
సుగుణం: "క్రైస్తవ సాంఘీక సంస్కర్త"
పునీత విన్సెంట్ పల్లోటి గారు రోము నందు క్రీ.శ.1795 ఏప్రిల్ 21న జన్మించారు. తన 23వ ఏట గురువుగా అభిషేకించబడ్డారు.రోములోని 'స్పెయిన్ జా' విద్యాలయంలో 10సం!రాలు దైవశాస్త్రాన్ని బోధిస్తూ,వివిధ విధ్యాలయాల్లో ఆధ్యాత్మిక మార్గదర్శిగా తన సేవలందిoచారు.పూజకు ముందు పాపసంకీర్తనాలు వింటూ,నాలుగుకూడళ్లలో సువార్తా ప్రబోధం చేస్తూ వైద్యశాలలు,చెరసాలలు సందర్శిస్తూ,జ్ఞానవడకాలు ఏర్పాటుచేసేవారు.తన సువార్త జ్ఞానం ప్రపంచమంతటా విస్తరించు నిమిత్తం క్రీ.శ.1835లో 'కతోలిక అపోస్టలేట్ సొసైటీ' అనగా 'కతోలిక ప్రేషిత సభ'ను పల్లోటిగారు స్థాపించారు.ఈ సభవారినే పల్లోటియనులు అంటారు.అలాగే కన్యాస్త్రీల ప్రేషిత కతోలిక సభను కూడా నెలకొల్పారు.కతోలికత్వం వీడిన వారిని తిరిగి రప్పించే కార్యంలో సామాన్య క్రైస్తవుల సహకారం ముఖ్యమని భావించి వీరు ఎంతగానో కృషిచేశారు.పల్లోటిగారు ఎన్నో సాంఘీక అభ్యుదయ కార్యక్రమాలు చురుగ్గా నడిపించారు. వీరి ఆశయసాధనలో పాలుపంచుకొనిన ఓ యువగురువు తరువాత కాలంలో 13వ లియో పోపుగారిగా శ్రీసభను పాలించారు.ప్రభువు పుట్టిన ఎనిమిదవ రోజున ఏసు అనిపేరుపెట్టబడిన అష్టమదినాన ప్రభు సాక్షాత్కారపండుగను వైభవంగా కొనియాడే ఆచారాన్ని రోమునందు విన్సెంట్ పల్లోటిగారే ప్రవేశపెట్టారు.శ్రీసభను నూతన చైతన్యంతో నింపిన వీరు క్రీ.శ.1850 జనవరి 22న పరలోకప్రాప్తినొందారు.క్రీ.శ.1963లో 23వ జాన్ పోపుగారు పల్లోటి గారిని పునీతులుగా ప్రకటించారు.విన్సెంట్ అనగా జయము, గెలుపు అని అర్థం.
పునీత విన్సెంట్ పల్లోటి గారా మాకొరకు ప్రార్థించండి!
బంగారు మాట:
దేవుడు మనలను పరిపూర్ణంగా
ప్రేమిస్తున్నాడు గనుక మనం
మనతోటి వారిని పరిపూర్ణంగా
ప్రేమింప బద్దులమైవున్నాము”
(పునీత విన్సెంట్ పల్లోటి)
