నేటి పునీతుడు - పునీత పెనాఫోర్ట్ రేమండ్

ఫాదర్ ఆకుల ప్రసాద్
06 Jan 2026
రేమండ్ గారు స్పెయిన్ లోని కలోనియానందలి పెనాఫోర్ట్ నందు క్రీ.శ.1175న ఉన్నత కుటుంబంలో జన్మించారు. బార్సెలోనా నందు తర్కశాస్త్ర బోధకునిగా 15సం! రాలు పనిచేసి, అటుతరువాత ఇటలీలోని బోలోగ్నా నందు శ్రీసభ న్యాయశాస్త్రం, సామాజిక శాస్త్రాలలో డాక్టరేట్ పొంది 1222 లో కొత్తగా స్థాపించబడిన పునీత దోమినికు సభలో చేరి గురువుగా అభిషేకంపొందారు.వీరు పునీత పీటర్ నొలాస్కోగారితో కలిసి కారుణ్య మేరిమాత సభను స్థాపించారు.రేమండ్ గారు ఒక శక్తివంతమైన క్రీస్తు సువార్తా బోధకునిగా ప్రసిద్ధిచెంది కఠిన విగ్రహారాధకులైన పదివేల మందిని క్రీస్తు విశ్వాసంలోకి నడిపించారు.క్రీ.శ.1230లో గ్రెగోరి పోపుగారికి అంతరంగిక సహాయకునిగా నియమింపబడి జగద్గురువులు నిర్ణయాసంచయము పేర శ్రీసభచట్టాలను 5 సంపుటాలలో వ్రాశారు.క్రీ.శ.1235 లో స్పెయిన్ లోని తర్రాగోనా పీఠానికి బిషప్పుగా నియామకపత్రం వెలువడగా అనారోగ్యకారణంచే తన నియామకానికి రాజీనామా చేశారు. తిరిగి బర్సెలోనా చేరి దోమినికను సభ 3వ మఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించి సభ నిబంధనావళికి ఆధునిక మెరుగులు దిద్దారు. రేమండ్ గారి ప్రోత్సాహంతోనే పునీత తోమస్ అక్వినాసు గారు సుప్రసిద్దమైన "సుమ్మకాంట్రాజెంటైల్స్" పుస్తకాన్ని సంపూర్తిచేశారు. వీరు తన నూరవ ఏట 1275 జనవరి 6న మరణించగా,1601లో 8వ క్లెమెంట్ పోపుగారు రేమండ్ గారిని పునీతులుగా ప్రకటించి వీరిని న్యాయశాస్త్ర విద్యార్థుల పాలకపునీతులుగా నియమించారు.
